Bhubharati: అందుబాటులోకి రాబోతున్న ‘భూభారతి’.. డ్యాష్‌బోర్డ్ క్లియరెన్స్‌కు ఉన్నతాధికారులు ఒత్తిడి

by Kema Shiva Kumar |

సకల సమస్యలకు ‘భూభారతి’నే పరిష్కారమంటూ భూ సమస్యల పరిష్కారానికి ఇన్నాళ్లు కాలయాపన చేసిన కొందరు ఉన్నతాధికారులు.. ఇప్పుడు డ్యాష్ బోర్డ్ క్లియర్ చేయాలని ఆఫీసర్లపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.

Bhubharati: అందుబాటులోకి రాబోతున్న ‘భూభారతి’.. డ్యాష్‌బోర్డ్ క్లియరెన్స్‌కు ఉన్నతాధికారులు ఒత్తిడి
X

దిశ, తెలంగాణ బ్యూరో: సకల సమస్యలకు ‘భూభారతి’నే పరిష్కారమంటూ భూ సమస్యల పరిష్కారానికి ఇన్నాళ్లు కాలయాపన చేసిన కొందరు ఉన్నతాధికారులు.. ఇప్పుడు డ్యాష్ బోర్డ్ క్లియర్ చేయాలని ఆఫీసర్లపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ధరణి రిజెక్టెడ్ ఫైల్స్‌ను క్లియర్ చేయాలని కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు రెవెన్యూ అధికారులకు అంతర్గతంగా ఆర్డర్స్ ఇస్తున్నారు. ‘వెరీ ఇంపార్టెంట్. మోస్ట్ అర్జెంట్. మీ లాగిన్‌లో ఉన్న రిజెక్టెడ్ ఫైల్స్‌ను క్లియర్ చేయండి. మరో వారంలో కొత్త ఆర్వోఆర్ చట్టం వచ్చేస్తుంది. దాంట్లో అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉంది. అప్పటిదాకా ఆగితే వెంటనే అప్పీల్‌కు వెళ్తారు. అందుకే భూభారతి అమల్లోకి రాకముందే క్లియర్ చేయండి. లేకపోతే అనసరంగా అప్పీల్స్ పెరిగిపోతాయి’ అని ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లు, తహశీల్దార్లను ఆదేశిస్తున్నట్టు చర్చ జరుగుతున్నది.

నిజానికి ఇలా డ్యాష్ బోర్డు క్లియర్ చేయాలని, అప్పీల్‌కు పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు రాకుండా జాగ్రత్త పడాలని సీసీఎల్ఏ, ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచనలు లేవు. కానీ కొందరు ఉన్నతాధికారులు తమ సొంత నిర్ణయాలతో అప్పీల్ ప్రొవిజన్‌కు ఫైల్స్ రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. భూభారతి వచ్చినా యథావిధిగానే దరఖాస్తుల పరిష్కారానికి అవకాశం ఉన్నప్పటికీ.. తొందరపడడం వెనుక ఆంతర్యమేమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ధరణి పోయి.. భూభారతి వచ్చినా పాత దరఖాస్తులకు వచ్చే నష్టమేం లేదు. ఆ దరఖాస్తులన్నీ యథాతథంగా కొత్త పోర్టల్‌లో దర్శనమిస్తాయి. కానీ కొన్ని జిల్లాల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. కొత్త చట్టం వచ్చిన తర్వాత మళ్లీ అప్లయ్ చేసుకోవాల్సిన అవసరం లేదన్న విషయాన్ని చెప్పడం లేదు. దాంతో దరఖాస్తుదారులు అయోమయానికి గురవుతున్నారు.

అప్పీల్ వ్యవస్థ సామాన్యులకు వరం

ప్రస్తుతం ధరణి పోర్టల్‌లో పెండింగు అప్లికేషన్లకు ఎలాంటి ఢోకా లేదు. దాని స్థానంలో భూభారతి చట్టం అమలైనా, కొత్త వెబ్ పోర్టల్ వచ్చినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. అందులోని అప్లికేషన్లన్నీ కొత్త వెబ్ పోర్టల్‌లోకి వచ్చేస్తాయని సీసీఎల్ఏ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొత్తగా అప్పీల్ వ్యవస్థ ఏర్పడుతుంది. ధరణిలో ఆ అవకాశం లేదు. అప్లికేషన్స్ రిజెక్ట్ చేస్తే కోర్టుకే వెళ్లాలన్న పరిస్థితి ఉండేది. కానీ భూభారతిలో తహశీల్దార్ రిజెక్ట్ చేస్తే ఆర్డీవోకు, ఆర్డీవో తిరస్కరిస్తే అదనపు కలెక్టర్, అక్కడా న్యాయం దక్కకపోతే కలెక్టర్‌కు మొర పెట్టుకోవచ్చు. అక్కడ కూడా సామాన్యుడు తనకు న్యాయం జరగలేదని భావిస్తే సీసీఎల్ఏకు కూడా ఫిర్యాదు చేసే వెసులుబాటు కొత్త చట్టంలో తీసుకొస్తున్నారు. ఈ విషయాలను రైతులకు వివరించే బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉన్నది. కానీ తహశీల్దార్లు, ఆర్డీవోలు, కలెక్టర్లు ఈ విషయంపై అవగాహన కల్పించడం లేదు. పైగా అప్పీల్ దరఖాస్తుల సంఖ్యను తగ్గించడానికి రిజెక్ట్ ఫైల్స్‌ను క్లియర్ చేయాలంటూ ఉన్నతాధికారులు ఆర్డర్లు ఇస్తుండటం గమనార్హం.

ఇంకా కలవాలన్న ఆంక్షలే!

డ్యాష్ బోర్డు క్లియర్ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వస్తుండటంతో.. పెండింగ్ ఫైల్స్‌పై సైతం అధికారులు దృష్టి సారించారు. అయితే సమస్య పరిష్కారం కావాలంటే ఒకసారి వచ్చి కలవాల్సిందేనని దరఖాస్తుదారులకు చెబుతున్నారు. అర్జీ పెట్టుకొని ఇంట్లో కూర్చుంటే అయిపోతుందా? వచ్చి కలవాలని తెలియదా? అని అంటుండం గమనార్హం. ప్రస్తుతం వ్యవస్థ అంతా ఆన్‌లైన్. కానీ ఫిజికల్‌గా ఫైలు పట్టుకొని వాళ్లను కలవకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. ఎన్ని దరఖాస్తులు వస్తే అంతా లాభమన్న రీతిలో కొన్ని కలెక్టరేట్లల్లో వ్యవహారం నడుస్తున్నది. ఆఖరికి కొందరు గూగుల్‌పే, ఫోన్‌పే ద్వారా కూడా తీసుకుంటున్నారనే చర్చ జరుగుతున్నది. ప్రధానంగా హెచ్ఎండీఏ పరిధిలోని మండలాల్లో అప్లికేషన్ వచ్చిన తేదీ, పరిష్కరించిన లేదా తిరస్కరించిన తేదీకి మధ్య ఎన్ని నెలలు/ఎన్ని సంవత్సరాలు, ఎంత కాలం పెండింగులో ఎందుకు ఉన్నదో విచారిస్తే అసలు వాస్తవాలు తేలుతాయి. తహశీల్దార్ నుంచి ఆర్డీవోకు, ఆర్డీవో నుంచి అదనపు కలెక్టర్, అక్కడి నుంచి కలెక్టర్, సీసీఎల్ఏ వరకు చేరేందుకు ఎన్ని నెలలు ఎందుకు పట్టిందో.. ఆ మధ్యలో దరఖాస్తుదారులతో ఎన్నిసార్లు మాట్లాడారో, ఎన్నిసార్లు కలిశారో ఆరా తీస్తే అవినీతి బాగోతాలు వెల్లడవుతాయని బాధితులు అంటున్నారు.

పది రోజుల క్రితం ధరణి పెండింగ్ అప్లికేషన్లు

జిల్లా - పెండింగ్ - తహశీల్దార్ - ఆర్డీవో - అదనపు కలెక్టర్ - కలెక్టర్

రంగారెడ్డి - 17,646 - 7,966 - 3,351 - 4,877 - 1,452

సంగారెడ్డి - 7,651 - 4,995 - 1,268 - 640 - 748

వికారాబాద్ - 6,556 - 3,309 - 1,758 - 915 - 574

ఖమ్మం - 3,684 - 1,521 - 682 - 839 - 642

మేడ్చల్ - 3,548 - 2,118 - 817 - 320 - 293

సిద్ధిపేట - 3,341 - 920 - 881 - 197 - 343

ఆ తర్వాతి స్థానాల్లో నాగర్‌కర్నూలు, భువనగిరి, మెదక్ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పది రోజుల క్రితం 88,865 అప్లికేషన్లు పెండింగులో ఉన్నాయి. వాటిలో తహశీల్దార్ల దగ్గర 39,865, ఆర్డీవోల దగ్గర 21,252, అదనపు కలెక్టర్ల దగ్గర 16,640, కలెక్టర్ల దగ్గర 11,108 వంతున ఉన్నాయి.

Next Story