- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వినియోగదారులకు బిగ్ అలర్ట్.. బోగస్ రేషన్ కార్డుల తొలగింపు ప్రక్రియ షురూ
ప్రభుత్వ పథకాలకు రేషన్కార్డు ప్రామాణికం చేయడంతో పేదలు, ధనికులు అని తేడా లేకుండా కార్డులను పొందారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ పథకాలకు రేషన్కార్డు ప్రామాణికం చేయడంతో పేదలు, ధనికులు అని తేడా లేకుండా కార్డులను పొందారు. రేషన్ సరుకుల కంటే ఆరోగ్య శ్రీ చికిత్సలు, పిల్లలకు స్కాలర్షిప్, సబ్సిడీపై రుణాలు, విదేశీ విద్యా రుణం పొందిన వారు భారీ సంఖ్యలో ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. ధనవంతులై ఉండి కూడా పేదలు పొందాల్సిన పథకాలు అక్రమంగా తీసుకోవడంపై చర్యలకు తీసుకునేందుకు అధికారులు నడుం బిగిస్తున్నారు. వీలైనంత త్వరగా వారి కార్డులు కట్ చేసేందుకు సర్వేకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చాలా నష్టం జరిగిందని, ఇంకా జరిగితే ప్రభుత్వ ఖజనాకు గండిపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అందుకోసం ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఉన్న కార్డులు వీలైనంత త్వరగా సరెండర్ చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవని, అధికారులు గుర్తిస్తే మాత్రం రేషన్కార్డు ద్వారా ఎంత ప్రజా సొమ్మును తమ ఖాతాలో వేసుకున్నారో వాటిని వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. రేషన్ కార్డుకు గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం లక్షన్నర లోపు, మాగాణి 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలు, అదే పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రెండు లక్షలు మించకుండా ఉన్న వారు తప్ప అంతకంటే ఎక్కువ ఆస్తులు కలిగిన వారు స్థానిక మండల రెవెన్యూ కార్యాలయాల్లో రేషన్కార్డుల తొలగింపునకు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
పూర్తి వివరాలతో దరఖాస్తు చేయాలి
అక్రమ రేషన్కార్డు తొలగింపునకు కార్డు నంబర్, ఇంటి నంబర్, రేషన్ డీలర్ నంబర్, దరఖాస్తుదారుడి పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, వయసు, ఆధార్ నంబర్, సామాజిక వర్గం, వంట గ్యాస్ వివరాలు, ఏజెన్సీ పేరు నమోదు చేయాలి. ఈ పత్రాలను తహసీల్దార్ కార్యాలయంతో పాటు, స్థానిక సివిల్ సప్లయి అధికారి, జిల్లా పౌరసరఫరాల అధికారి, రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ కు అందజేయవచ్చు. మున్సిపాలిటీల్లో జోనల్ సివిల్ సప్లయి అధికారి, జిల్లా డీఎస్ఓ, మున్సిఫల్ జోనల్కమిషనర్ లకు దరఖాస్తులు అందజేయవచ్చని రాష్ట్ర పౌరసరఫరాల ఉన్నతాధికారులు చెప్పారు. దరఖాస్తు అందిన 15 రోజుల్లో వివరాలను పరిశీలన చేసిన జాబితా నుంచి కార్డు నంబర్ తొలగించబడుతుంది. స్వచ్చంధంగా ముందుకొచ్చిన కార్డులను సరెండర్ చేస్తే ప్రజాధనం కాపాడినవారవుతారని అధికారులు పేర్కొంటున్నారు.
9 నుంచి 12 శాతం వరకు అక్రమ కార్డులు
జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించగా అందులో కుటుంబ వివరాలు ఇచ్చిన వారి ప్రకారం ప్రస్తుతం కార్డులో 9 నుంచి 12 శాతం వరకు అక్రమ కార్డులు కలిగి ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఆధార్కార్డు పరిగణలోకి తీసుకుంటే ఇంకా కార్డులు బయటపడుతాయని భావిస్తున్నారు. ప్రభుత్వం గణంకాల ప్రకారం రాష్ట్రంలో 91,19,268 రేషన్కార్డులు ఉండగా అందులో 85,47,142 ఆహార భద్రత కార్డులు, 5,66,736 అంత్యోదయ అన్నయోజన కార్డులు, 5390 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. వీటికి 17,256 రేషన్దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ జరుగుతోంది. అత్యధిక కార్డులు హైదరాబాద్ జిల్లాలో 6,39,375 కార్డులుండగా, అతి తక్కువ ములుగు జిల్లాలో 91,729 కార్డులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
కొత్త కార్డుల కోసం 13 లక్షల దరఖాస్తులు..
రేవంత్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ప్రజాపాలన, ప్రజావాణి, గ్రామసభలు, మీసేవల ద్వారా అర్హులైన వారి నుంచి కొత్త రేషన్కార్డులకు దరఖాస్తులు కోరింది. దాదాపు 13 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా వాటిని పౌరసరఫరాల అధికారులు ప్రత్యేక యాప్ లో నమోదు చేసి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ఈప్రక్రియ ఈనెలాఖరు వరకు సాగవచ్చని, పూర్తిగా కాగానే మండల అధికారులు జిల్లా పౌరసరఫరాల శాఖకు పంపుతారని, వారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషన్ కార్యాలయానికి ఆన్లైన్ ద్వారా జాబితాను పంపుతారు. వారు పరిశీలన చేసిన తరువాత కొత్త కార్డులలు మంజూరు అవుతాయని, జూన్ తరువాత మరో 30 లక్షల మంది లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.






