- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BIG News: ఎమ్మెల్సీ పదవిపై నాయకుల నజర్..! అధికార పార్టీలో ఫుల్ కాంపిటీషన్
అసెంబ్లీ కోటా ఎమ్మెల్సీ పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొన్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ కోటా ఎమ్మెల్సీ పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొన్నది. ఓ వైపు సీనియర్లు, మరోవైపు జూనియర్ లీడర్లు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ విజయం కోసం తాము పడిన కష్టాలను వివరించేందుకు సిద్ధం అవుతున్నారు. సీఎం రేవంత్ దృష్టిలో పడేందుకు ప్రణాళికలు రచిస్తూనే ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యా బలం మేరకు కాంగ్రెస్ 4 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. కానీ, అందులో ఒక సీటును మజ్లీస్ పార్టీకి ఇవ్వాలనే యోచనలో ఏఐసీసీ ఉన్నట్లు తెలిసింది. ఒకవేళ మజ్లీస్‌కు ఒకసీటు ఇస్తే కాంగ్రెస్ మూడు స్థానాలకే పరిమితం కావాల్సి వస్తుంది.
పైసా ఖర్చు లేకుండా పదవి..
ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యే, ఎంపీ లేదా చివరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేయాలన్నా వందల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పోలింగ్ పూర్తయ్యే వరకు పార్టీ కేడర్‌కు ఏ చిన్న అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి అన్ని రకాలైన వసతులు కల్పించాలి. కానీ, అసెంబ్లీ కోటా ఎమ్మెల్సీ పదవి కోసం పైసా ఖర్చు అవసరం లేదు. కేవలం పార్టీ పెద్దల ఆశీస్సులు ఉంటే సరిపోతుంది. ఏకంగా ఆరేళ్ల పాటు పదవిలో కొనసాగవచ్చు. ఇన్ని వెసులుబాట్లు ఉండటంతో అసెంబ్లీ కోటా ఎమ్మెల్సీ పదవి కోసం లీడర్లు తెగ పోటీ పడుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తాము ఎంత కష్టపడ్డామో వివరిస్తూ పేజీల కొద్ది బయోడేటాలను హైకమాండ్‌కు పంపుతున్నట్లు తెలిసింది.
మజ్లీస్‌తో స్నేహం..
గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. అలాగే పార్టీ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఒకవేళ హస్తం పార్టీ ఏదైనా కార్యక్రమానికి పిలుపు ఇస్తే విజయవంతం చేయడానికి కేడర్ లేదనే విమర్శలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా గ్రేటర్ పీఠం దక్కించుకోవడం కష్టమనే అనుమానాలు నెలకొన్నాయి. అందుకే మజ్లీస్ సహకారం అవసరమని అభిప్రాయానికి వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం.. ఆ పార్టీతో దోస్తీ చేయాలని భావిస్తోంది. దీనిలో భాగంగా ఒక ఎమ్మెల్సీ సీటును ఆ పార్టీకి ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఎంఐఎం నేతలు కూడా అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్‌తో స్నేహాన్ని తెంచుకుని కాంగ్రెస్‌తో సన్నిహితంగా మెలుగుతున్న విషయం తెలిసిందే.
ఓడిన నేతలకు ఇస్తారా?
ఒక సీటు మజ్లీస్ పార్టీకి ఇస్తే మిగిలిన మూడు సీట్లను ఎస్సీ, బీసీ, ఓసీ నేతలకు ఇస్తారని పార్టీలో ప్రచారం జరుగుతున్నది. అయితే, ఆశావహలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వీరిలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారే అధికం. ఆ లిస్టులో ఒక్క లీడర్‌కు చాన్స్ ఇస్తే మిగతా నేతల నుంచి డిమాండ్లు, అలకలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే గతంలో పోటీచేసిన లీడర్లకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేది లేదనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు సమాచారం. కానీ, కొందరు సీనియర్లు మాత్రం పట్టువీడకుండా ఢిల్లీ లెవల్‌లో లాబీయింగ్ చేస్తున్నట్లు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ఆశావహులు జాబితా ఇలా..
ఓసీ వర్గం నుంచి..
కే. జానారెడ్డి, టీ.జీవన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, టి. జగ్గారెడ్డి, పారిజాతా నర్సింహారెడ్డి, హరివర్ధన్ రెడ్డి, జగదీశ్వర్ రావు, అల్గుబెల్లి ప్రవీణ్ రెడ్డి, నర్సారెడ్డి భూపతిరెడ్డి, కుసుమ కుమార్, సామా రామ్మోహన్ రెడ్డి.
బీసీ వర్గం నుంచి..
మధుయాష్కీ గౌడ్, ఎగ్గె మల్లేశం, ఈరావత్రి అనిల్, సంగిశెట్టి జగదీశ్వర్ రావు, సునీతా ముదిరాజ్, నీలం మధు, వజ్రేశ్ యాదవ్, చెవిటి వెంకన్న, పున్న కైలాశ్ నేత, నవీన్ యాదవ్, చరణ్ కౌశిక్ యాదవ్.
ఎస్సీ వర్గం నుంచి..
అద్దంకి దయాకర్, సంపత్, సింగాపురం ఇందిర, కొండ్రు పుష్పలీల, పిడమర్తి రవి, దొమ్మాట సాంబయ్య, రాచమళ్ల సిద్ధేశ్వర్, దర్శన్, జ్ఞానసుందర్, భీంభరత్.
మైనార్టీ వర్గం నుంచి..
షబ్బీర్ అలీ, మహ్మద్ అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్, అజ్మతుల్లా హుస్సేనీ, ఫయూమ్.
బీఆర్ఎస్ నుంచి..
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక సీటు దక్కే అవకాశం ఉండగా.. దాన్ని సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్, బాల్కసుమన్, మహమ్ముద్ అలీ ఆశిస్తున్నట్లు తెలిసింది.






