సందేహాల నివృత్తికి ‘భూ మిత్ర’ ఏఐ చాట్ బాట్ రెడీ

by Muthe.Rajitha |

భూ సంబంధిత సమస్యలపై సందేహాలను నివృత్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఏఐ చాట్ బాట్ ను రెడీ చేసింది.

సందేహాల నివృత్తికి ‘భూ మిత్ర’ ఏఐ చాట్ బాట్ రెడీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: భూ సంబంధిత సమస్యలపై సందేహాలను నివృత్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఏఐ చాట్ బాట్ ను రెడీ చేసింది. భూమిత్ర పేరుతో భూభారతి పోర్టల్ లో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ ఏఐ చాట్ బాట్ ను త్వరలో అధికారికంగా ప్రారంభించనున్నారు. భూ మిత్ర ద్వారా భూ సమస్యల పరిష్కారం, అధికారుల సమాచారం, అప్లయ్ చేసుకునే విధానం, అప్ లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్లు వంటి అనేక అంశాలను తెలుసుకునే వీలుంది. ప్రస్తుతం సేవల్లో తలెత్తే ప్రశ్నలకు మాత్రమే భూ మిత్ర ఆన్సర్స్ ఇస్తున్నది. ఇంగ్లిషు, తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో సమాధానాలు వస్తున్నాయి. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీసీఎల్ఏ అధికార వర్గాలు కోరుతున్నాయి. రానున్న రోజుల్లో ఏ ప్రశ్న అడిగినా.. వెంటనే రిప్లయ్ వచ్చేలా ఈ ఏఐ చాట్ బాట్ ను తీర్చిదిద్దుతున్నారు. డేటా బేస్ ఆధారంగా సమాధానాలు ఇచ్చేలా డిజైన్ చేస్తున్నారు. భూ మిత్ర వంటి కొత్త ఆప్షన్లను సీసీఎల్ఏ సీఎమ్మార్వో ప్రాజెక్టు డైరెక్టర్ మందా మకరంద్ నేతృత్వం వహిస్తుండడం గమనార్హం.

క్లిక్ చేస్తే చాలు..

భూ భారతి వెబ్ పోర్టల్ కి వెళ్లగానే రైట్ సైడ్ కింద భూమిత్ర ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే.. సేల్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవచ్చు? మార్ట్ గేజ్ డీడ్ ఎలా చేసుకోవచ్చు? నిషేధిత జాబితా నుంచి సర్వే నంబరును తొలగించేందుకు ఎలా అప్లై చేసుకోవాలి? అంటూ మూడు ప్రశ్నలు దర్శనమిస్తాయి. వాటిలో ఏ అంశం గురించి తెలుసుకోవాలంటే.. దానిపై క్లిక్ చేస్తే చాలు.. సమాధానం వస్తుంది. ఈ మూడు ప్రశ్నలే కాకుండా.. భూ సంబంధ అంశాల్లో ఎలాంటి డౌట్స్ నైనా క్లారిఫై చేసేందుకు భూ మిత్ర సిద్ధమవుతున్నది. ఒక్కో ప్రశ్నకు సమాధానంతో పాటు ఏమేం డాక్యుమెంట్లు అవసరమో కూడా చెప్తేస్తున్నది. అప్లయ్ చేసుకునేందుకు వెబ్ లింక్స్ ను సైతం ప్రొవైడ్ చేస్తున్నది.

తిక్క ప్రశ్నలకు నో రిప్లయ్

భూ మిత్ర భూ సంబంధ అంశాలకే పరిమితం. ఇది చాట్ జీపీటీ, మెటా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెబ్ సైట్ల మాదిరిగా అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వదు. కేవలం భూమి, రిజిస్ట్రేషన్లు, ల్యాండ్ ఇష్యూస్, భూ భారతి చట్టం, నిబంధనలు, అమలు, డాక్యుమెంట్లు వంటి వాటికే పరిమితం. ఇతర ఏఐలను అడిగినట్టు తిక్క తిక్క ప్రశ్నలు అడిగితే.. వెబ్ సైట్ ను సంప్రదించాలని మాత్రమే సూచిస్తుంది.

వాయిస్ తోనూ అడగొచ్చు

ప్రస్తుతం కొన్ని అంశాలకే పరిమితమైన భూ మిత్రను విస్తరించనున్నారు. భూ భారతి వెబ్ పోర్టల్ లో అప్ లోడ్ చేసిన ప్రతి రికార్డుపైన అడిగే ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇచ్చేలా మార్పులు చేస్తున్నారు. అంటే ఏ వ్యక్తి పేరిట ఎంత భూమి? ఎక్కడ ఉంది? సర్వే నంబర్ల వివరాలు? ఇలాంటివి నిర్దిష్టంగా అడిగితే జవాబులు వస్తాయి. టైప్ చేసి ప్రశ్నలు అడగలేని వారి కోసం వాయిస్ ద్వారా ప్రశ్నను అడిగినా.. ఆన్సర్ వచ్చేలా సాఫ్ట్ వేర్ ను తీర్చిదిద్దుతున్నారు.

ఫోన్ ద్వారానూ..

ప్రస్తుతం సీసీఎల్ఏ కార్యాలయం +9140‌‌29313999 నంబరుకి కాల్ చేసి సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశముంది. అయితే ఇలా ఫోన్ ద్వారా రైతులకు సేవలు అందించే కార్యక్రమాన్ని జిల్లాలకూ విస్తరించాలని ఆలోచిస్తున్నారు. దీనికి ఇప్పటికే కొందరు కలెక్టర్లు ఆమోదం తెలిపారు. కలెక్టర్లందరూ సిద్ధమైతే అన్ని జిల్లాల్లోనూ ఫోన్ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అయితే దీనికి మానవ వనరుల అవసరం ఉంటుంది.

రూల్స్ కి అనుగుణంగా..

భూ భారతి చట్టం రూల్స్ కు అనుగుణంగా భూమిత్రను రూపొందించారు. గతంలో ఇలాంటి సేవలు ఎందుకు అందించలేదన్న ప్రశ్నలు వినిపించాయి. దానికి ధరణి పోర్టల్, ఆర్వోఆర్-2020 చట్టానికి ప్రత్యేకంగా రూల్స్ లేకపోవడమే కారణమని అధికారులు చెప్తున్నారు. సేవలు అవే.. కానీ వాటిని అందించే అంశంలో రూపం మారుతుంది. గతంలోనూ మ్యుటేషన్ ఉంది. ఇప్పుడూ ఉంది. కానీ అది అమలు చేసే విధానం మారింది. గతంలో వంద రోజులు పట్టేది. ఇప్పుడు అప్పటికప్పుడే చేస్తున్నారు. అలాగే రిజిస్ట్రేషన్ లోనూ సర్వే మ్యాప్ తప్పనిసరి చేయబోతున్నారు. అదే భూమి, అదే సర్వే నంబరు, అదే రిజిస్ట్రేషన్. కానీ సేవలందించడంలో ఆధునిక సాంకేతికత, మెరుగైన వ్యవస్థను రూపొందించారు.

Next Story