- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాషాయం పార్టీలో భారీ మార్పులు
బీజేపీలో త్వరలో భారీ మార్పులు.. జూలైలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ, తెలంగాణ ఎంపీలకు దక్కనున్న కీలక పదవులు: జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హింట్!

దిశ, తెలంగాణ బ్యూరో : భారతీయ జనతా పార్టీలో త్వరలోనే భారీ స్థాయిలో మార్పులు జరగనున్నట్టు సమాచారం. పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ మార్పులు చేయనుండగా తెలంగాణలోనూ మార్పులు, చేర్పులు జరగనున్నాయి. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పార్టీ ముఖ్య నేతలకు సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది. కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ చేయనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతుండగా జూలైలో మార్పులు చేర్పులు ఉంటాయని పార్టీ నాయకులు సైతం చెబుతున్నారు.
జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నికైన కొత్త జాతీయ కార్యవర్గాన్ని ఇంకా ఏర్పాటు చేయలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ అనంతరం జాతీయ కమిటీని ప్రకటించే ఛాన్స్ఉందని సమాచారం. దేశంలోని 7 రాష్ట్రాలకు 2027లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ఇంఛార్జిలను కూడా మార్చే ఛాన్స్ ఉందని తెలిసింది. తెలంగాణ నుంచి కొత్త వారికి అవకాశాలు రానున్నాయని, ఇతర రాష్ట్రాల ఇంఛార్జిలుగా సేవలు అందించడానికి ఇక్కడి నేతలు సైతం ఉత్సాహంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
10 రోజుల్లో డిక్లేర్
కేంద్ర మంత్రి పదవి విషయంలో ఇంకా స్పష్టత రాకపోయినా మార్పులు చేర్పులు ఉంటాయని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఆ దిశగానే కేంద్రంలోని కీలక నాయకులు కసరత్తు చేస్తున్నారని చెబుతున్నారు. మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత పార్లమెంట్‌సమావేశాలు ఆ సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు బిల్లులను మరోసారి పార్లమెంట్‌లో పెట్టి ఆమోదింపచేసే విధంగా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. ఇదే జరిగితే ఇంకా ఎక్కువ స్థాయిలో మార్పులు ఉంటాయని, మహిళలకు ఇప్పటి నుంచే ప్రాతినిధ్యం పెంచే అవకాశం ఉందని సమాచారం. కేంద్ర పార్టీ కమిటీలో పలువురు రాష్ట్రానికి చెందిన నేతలు తమకు అవకాశం దక్కుతుందని ఆశతో ఉన్నారు.
ఇప్పటివరకు జాతీయ కమిటీలో ఉపాధ్యక్షురాలిగా ఎంపీ డీకే అరుణ, కార్యవర్గ సభ్యులుగా ఎంపీ ఈటల రాజేందర్ ఉన్నారు. పొంగులేటి సుధాకర్ రెడ్డి తమిళనాడు సహా ఇంఛార్జిగా ఉన్నారు. కేంద్ర మంత్రివర్గంలో తమకు స్థానం దక్కుతుందని ఎంపీలు ఎవరికి వారు నమ్ముతున్నారు. 9 మంది ఎంపీలు ఉండగా ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. మిగిలిన ఏడుగురు ఏవరికి వారు తమకే మంత్రి పదవి వస్తుందని అంచనా వేసుకుంటున్నారు. ఈ సస్పెన్స్‌కు మరో 10 రోజుల్లో తెరపడనున్నట్టు పార్టీ నాయకులు చెబుతున్నారు.






