తెలంగాణ మెడికల్ షాపులకు బిగ్ అలర్ట్

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-09 17:22:59  IST  )

రాష్ట్రంలో నాసిరకం మందుల విక్రయాలను అరికట్టేందుకు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) కీలక చర్యలు చేపట్టింది.

తెలంగాణ మెడికల్ షాపులకు బిగ్ అలర్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నాసిరకం మందుల విక్రయాలను అరికట్టేందుకు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) కీలక చర్యలు చేపట్టింది. నాసిరకం లేదా ప్రమాణాలను పాటించని మందులను గుర్తించిన వెంటనే మెడికల్ షాపులకు సమాచారం చేరేలా బల్క్ ఎస్ఎంఎస్ అలర్ట్ సిస్టమ్ ను డీసీఏ ప్రారంభించింది. ఈ వ్యవస్థ ద్వారా డీసీఏ అధికారులు గుర్తించిన నాసిరకం మందుల వివరాలను రాష్ట్రంలోని అన్ని మెడికల్ షాపులకు ఎస్ఎంఎస్ ద్వారా తక్షణమే పంపించనున్నారు. దీంతో ఆ మందుల విక్రయాలను వెంటనే నిలిపివేయడానికి ఫార్మసీ యజమానులకు ముందస్తు హెచ్చరిక అందుతుంది. ప్రజలకు నాసిరకం మందులు అందకుండా ఉండేలా ఇది సహాయపడుతుందని అధికారులు తెలిపారు.

నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ మెడిసిన్..

డ్రగ్స్ కంట్రోల్ లాబొరేటరీ నిర్వహించిన పరీక్షల్లో కొన్ని మందులు అస్సే, డిజింటిగ్రేషన్, డిసల్యూషన్ వంటి ప్రమాణాలలో విఫలమవుతుంటాయి. అటువంటి మందులను ‘నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ’గా ప్రకటిస్తారు. ఇలాంటి మందులపై వెంటనే చర్యలు తీసుకునేందుకు ఈ ఎస్ఎంఎస్ అలర్ట్ వ్యవస్థ ఉపయోగపడనుంది. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా రిటైల్ ఫార్మసీలు, హోల్‌సేలర్లు సహా అన్ని భాగస్వాములకు నాసిరకం మందుల వివరాలు త్వరగా చేరుతాయి. దీంతో ఆ మందులను మార్కెట్ నుంచి వెంటనే ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. డీసీఏ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసిం తెలిపారు. ఈ డిజిటల్ వ్యవస్థ ద్వారా నాసిరకం మందుల సమాచారాన్ని వేగంగా పంచుకోవడం సాధ్యమవుతుందని, దీనివల్ల ఔషధ భద్రత మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. ప్రజారోగ్య రక్షణలో ఇది కీలక ముందడుగు అని ఆయన పేర్కొన్నారు.




Next Story