- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భూభారతిలో కొత్త ఫీచర్స్.. ఏ మార్పులు చేయాలన్నా రైతు ఆమోదం తప్పనిసరి
అక్రమాలకు చెక్ పెడుతూ.. పారదర్శకతకు పెద్దపీట వేసేలా భూభారతిని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: అక్రమాలకు చెక్ పెడుతూ.. పారదర్శకతకు పెద్దపీట వేసేలా భూభారతిని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం త్వరలో మొబైల్ యాప్ డిజైన్ చేసేలా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఎవరు ఎవరి భూమినైనా డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తే.. వెంటనే ఓనర్ మొబైల్ కి మెస్సేజ్ వచ్చేలా కొత్త ఫీచర్స్‌ను యాడ్ చేస్తున్నట్లు సమాచారం. దీని ద్వారా ఎవరి భూమినైనా వారికి తెలియకుండా సవరించినా, నిషేధిత జాబితాలో నమోదు చేసినా, వేరెవరికైనా విక్రయించేందుకు స్లాట్ బుక్ చేసినా వెంటనే రైతులకు అలర్జ్ మెస్సేజ్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఏ చిన్న మార్పు చేయాలన్నా.. సదరు రైతుకు నోటీసు ఇవ్వకుండా చేయలేరు. ప్రతి చేంజ్ కు రైతు ఆమోదం తప్పనిసరి అవుతుంది. దీని ద్వారా ఏ అధికారి అయినా.. ఇతరులైనా ఇష్టమొచ్చిన రీతిలో రికార్డులు మార్చే వీల్లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. త్వరలోనే ఇలాంటి సరికొత్త మార్గాన్ని అమలు చేయాలని టెక్నికల్ గా లీడ్ చేస్తున్న ఓ అధికారి ప్రభుత్వానికి వివరించారు. ఆచరణాత్మక, ప్రయోగాత్మకమైన ఇలాంటి వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వ పెద్దలు కూడా అంగీకరించినట్లు తెలిసింది.
ధరణిలో ఉద్దేశ్యపూర్వకంగా ‘బ్లాక్’!
ధరణి పోర్టల్‌లో ఎవరి భూమినైనా ఉద్దేశ్యపూర్వకంగా నిషేధిత జాబితాలో పెట్టించడం పెద్ద కష్టం కాదు. ఏదో ఒక కేసు వేసి.. ఆ సర్వే నంబరుకు సంబంధం లేకపోయినా బ్లాక్ చేయించొచ్చు. సదరు భూమిని కొనుగోలు చేసేందుకు స్లాట్ బుక్ చేసి పెండింగులో పెడితే ఎంత కాలమైనా.. ఆ స్లాట్ పూర్తయ్యే వరకు బ్లాక్‌లోనే ఉంటుంది. అంటే రైతు తన భూమిని ఎవరికి అమ్మకపోయినా, అమ్మేందుకు ప్రయత్నించకపోయినా ఇతరులు కూడా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆఖరికి ఏ అధికారికి కోపం వచ్చినా, అడిగింది ఇవ్వకపోయినా.. ఈ ల్యాండ్‌ను ప్రభుత్వ ప్రజాప్రయోజనాల కోసం సేకరించనున్నారంటూ ఓ నంబరు జారీ చేసి.. దాన్ని అప్ లోడ్ చేస్తే ఎన్నాండ్లకైనా అది నిషేధిత జాబితాలోనే ఉంటుంది. ధరణి పోర్టల్ ను అడ్డం పెట్టుకొని అలా బ్లాక్ చేసిన విస్తీర్ణం వేల ఎకరాల్లో ఉంటుంది. కొందరు పెద్దలు రైతులను దారికి తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంతో అధికారుల సహకారంతో అనేక మంది భూములను నిషేధిత జాబితాలో నమోదు చేయించిన ఉదంతలు ఉన్నాయి. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా గండిపేట, శంషాబాద్, తలకొండపల్లి, షాద్ నగర్, కేశంపేట, మహేశ్వరం, కందుకూరు మండలాల్లో ఈ తతంగం జరిగింది. దానికి సంబంధించిన అనేక ఆధారాలు ఉన్నాయి. ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా అలాంటివన్నీ వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎవరి లాగిన్ ద్వారా వాటిని భూ సేకరణ నోటీసు పేరిట నిషేధిత జాబితాలో నమోదు చేశారో కూడా తెలుసుకునే అవకాశం బ్లాక్ చైన్ టెక్నాలజీలోనూ ఉన్నది. ధరణి పోర్టల్ డేటాను విశ్లేషిస్తే ఏయే అధికారులు ఈ దందాకు సహకరించారన్న విషయం స్పష్టం అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
భూభారతిలో ‘నో ప్రైవసీ’
వట్టినాగులపల్లి, మొయినాబాద్, కోకాపేట, గండిపేట, గచ్చిబౌలి, పుప్పాలగూడ, శంషాబాద్, అజీజ్ నగర్ ల్లో కొంతమంది వివాదాస్పద భూములను కొనుగోలు చేశారు. కొన్ని ప్రభుత్వ భూములనూ పట్టాగా మార్చుకున్నారు. అయితే ఎవరు అలా చేశారో తెలియకుండా ధరణిలో ‘రైట్ టూ ప్రైవసీ’ ఆప్షన్ ఉపయోగించుకొని గోప్యతను పాటించారు. ప్రధానంగా జీవో 111 పరిధిలో చోటు చేసుకున్న అక్రమాల సంఖ్య అన్నీ ఇన్నీ కావు. అయితే ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా ఇలాంటి వాటి నిగ్గు తేలుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి పునరుద్ఘాటించారు. దీని ద్వారా ఎన్ని వివాదాస్పద భూములను ఎవరు, ఎలా, ఎప్పుడు, ఎక్కడ కొనుగోలు చేశారు? ఎన్ని కోట్ల ప్రాపర్టీని వారి పేరిట రాసుకున్నారో లెక్కలు బయటికొస్తాయి. అయితే భూ భారతిలో ఇలాంటి వాటికి అవకాశమివ్వొద్దని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రతి ల్యాండ్ పార్శిల్ డేటాను భూ భారతిలో అప్ లోడ్ చేశారు. ల్యాండ్ డిటెయిల్స్ కి వెళ్లి సెర్చ్ చేస్తే ఎవరి ల్యాండ్ వివరాలైనా, ఏ సర్వే నంబర్ లో ఎవరికి ఎంత విస్తీర్ణం ఉన్నదన్న విషయం కనిపిస్తుంది. రైట్ టు ప్రైవసీ ఆప్షన్ ను తొలగించాలని భావిస్తున్నట్లు సమాచారం.
యూజర్ ఫ్రెండ్లీ
ధరణి పోర్టల్ లో 35 మాడ్యూల్స్ ఉండడం వల్ల సంబంధిత సమాచారం కోసం వెతుక్కోవాల్సి వచ్చేది. ఆర్వోఆర్ కరెక్షన్ కోసమే పది దాకా మాడ్యూల్స్ ఉండేవి. ఇక రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ కు కూడా పలు విధాలుగా అప్లయ్ చేయాల్సి వచ్చేది. ఆ గందరగోళానికి చెక్ పెడుతూ భూభారతిని యూజర్ ఫ్రెండ్లీగా రూపొందించారు. ఇంకా అభివృద్ధి చేసేందుకు టెక్నికల్ టీమ్స్ కృషి చేస్తున్నాయి. పోర్టల్ లో ట్రాన్సక్షనల్ సర్వీసెస్ పేరిట ఆరు మాడ్యూల్స్ ఉన్నాయి. వాటిలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఆర్వోఆర్ కరెక్షన్స్, మిస్ లీనియస్, నాలా కన్వర్షన్, అప్పీల్ అండ్ రివిజన్ మాత్రమే ఉంటాయి. భూ హక్కుదారుడికి సంబంధించిన ఏ మార్పు, ఏ సమస్య పరిష్కారాన్ని కోరుకున్నా ఈ ఆరింటితోనూ పని పూర్తవుతుంది. ఇక్కడే కొత్తగా అప్పీల్ అండ్ రివిజన్ ని తీసుకురావడం గమనార్హం. తహశీల్దార్ చేయకపోతే ఆర్డీవో, ఆర్డీవో చేయకపోతే కలెక్టర్ కి అప్పీల్ చేసుకునేందుకు మాడ్యూల్ ను తీర్చిదిద్దుతున్నారు. సీసీఎల్ఏకి రివిజన్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఈ మాడ్యూల్ ద్వారా లభిస్తుంది. అయితే ప్రస్తుతానికి ప్రిపరేషన్ లో ఉంది.
సమాచారం కోసం ఐదు..
ప్రజలెవరైనా భూముల గురించి తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. ఇందులో ఐదు మాడ్యూళ్లతో పూర్తి వివరాలను క్రోడీకరించారు. మార్కెట్ విలువలు, ల్యాండ్ డిటెయిల్స్, నిషేధిత భూముల జాబితా, ఈ చలాన్/అప్లికేషన్ స్టేటస్, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ డిటెయిల్స్ గా ఉన్నాయి. ఇవి కూడా ఈజీగా ఎవరైనా వెబ్ సైట్ లోకి వెళ్లి తెలుసుకునేలా డిజైన్ చేశారు. మొబైల్ లో కూడా అన్ని వివరాలు బాగా కనబడేలా తీర్చిదిద్దారు.
రూల్ ఆఫ్ లా
భూ భారతిలోని ప్రతి రూల్ అమలు చేసేలా పోర్టల్ ను డిజైన్ చేసినట్లు సీసీఎల్ఏ అధికార వర్గాలు తెలిపాయి. అప్లికేషన్లు, దరఖాస్తుల స్వీకరణ, నోటీసుల జారీ, ఉత్తర్వులు జారీ వంటి అన్ని అంశాలు దీని నుంచి చేయగలిగేటట్లు రూపొందించారు.
స్పీడ్ గా లాగిన్
ధరణి పోర్టల్ ను లాగిన్ చేసిన తర్వాత ఓపెన్ కావడానికి టైం పట్టేది. ఇప్పుడా సమస్యకు చెక్ పెట్టారు. స్పీడీ లాగిన్ వెబ్ పోర్టల్ గా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. భవిష్యత్తులోనూ ఇంకా వేగంగా పని చేసేటట్లు తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు సీఎమ్మార్వో పీడీ మందా మకరంద్ తెలిపారు.
భూధార్ యాప్
త్వరలోనే ఎఫెక్టివ్ గా పని చేసేందుకు భూదార్ యాప్ ను తీసుకురాబోతున్నారు. ఇంకా ఫైనల్ కాలేదు. కానీ భూ భారతి మాదిరిగానే అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియ వేగవంతం చేస్తున్నారు.
ప్రజల సేవలో భూ రక్షక్
త్వరలోనే భూ భారతి ద్వారా ప్రజలకు సత్వర సేవలు, సూచనలు అందించేందుకు భూరక్షక్‌ను తీసుకొస్తున్నారు. యుద్ధప్రాతిపదికన దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రతి ప్రశ్నకు దీని నుంచి సమాధానం ఇచ్చేలా డిజైన్ చేస్తున్నారు. ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఇది ఎంతో దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే భూమిత్రతో పాటు హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు కానున్నది.
త్వరలోనే అప్పీల్ ఆప్షన్
భూ భారతి చట్టంలో ప్రస్తావించిన అప్పీల్స్, రివిజన్స్ కోసం మాడ్యూల్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. దాంతో పాటు సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం, అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు, క్యాడస్ట్రల్ మ్యాప్స్, నాన్ అగ్రికల్చర్ వంటి అన్ని వివరాలను వెబ్ సైట్ లో ఉంచేందుకు కసరత్తు నడుస్తున్నది.






