BIG News: అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నిర్వాకం.. ESI, PF సొమ్ము పొలిటికల్ ఫండింగ్‌కు?

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-14 02:10:27  IST  )

రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు విధానంలో భారీ లోపాలు వెలుగుచూస్తున్నాయి.

BIG News: అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నిర్వాకం.. ESI, PF సొమ్ము పొలిటికల్ ఫండింగ్‌కు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు విధానంలో భారీ లోపాలు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఈఎస్ఐ, ఈపీఎఫ్ సొమ్మును ఏజెన్సీ నిర్వాహకులు మాయం చేస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వాలు జీతాల భారాన్ని తగ్గించుకోవడానికి ఉమ్మడి ఏపీ నుంచి అవుట్ సోర్సింగ్ విధానాన్ని కొనసాగిస్తూ వస్తున్నాయి. గతంలో మొదలైన అవుట్ సోర్సింగ్ విభాగాల్లో ప్రస్తుతం 2 లక్షలకు పైగా ఉద్యోగులు సచివాలయం నుంచి మండల, గ్రామస్థాయి వరకు సేవలందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో అవుట్​ సోర్సింగ్​ ఏజెన్సీలు ఉన్నాయి. ఓవైపు సమాన పనికి సమాన వేతనం అనే డిమాండ్​వేతన జీవుల నుంచి వస్తుండగా ప్రభుత్వం అందించే జీతం సైతం సరిగా ఉద్యోగులకు చేరడం లేదు.

ఈపీఎఫ్, ఈఎస్ఐ నిధుల జమలో స్కామ్..

ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అవుట్​‌సోర్సింగ్​ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాన్ని కల్పించింది. ఉద్యోగుల వేతనంలో ఈపీఎఫ్​ 12 శాతం, ఈఎస్‌ఐ 0.75 శాతం బేసిక్​నుంచి కట్​చేస్తున్నారు. దీనిపై అవుట్‌సోర్సింగ్​ఉద్యోగులు అభ్యంతరం చెప్పలేదు. కానీ.. ప్రభుత్వ లక్ష్యాన్ని అవుట్​సోర్సింగ్​ఏజెన్సీలు మాత్రం అమలు చేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఏళ్లుగా తమ ఖాతాల్లో జమ కావాల్సిన ఈపీఎఫ్,​ఈఎస్‌ఐ డబ్బులను ఏజెన్సీలు జమ చేయడం లేదని, దీనితో తాము నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యధిక ఏజెన్సీలు ఇదే తరహా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రతి నెలా ఉద్యోగుల జీతం నుంచి కట్​చేసుకుంటున్న ఈపీఎఫ్, ఈఎస్‌ఐ మొత్తాన్ని తమ జేబుల్లోకి మళ్లించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇలా ప్రతి ఏజెన్సీ గత కొన్ని సంవత్సరాలుగా కోట్లలో లబ్ధిపొందిందని, అడిగినప్పుడల్లా అప్పుడు జమచేస్తాం, ఇప్పుడు జమ చేస్తామంటూ బుకాయిస్తున్నారని.. గట్టిగా నిలిదీస్తే ఉన్నతాధికారుల ద్వారా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను బెదిరింపులకు గురిచేయడం, బ్లాక్ మెయిల్​చేస్తున్నారని మండిపడుతున్నారు. అధికారుల ద్వారా ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఉద్యోగుల సొమ్ముతో ఎన్నికలకు ఫండింగ్..

తమకు రావాల్సిన ఈపీఎఫ్, ఈఎస్‌ఐ జమ కాకపోవడంతో ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో చికిత్స పొందలేకపోతున్నామని వాపోతున్నారు. ఈఎస్‌ఐ సౌకర్యం ఉందనే ధీమాతో తాముంటే.. తమను ఏజెన్సీలు మోసం చేస్తున్నాయని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఈపీఎఫ్ డబ్బులను ఏజెన్సీలు తమ అవసరాలు, ఇతర పెట్టుబడులకు, రాజకీయ నాయకులకు పెట్టుబడిగా వాడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఉమ్మడి వరంగల్​జిల్లాలోని 2 నియోజకవర్గాల అభ్యర్థులకు ఎన్నికలకు అవసరమైన మొత్తంలో ఈ ఏజెన్సీలు అత్యధిక భాగంగా సర్దుబాటు చేశాయని, ఇతర ఏజెన్సీలతో మధ్యవర్తిత్వం చేయించి మరీ జిల్లాలోని ఏజెన్సీల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి ఎన్నికల ఖర్చుగా ఇచ్చాయని ఉద్యోగులు చెబుతున్నారు. ఇలా రాజకీయ నాయకులకు పెట్టుబడి పెట్టే స్థాయికి వీరంతా ఎదిగారని, అవి తమకు న్యాయంగా దక్కాల్సిన డబ్బులని వెల్లడించారు. ఉన్నతాధికారులకు సైతం కొంత మొత్తం ముట్టడంతోనే ఏజెన్సీలపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అదే సమయంలో వారి రికార్డులను ఏ మాత్రం పరిశీలించడంలేదని చెబుతున్నారు.

బీఆర్ఎస్ పెద్దల అండదండలతోనే..

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఆనాటి పెద్దల అండదండలతో ఆ పార్టీకి చెందిన బినామీలు, పార్టీ నాయకులే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను ఏర్పాటు చేశారు. ఆర్థికంగా తమ పార్టీ నాయకులు లబ్ధిపొందాలనే ఉద్దేశంతో కొందరు కీలకనేతలు వారి అనుచరులు, బంధువులతో కలిసి ఏజెన్సీలను ఏర్పాటు చేశారు. ఆనాడు సైతం ఏజెన్సీ నిర్వాహకులపై ఫిర్యాదు చేసినా గత బీఆర్ఎస్ పెద్దలు చూసి చూడనట్లు వ్యవహరించారు. కానీ, కాంగ్రెస్​ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అవే ఏజెన్సీలు కొనసాగుతుండటంపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ తరహాలో ప్రత్యేక కార్పొరేషన్​ ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి, ఉద్యోగులకు లబ్ది జరుగుతుందని అంటున్నారు.ఐతే.. ఏజెన్సీల నిర్వాహకులు నష్టపోతారనే ఉద్దేశంతో కొందరు అధికారులు ఏపీ తరహాలో కార్పొరేషన్​ ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రత్యేక కార్పొరేషన్‌తో దోపిడీకి అడ్డుకట్ట..

ఏపీ తరహాలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కోసం ఇప్పటికే అధికారులు అమరావతి వెళ్లి అక్కడి కార్పొరేషన్​ ఏర్పాటుపై అధ్యయనం చేశారు. దానిని అమలు చేయడం ద్వారా ఉద్యోగులకు ఎక్కువ మొత్తంలో వేతనం లభిస్తుందని, ఏజెన్సీల పేరుతో జరిగే దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని ఉద్యోగులు చెబుతున్నారు. అయితే, కావాలనే కార్పొరేషన్ ఏర్పాటు కాకుండా ఏజెన్సీ నిర్వాహకులు అడ్డుపడుతున్నట్లు సమాచారం. అసలు ఏజెన్సీల్లో నిధుల గోల్‌మాల్ వ్యవహారం ఎలా బయటకు వచ్చిందో ఒక్క పరిశీలిస్తే.. కొత్తగూడెం జిల్లా మిషన్ భగీరథలో చిప్పనపల్లి నాగరాజు గత 8 ఏళ్లుగా ఎలక్ట్రిషన్‌గా పనిచేస్తున్నారు. అయితే, ఈఎస్ఐ ఆసుపత్రిలో చూపించుకుందామని సారపాకకు వచ్చిన అతనికి షాక్ తగిలింది. సారపాకలో పాత ఎగ్జిట్ అయిన కంపెనీ మాత్రమే చూపిస్తుండగా.. ప్రస్తుతం పనిచేస్తున్న ఎన్‌సీసీ కంపెనీ ప్రమేయం లేకుండా.. 8 ఏళ్లలో 5 కంపెనీలను మార్చినట్లు గుర్తించారు. కొత్తగా సన్ రైస్‌లో జాయిన్ అయ్యారని.. ఇప్పుడు చేస్తున్న ఎన్‌సీసీ కంపెనీ పేరు లేదని ఈఎస్ఐ సిబ్బంది చెప్పారని సదరు బాధిత ఉద్యోగి వాపోయాడు.

రాష్ట్ర వ్యాప్తంగా ఈపీఎఫ్, ఈఎస్‌ఐ జమ చేయని కొన్ని ఏజెన్సీల వివరాలు..

- లెజెండ్ కార్పొరేట్ సంస్థ.. నాగర్‌‌కర్నూల్‌లోని ఈ సంస్థ 2022 డిసెంబర్​నుంచి 2024 డిసెంబర్ వరకు ఈపీఎఫ్​చెల్లించలేదు. దీని కింద 53 మంది పనిచేస్తున్నారు.

- జ్యోతి కంప్యూటర్స్ ఏజెన్సీ‌.. దీని కింద ఉన్న అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్ గత 9 నెలలుగా ఈఎస్‌ఐ, పీఎఫ్ చెల్లించడం లేదు. ఇందులో 800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

- ఎక్స్‌ట్రీమ్​ఇన్ఫర్మేషన్​ ఏజెన్సీ.. నగరంలోని కాచిగూడలో ఉన్న ఈ సంస్థ.. దేవాదాయ శాఖలోని ఉద్యోగులకు 11 నెలలుగా ఈఎస్‌ఐ, ఈపీఎఫ్​చెల్లించడం లేదు.

- మేడ్చల్ ​జిల్లాలోని సియారా సాఫ్ట్‌వేర్ ​సొల్యూషన్స్ ​ప్రైవేటు లిమిటెడ్ ఏజెన్సీ జనవరి 2019 నుంచి మార్చి 2023 వరకు ఈపీఎఫ్‌ను పెండింగ్ పెట్టింది.

- గ్లోబల్ కాంట్రాక్టర్ ఏజెన్సీ కింద రెవెన్యూ శాఖ ఎలక్షన్ సెల్‌లో 119 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వీరికి 16 నెలలగా పీఎఫ్ ​అమౌంట్​ జమ కావడం లేదు.

- సిద్దిపేట జిల్లాలో సోషల్​ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ​ప్రీమెట్రిక్​ హాస్టల్‌లో 50 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరంతా సాఫ్ట్‌టెక్​ ఏజెన్సీ కింద పనిచేస్తుండగా.. 11 నెలలుగా వీరికి ఈపీఎఫ్​పెండింగ్‌లో ఉంది.

- యారో ఏజెన్సీ.. కొత్తగూడెం ప్రభుత్వ నర్సింగ్​కాలేజీలో పనిచేస్తున్న 25 మంది సిబ్బందికి ఈఎస్‌ఐ, ఈపీఎఫ్​చెల్లించడం లేదు.

- ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని నక్షత్ర ఏజెన్సీ.. బీసీ వెల్ఫేర్ రంగారెడ్డి జిల్లాలోని 43 మంది వర్కర్స్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు ఏడాది నుంచి ఈపీఎఫ్, ఈఎస్‌ఐ జమ చేయడం లేదు.

- వినాయక ఏజెన్సీ, గ్లోబల్ ఏజెన్సీలు.. వికారాబాద్‌లోని గిరిజన ఆశ్రమ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఈఎస్ఐ కార్డు ఇవ్వలేదు. ఇక్కడ మొత్తం 61 మంది పనిచేస్తున్నారు.

- నక్షత్ర ఏజెన్సీ.. హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో ఈఎస్‌ఐ డిస్పెన్సరీలో పనిచేస్తున్న సిబ్బందికి 9 నెలలుగా జీతాలు లేవు. అదేవిధంగా ఎస్ఆర్ఆర్ కాంట్రాక్టు సంస్థ కింద ఈఎస్ఐ హాస్పిటల్‌లోని సిబ్బందికి గత 6 నెలలుగా ఈపీఎఫ్, ఈఎస్ఐ చెల్లించలేదు. అయినప్పటికీ, ప్రభుత్వం ఈసారి కూడా కాంటాక్ట్ రెన్యూవల్​చేసింది.

Next Story