- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. అనర్హులని తేలితే నిర్మాణం మధ్యలో ఉన్నా రద్దు
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణం 600 చదరపు అడుగులకు మించకూడదని, ఈ మేరకు కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణం 600 చదరపు అడుగులకు మించకూడదని, ఈ మేరకు కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణరావుతో కలిసి భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, నీట్ పరీక్ష ఏర్పాట్లపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గానికి కేటాయించిన 3,500 ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక ఎంతవరకు పూర్తయితే అంతవరకు ఏరోజుకారోజు ఇన్‌చార్జి మంత్రుల నుంచి జాబితాకు ఆమోదం తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రతి నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతంలో కనీసం 500 ఇళ్లను కేటాయించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. అనర్హులని తేలితే ఇళ్ల నిర్మాణం మధ్యలో ఉన్నా రద్దు చేస్తామన్నారు. లిస్ట్-1, లిస్ట్-2, లిస్ట్-3లతో సంబంధం లేకుండా నిరుపేదలను ఎంపిక చేయాలన్నారు.
5 నుంచి 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు
గత నెల 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నాలుగు మండలాల్లో నిర్వహించిన మాదిరిగానే ఈ నెల 5వ తేదీ నుంచి 20వ తేదీవరకు జిల్లాకో మండలం చొప్పున 28 జిల్లాల్లోని 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. పైలట్ మండలాల్లో వచ్చిన దరఖాస్తులను ఈనెల 31వ తేదీ వరకు పరిష్కరించాలని, పరిష్కారం కాని వాటికి ఎందుకు పరిష్కరించడం లేదనే విషయాన్ని లిఖిత పూర్వకంగా తెలియజేస్తూ దరఖాస్తును తిరస్కరించాలని కలెక్టర్లకు సూచించారు. 605 మండలాలకు గాను ఇప్పటి వరకు 590 మండలాల్లో అవగాహన సదస్సులను నిర్వహించినట్లు చెప్పారు. ఇందులో 85,527 మంది పౌరులు, 1,62, 577 మంది రైతులు పాల్గొన్నారని తెలిపారు. ప్రభుత్వ భూముల వివరాలను ఎప్పటికప్పుడు రికార్డులలో నమోదు చేయాలని, అసైన్డ్ ల్యాండ్‌లకు సంబంధించి పొజిషన్ మీద ఉండి పట్టా లేనివారు, పట్టా ఉండి పొజిషన్ మీద లేనివారి వివరాలను సేకరించాలని సూచించారు.
నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈనెల 4వ తేదీన నిర్వహించనున్న నీట్ పరీక్షకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి పొంగులేటి సూచించారు. ఈ ఏడాది రాష్ట్రం నుండి 72,572 మంది విద్యార్దులు నీట్ పరీక్షకు హాజరవుతున్నారని, ఇందుకోసం 24 జిల్లాల్లో 190 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేయడం జరిగిందని చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీటితోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లను అందుబాటులో పెట్టాలన్నారు. విద్యార్థులకు సూచనలను ముందుగానే మీడియా ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాశ్, సీసీఎల్ఏ డైరెక్టర్ మకరంద్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్, లా అండ్ ఆర్డర్ డీఐజీ మహేశ్‌భగవత్ తదితరులు పాల్గొన్నారు.






