BIG News: వివాదాలకు కేంద్ర బిందువుగా బీఆర్ఎస్..! విచారణ ఎదుర్కొంటున్న కీలక లీడర్లు

by Kema Shiva Kumar |   (  Updated:2025-02-21 02:05:52  IST  )

పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.

BIG News: వివాదాలకు కేంద్ర బిందువుగా బీఆర్ఎస్..! విచారణ ఎదుర్కొంటున్న కీలక లీడర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఏ ఘటన జరిగినా.. అది గులాబీ పార్టీకి లింక్ అయి ఉండడం కేడర్‌ను ఆందోళనకు గురిచేస్తున్నది. అధికారంలో ఉన్న టైంలో చేసిన తప్పులకు కేసులు.. విచారణలు ఎదుర్కొంటున్న ఆ పార్టీ కీలక నేతలపై రోజురోజుకూ ఆరోపణలు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బడా నేతలే ఈ వివాదాల్లో చిక్కుకుంటుండడంతో పార్టీ పరువు రోజు రోజుకూ మసకబారుతున్నది. వీటన్నింటి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక నేతలంతా మదనపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు.. భూపాలపల్లి జిల్లాలో జరిగిన హత్యోదంతం వరకూ బీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలొచ్చాయి.

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మొదలై..

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు డ్యామేజీ ఏర్పడింది. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. రూ.లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు సంబంధించిన పిల్లర్లు కుంగిపోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లే భారీ నష్టం చవిచూడాల్సి వచ్చిందన్న అభిప్రాయం అందరిలోనూ కనిపించింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఈ ఘటనపై ఎంక్వయిరీకి ఆదేశించింది. విచారణ కమిషన్‌ను నియమించింది. ఏడాది కాలంగా విచారణ కమిషన్ ఎంక్వయిరీ చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు విచారించిన అధికారులు, కాంట్రాక్ట్ సంస్థలు పూర్తిగా అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకే నిర్మించినట్లు ఒప్పుకున్నారు. దాంతో ఇంత పెద్ద డ్యామేజీకి గత ప్రభుత్వ పెద్దలే కారణమని సూచన ప్రాయంగా తేలిపోయింది. ఇంకా ఈ ఇన్సిడెంట్‌లో గత ప్రభుత్వంలోని పెద్దలు విచారణను ఎదుర్కోవాల్సి ఉంది. వారిని విచారించిన తర్వాత కమిషన్ రిపోర్టు ప్రకారం ప్రభుత్వం తదుపరి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అటు విద్యుత్ కొనుగోలు విషయంలోనూ కమిషన్ ఎంక్వయిరీ కొనసాగుతున్నది. అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయడంపై మాజీ మంత్రి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

వెంటాడుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రాన్ని ఏ స్థాయిలో కుదిపేసిందో తెలిసిందే. అపోజిషన్ లీడర్లతో పాటు సొంత పార్టీ లీడర్లు, పలువురు కాంట్రాక్టర్లు, జర్నలిస్టుల ఫోన్లను గత ప్రభుత్వం హయాంలో ట్యాపింగ్ చేశారు. కొందరు జడ్జిల ఫోన్ల సంభాషణలనూ దొంగచాటుగా విన్నారు. అయితే.. ఈ కేసులో కీలక నిందితులు విదేశాలకు పారిపోవడంతో వారిని రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారిని రాష్ట్రానికి రప్పించిన తర్వాత వారు ఇచ్చే స్టేట్‌మెంట్ ఆధారంగా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నది. ఈ కేసులోనూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతల పేర్లే వినిపిస్తున్నాయి.

సంచలనం రేపిన ఈ ఫార్ములా కారు రేసు కేసు

గత ప్రభుత్వం హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ-కారు రేసులోనూ విచారణ కొనసాగుతున్నది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే రూ.55 కోట్లను విదేశీ కంపెనీలకు తరలించడంపై విచారణ కొనసాగుతున్నది. ఈ కేసులో ఇప్పటికే ఐఏఎస్ అధికారితో పాటు పలువురిని విచారించగా.. వారు గత ప్రభుత్వంలోని పెద్దల ఆదేశాల మేరకే నిధులు విడుదల చేసినట్లు ఒప్పుకున్నారు. ఈ కేసులో ప్రధానంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనను ఇప్పటికే ఏసీబీ అధికారులు విచారించారు. కేసు విచారణ ప్రస్తుతం చివరి దిశకు చేరుకుంది.

ఫాంహౌజ్‌లో పార్టీలు..

గతంలో కేటీఆర్ బావమరిదికి చెందిన ఫాంహౌజ్‌లో పార్టీ జరిగింది. ఇందులో డ్రగ్స్ వినియోగంతో పాటు ఫారిన్ బాటిల్స్ మందు దొరికినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే.. ఈ పార్టీ వెనుక కేటీఆర్ ఉన్నారనే ప్రచారం జరిగింది. ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్.. ఈ కేసులోనూ ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే.. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగంపైనా బీఆర్ఎస్ నేతలపై పలు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిపై ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. ఆయనకు సంబంధించిన ఫాంహౌజ్‌లో ఫారిన్ బాటిల్స్‌తో పాటు క్యాసినో ఆడినట్లు పోలీసులు గుర్తించారు.

భూపాలపల్లి రాజలింగమూర్తి మర్డర్ కేసు..

మేడిగడ్డ కుంగుబాటుపై కోర్టులో న్యాయపోరాటం చేస్తున్న భూపాలపల్లికి చెందిన సామాజిక కార్యకర్త, మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి రెండు రోజుల క్రితం దారుణ హత్యకు గురయ్యారు. భూవివాదాలే రాజలింగమూర్తి మర్డర్‌కు కారణమని ముందుగా భావించినా.. ఇందులో బీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి. రాజలింగమూర్తి భార్య.. కేటీఆర్ పేరును ప్రస్తావిస్తూ.. మాజీ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసింది. బీఆర్ఎస్ నేతలే తన భర్తను హత్య చేశారని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మరోసారి బీఆర్ఎస్ డిఫెన్స్‌లో పడినట్లయింది. గతంలోనూ మంథనికి చెందిన న్యాయవాద దంపతుల హత్య కేసులో బీఆర్ఎస్ లీడర్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఇప్పటికీ ఆ కేసు కొనసాగుతూనే ఉన్నది.

కీలక నేతల పేర్లే ప్రచారంలోకి..!

ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఈ 14 నెలల కాలంలో బీఆర్ఎస్‌పై వస్తున్న ఆరోపణల్లో కీలక వ్యక్తుల పేర్లే ప్రధానంగా వినిపిస్తుండడం పార్టీని కుదిపేస్తున్నది. కాళేశ్వరం అంశంలో కేసీఆర్, హరీశ్‌రావు పేర్లు తెరమీదకు వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ అంశంలో హరీశ్‌రావుపై ఆరోపణలున్నాయి. ఇటీవలే ఆయన పీఏను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు.. ఈ ఫార్ములా కారు రేసులో కేటీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఫాంహౌజ్‌లలో పార్టీలపైనా ఆయన పేరే ప్రముఖంగా వినిపించింది. ఇక ఇప్పుడు రాజలింగమూర్తి మర్డర్ విషయంలోనూ కేటీఆర్‌తో పాటు మరికొందరు పేర్లు వినిపించడం కేడర్‌ను ఆందోళనకు గురిచేస్తున్నది. అటు విద్యుత్ కొనుగోలు విషయంలోనూ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిపై ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి.

Next Story