BIG News: రెవెన్యూ అధికారుల బాగోతం.. ఫోర్జరీ డాక్యుమెంట్లతో రూ.200 కోట్ల స్థలానికి క్లియరెన్స్!

by Kema Shiva Kumar |

అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూముల క్లియరెన్స్ బాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నది.

BIG News: రెవెన్యూ అధికారుల బాగోతం.. ఫోర్జరీ డాక్యుమెంట్లతో రూ.200 కోట్ల స్థలానికి క్లియరెన్స్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూముల క్లియరెన్స్ బాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేటలో చోటు చేసుకున్న అక్రమాలపై అధికార వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. సర్వే నం.35/AA/1, 35/E లో సుమారు రూ. 200 కోట్లు విలువ చేసే మూడెకరాల స్థలంపై ఓ నిర్మాణ సంస్థ ఫిర్యాదు చేసింది. ఆ స్థలానికి సంబంధించి జారీ చేసిన ఎన్వోసీ బోగస్ అని, ఫోర్జరీ పత్రాలు సమర్పించారని, వాటిని పరిశీలించకుండానే క్లియరెన్స్ ఇచ్చారని రెవెన్యూ అధికారులు గుర్తించారు. కొన్ని ఎన్వోసీల జారీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని కలెక్టర్ కు లేఖ ద్వారా తెలియజేశారు. అయితే 2016 నుంచి జారీ చేసిన యూఎల్సీ ఎన్వోసీలపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

బోగస్ పత్రాలతో..

గుట్టల బేగంపేట సర్వే నం.35/AA/1లో 0.36 ఎకరాలు, 0.24 ఎకరాలు, 35/Eలో 1.20 ఎకరాలు.. మొత్తం 3 ఎకరాలు తప్పుడు, ఫోర్జరీ, ఫ్యాబిక్రేటెడ్, అన్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ తో యూఎల్సీ క్లియరెన్స్ ఇచ్చారని ఓ నిర్మాణ సంస్థ ఫిర్యాదు చేసింది. తప్పుడు పత్రాలతో మ్యుటేషన్ చేయించుకున్నారని, ఆ ప్రొసీడింగ్స్ ను రద్దు చేయాలని కోరింది. దానికి సంబంధించి అన్ని ఆధారాలను సమర్పించింది. దీంతో రెవెన్యూ అధికారులు ఎంక్వయిరీ చేశారు. సర్వే నం.35లో 13.05 ఎకరాలు పట్టా ల్యాండ్ గా ఉంది. ఇది పూర్తిగా యూఎల్సీగా డిక్లేర్ చేయబడింది. అలాగే సర్వే నం.33, 34, 36, 37, 38, 39 ల్లో F1/2917/76, F1/3564/76, F1/5539/76 ల ద్వారా బి.గణపతిరావు, ఇతరులు కలిసి 2,39,560 చ.మీ. స్థలం యూఎల్సీగా డిక్లేర్ చేశారు. అలాగే సీసీ నం.F1/6266/76 ద్వారా జి.రఘునాథరావు 39,462 చ.మీ. స్థలం డిక్లేర్ అయ్యింది. అంటే సర్వే నం.33 నుంచి 39లో మొత్తం విస్తీర్ణం 91.24 ఎకరాలు కాగా, అందులో 68.38 ఎకరాలు(2,79,002 చ.మీ.) యూఎల్సీగా గుర్తించారు.

చెల్లని ఎన్వోసీ

సర్వే నం.35/పార్టు గా చూపిస్తే ప్రొసిడింగ్స్ నం.B/545/2016, తేదీ.30.06.2016 ద్వారా మ్యుటేషన్ చేశారు. సదరు సర్వే నంబరులోని స్థలాన్ని విప్ప భూపతిరెడ్డి, చిమ్ముల మల్లారెడ్డిల పేరిట మ్యుటేషన్ చేశారు. దానికి గాను పాత పట్టాదారులైన శేషగిరిరావు, నర్సారెడ్డిల నుంచి కొనుగోలు చేసిన సేల్ డీడ్ డాక్యుమెంట్ నం.306/ఏఆర్/97, తేదీ.12.06.1997, హైదరాబాద్ యూఎల్సీ స్పెషల్ ఆఫీసర్ మెమో నం.F1/A6/716/NOC/2011, తేదీ.25.05.2011 ని జత చేశారు. విచారణలో సేల్ డీడ్ అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ గా తేలింది. కె.నర్సారెడ్డి, డి.శౌరిరెడ్డి, బి.అమానుల్లా సర్వే నం.35లోని ల్యాండ్ ని 1990లోనే 3 ఎకరాల స్థలాన్ని అన్ రిజిస్టర్డ్ సేల్ చేసినట్లు గుర్తించారు. ఈ అన్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ ను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ వ్యాలిడిటీ చేస్తూ నం.306/ఎఆర్/97 ఇచ్చినట్లు స్పష్టమైంది. హైదరాబాద్ యూఎల్సీ స్పెషల్ ఆఫీసర్ మెమో నం.F1/A6/716/NOC/2011, తేదీ.25.05.2011 ద్వారా జారీ చేసిన మెమోను బట్టి యూఎల్ (సీఅండ్ఆర్) రిపీల్ యాక్ట్, 1999 పరిధిలోకి రాదని తేల్చారు. రంగారెడ్డి జిల్లా యూఎల్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లేఖ నం.F1/181/2024, తేదీ.3.7.2024 ప్రకారం యూఎల్సీ యాక్ట్ సెక్షన్ 4(1)(బి) ద్వారా డిక్లరేషన్ లోని 40,462 చ.మీ. విస్తీర్ణంలో కేవలం 1000 చ.మీ. మాత్రమే వర్తిస్తుంది. సర్వే నం.35లోని సీలింగ్ ల్యాండ్ 3 ఎకరాలకు ఎన్వోసీ పొందిన పట్టాదారులు ధరణి పోర్టల్ లో నాలా కన్వర్షన్ కోసం అప్లయ్ చేసుకున్నారు. వెంటనే నాలా కన్వర్షన్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. యూఎల్సీ స్పెషల్ ఆఫీసర్ జారీ చేసిన మెమో క్లియర్ గా లేదు. దాంతో ఎన్వోసీ సరైంది కాదని తేల్చారు. అందుకే ఈ కేసులో పూర్తి పత్రాలను వెరిఫై చేయాల్సిన అవసరం ఉందని రెవెన్యూ అధికారులు నిర్ధారించారు.

రూ.360 కోట్ల విలువైన స్థలానికి స్కెచ్

శేరిలింగంపల్లిలో హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైరైజ్డ్ ప్రాజెక్టుల చెంతనే మిగిలిన సీలింగ్ సర్ ప్లస్ ల్యాండ్ కు భారీ స్కెచ్ వేశారు. గుట్టల బేగంపేట సర్వే నం.60/1లో 50,395 చ.మీ.(60271 చ.గ. అంటే 12 ఎకరాల పైమాటే!) ఇందులో ఇప్పుడు ఖాళీగా ఉన్నది 15,118 చ.మీ.(18080 చ.గ. అంటే సుమారు 3.30 ఎకరాలు). గజం విలువ రూ.2 లక్షల పైమాటే. అంటే ఈ ఖాళీ జాగ విలువ అక్షరాల 360 కోట్లకు పైగానే. ఈ స్థలాన్ని దక్కించుకునేందుకు సమర్పించిన డాక్యుమెంట్లపై డౌట్స్ ఉన్నాయి. గతంలో పని చేసిన అధికారులంతా ఈ ఫైల్ ను రిజెక్ట్ చేశారు. డాక్యుమెంట్లు సరైనవి కావని, బోగస్ పత్రాలు ఉన్నాయని గతంలో పని చేసిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తన రిపోర్టులో పేర్కొన్నారు. అయితే మళ్లీ ఈ ఫైల్ కు ఆమోదముద్ర వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.

అది సీలింగ్ ల్యాండ్..

* హైదరాబాద్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ స్పెషల్ ఆఫీసర్ లేఖ నం.A4/298/2010, Dated: 10.02.2012 ప్రకారం F1/4277/03 ద్వారా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేట సర్వే నం.60/1లో 50395 చ.మీ. స్థలం సీలింగ్ సర్ ప్లస్ గా ఉంది. అందులో 13,532 చ.మీ. రెగ్యులరైజ్ చేశారు. 21,744 చ.మీ. స్థలంలో నిర్మాణాలు వెలిశాయి. ఖాళీగా 15,118 చ.మీ. స్థలం ఉంది. కేవలం 600 చ.మీ. విస్తీర్ణంపైన కేసు నడుస్తున్నదని రికార్డుల్లో పేర్కొన్నారు. ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది.

* అలాగే F/3272/6(1)/06 ప్రకారం సర్వే నం.30, 31లో 8,407 చ.మీ. స్థలం ఉండేది. ఏ ప్రాతిపదికనో ఏమో గానీ మొత్తం విస్తీర్ణాన్ని రెగ్యులరైజ్ చేసేశారు.

* F1/180/82 ప్రకారం సర్వే నం.45/పి లో 15,596 చ.మీ. స్థలం ఉండేది. దాంట్లో 6,111 చ.మీ. స్థలాన్ని రెగ్యులరైజ్ చేశారు. 4,806 చ.మీ. స్థలంలో నిర్మాణాలు ఉన్నాయి. 4,679 చ.మీ. స్థలం ఖాళీగా ఉంది.

* F1/1777, 1780/76, 129/78 ప్రకారం సర్వే నం.47 లో 63,028 చ.మీ. సీలింగ్ ల్యాండ్ ఉండేది. ఇందులోనూ 44,120 చ.మీ. రెగ్యులరైజ్ చేశారు. 13,236 చ.మీ. స్థలంలో నిర్మాణాలు వెలిశాయి. 5,672 చ.మీ. స్థలం ఖాళీగా ఉన్నది.

* ఈ సీలింగ్ సర్ ప్లస్ ల్యాండ్స్ పూర్తిగా ప్రభుత్వానివే. రూ.వేల కోట్ల విలువజేసే స్థలాలను కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వీటిపై ప్రతి ఫైల్ ను పున:పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story