విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంటర్ ఫలితాలపై బోర్డు కీలక ప్రకటన!

by Kema Shiva Kumar |

తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు సిద్ధమైన విద్యార్థులకు కీలక అప్‌డేట్ ఇచ్చింది.

విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంటర్ ఫలితాలపై బోర్డు కీలక ప్రకటన!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. ఏప్రిల్ 10 లోపు ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్ బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. వీలైతే ఏప్రిల్ 4, 5 తేదీల్లోనే రిజల్ట్స్‌ను అనౌన్స్ చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ముమ్మరంగా వాల్యుయేషన్ ప్రక్రియ

రాష్ట్రంలో ఫిబ్రవరి 25న ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ నెల 18తో ముగియనున్నాయి. పరీక్షలు జరుగుతుండగానే, మరోవైపు జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను కూడా బోర్డు సమాంతరంగా నిర్వహిస్తోంది. ఈ నెల 4న నుంచే వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సాధ్యమైనంత త్వరగా పేపర్ల దిద్దే పని పూర్తి చేసి, రిజల్ట్స్ ప్రాసెసింగ్ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం ఏప్రిల్ మొదటి వారంలోనే ఫలితాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, ఒకవేళ వాల్యుయేషన్‌లో ఏవైనా సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం జరిగితే మాత్రం మరో 2 నుంచి 3 రోజులు పట్టే అవకాశం ఉంది. అంటే ఏప్రిల్ రెండో వారంలోపు కచ్చితంగా రిజల్ట్స్ వెలువడనున్నాయి.

ఎంసెట్, ఎంట్రెన్స్‌ల దృష్ట్యా..

రాష్ట్రంలో ఎంసెట్ సహా ఇతర పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రవేశాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మరింత పకడ్బందీగా, వేగంగా ఫలితాలను వెల్లడించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది.

Next Story