- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BIG News: ఫీనిక్స్ కోసం కుంటలు ఫినిష్..! NGTకి అధికారుల ఫేక్ రిపోర్ట్స్
రాష్ట్రంలో అతి పెద్ద నిర్మాణ సంస్థ ఫీనిక్స్ కంపెనీకి మేలు కలిగించేలా వివిధ శాఖల అధికారులు వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అతి పెద్ద నిర్మాణ సంస్థ ఫీనిక్స్ కంపెనీకి మేలు కలిగించేలా వివిధ శాఖల అధికారులు వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. ‘రియల్’ సంస్థ కోసం రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడలో ‘వాటర్ బాడీస్ ల్యాండ్స్’ను ఫినిష్ చేశారనే విమర్శలు వస్తున్నాయి. గతంలో జారీ చేసిన జీవోలను సైతం పక్కనపెట్టి క్లియరెన్స్ లు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. ముస్కిన్ చెరువు, నార్సింగి లేక్, నాగిరెడ్డి కుంట.. ఇవన్నీ గొలుసుకట్టు చెరువులు కాగా.. వీటిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి తప్పుడు రిపోర్టులు సమర్పించారని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మెంబర్ డా.లుబ్న సర్వత్, పర్యావరణవేత్త ఎస్.చక్రధర్ ఆరోపించారు. ఈ చెరువులను చెరబట్టి హైరైజ్డ్ బిల్డింగ్స్ నిర్మిస్తున్నారని అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ కు ఫిర్యాదు చేశారు. పుప్పాలగూడలోని మమసాని కుంట, మేకసాని కుంట, బుల్కపూర్ నాలాలపై అధికారులు ఇచ్చిన నివేదికలపై కూడా విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
‘రియల్’ కంపెనీలకు మేలు కలిగేలా..
పుప్పాలగూడలోని మమసాని కుంట, మేకసాని కుంట, బుల్కపూర్ నాలాల్లో నిర్మాణాలు, నార్సింగి లేక్–2లో అక్రమ నిర్మాణాలపై 2020 నుంచి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు నడుస్తున్నాయి. అయితే ఇందులో గతేడాది ఫిబ్రవరిలోనే అవినీతి కేసులో అరెస్టయిన హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగపు డైరెక్టర్ ఎస్.బాలకృష్ణ పాత్రపై అనుమానాలు ఉన్నాయి. ఫీనిక్స్ కంపెనీకి మేలు కలిగించేందుకు గండిపేట తహశీల్దార్, రెవెన్యూ అధికారులు వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. వాళ్లు అక్కడ చెరువే లేదని రిపోర్ట్ ఇచ్చినట్లు ఫిర్యాదులో లుబ్న సర్వత్ ఫిర్యాదులో పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఫీనిక్స్ ప్రయోజనాల కోసం సమర్పించిన నివేదికలతోనే అత్యంత ఖరీదైన చెరువులను కోల్పోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి అధికారులు, కార్పొరేట్ శక్తుల కారణంగానే వాటర్ బాడీస్ కనుమరుగైనట్లు తెలిపారు. కాగా, ఎన్వోసీ జారీలో బాలకృష్ణతోపాటు ఇటీవల అరెస్ట్ అయిన నిఖేష్ కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. అప్పుడు బాలకృష్ణ అరెస్ట్ ఉదంతం సంచలనం సృష్టించగా, తాజాగా నిఖేష్ ఆస్తుల చిట్టా తెలిసినప్పుడు అంతా ముక్కున వేలేసుకున్నారు. ఇలాంటి వారితోనే చెరువులు, కుంటలు, బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ పరిధి కుచించుకుపోతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మమసానికుంట లేదని తప్పుడు రిపోర్ట్!
పుప్పాలగూడలో అసలు మమసాని కుంట అనేదే లేదని హెచ్ఎండీఏ అధికారులు రికార్డులు మార్చారు. సమాచార హక్కు చట్టం కింద అడిగితే అలాంటి చెరువు ఉనికే లేదని అప్పటి హెచ్ఎండీఏ అధికారి ఎస్.బాలకృష్ణ రిపోర్ట్ ఇచ్చారు. నిజానికి 2004 సెప్టెంబరు 15న జారీ చేసిన జీవో 375లో 13.18 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ చెరువు ఉన్నట్లుగా రికార్డు చేశారు. దాన్ని ఉల్లంఘిస్తూ 2020–2022 లో జాయింట్ కమిటీ రిపోర్ట్ సమర్పించింది. ఫీనిక్స్ కంపెనీకి మేలు కలిగించేందుకే బాలకృష్ణ అక్రమంగా ఆ చెరువే లేదని సంతకం చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. మరి అంతకు ముందు ఉన్న కుంట ఎలా మాయమైందో బాలకృష్ణ, నిఖేష్, ఇతర అధికారులకే తెలియాలి. జాయింట్ రిపోర్ట్ మీద సంతకాలు చేసిన ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్, పీసీబీ, విద్యుత్ అధికారులు దీనిపై వివరణ ఇవ్వాలి.
నిజానికి మమసాని కుంట, మేకసాని కుంట, బుల్కపూర్ నాలా, నార్సింగి లేక్-2లను సంరక్షించడం ద్వారా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. నగరంలో వరద ముప్పును నివారించొచ్చు. బయోడైవర్సిటీని కాపాడడం ద్వారా ఉష్ణోగ్రతలను పెరగకుండా నియంత్రించవచ్చని, ఎకలాజికల్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయొచ్చునని లుబ్న సర్వత్ వివరించారు. పుప్పాలగూడలోని చెరువులు, కుంటలపై తప్పుడు రిపోర్టులు ఇచ్చిన వారిలో గండిపేట సర్వేయర్, టీఎస్పీసీబీ ఏఈఈ, మణికొండ మున్సిపల్ కమిషనర్, గండిపేట ఇరిగేషన్ ఏఈఈ, గండిపేట తహశీల్దార్, ఇరిగేషన్ చేవెళ్ల డీఈఈ, ఈఈలు ఉన్నారని ఏసీబీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధానంగా పుప్పాలగూడ సర్వే నం.288 లో మమసాని కుంట అనేదే లేదని, క్లియరెన్స్ ఇచ్చిన అంశంపై విచారణ జరిపించాలని కోరారు.
హైడ్రాకు సైతం ఫిర్యాదు
తనను చంపొద్దని, బతకాలని ఉందని పుప్పాలగూడలోని మమసాని కుంట రోదిస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ లను లుబ్న మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలను సమర్పించారు. ఇరిగేషనల్ స్ట్రక్చర్స్, ఇన్ ఫ్లో చానెల్, 6.3 మీటర్ల వెడల్పుతో కూడిన కల్వర్ట్, సంప్రదాయ బద్ధంగా కుంటపై ఉండే కట్ట మైసమ్మ టెంపుల్ వంటి అనేకం అందించారు. అలాగే నాలాను ఆక్రమించి కడుతున్న నిర్మాణాలకు సంబంధించిన ఫొటోగ్రాఫ్స్ కూడా జత చేశారు. తాజాగా ఏసీబీకి కూడా ఫిర్యాదు చేయడంతో చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ఫీనిక్స్, అందుకు సహకరించిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.






