దేశానికి రోల్ మోడల్ భూభారతి : మంత్రి పొంగులేటి

by Bhanu |

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక భూభారతి చట్టం దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

దేశానికి రోల్ మోడల్ భూభారతి : మంత్రి పొంగులేటి
X

దిశ, సైదాపూర్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక భూభారతి చట్టం దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లాలోని భూభారతి పైలట్ మండలం సైదాపూర్ లోని ఘనపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్ చట్టం అవగాహనా సదస్సుకు మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... భూభారతి కొత్త రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా సైదాపూర్ మండలాన్ని పైలట్ గా ఎంపిక చేసామని, ఇప్పటివరకు ఈ మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల ద్వారా 1600 దరఖాస్తులు వచ్చాయని అన్నారు. న్యాయపరమైన సమస్యలన్నీ భూభారతి ద్వారా అధికారులు తప్పక త్వరలోనే పరిష్కరిస్తారని వివరించారు. 2020లో ధరణి చట్టం తెచ్చినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల 20 వేల పైచిలుకు భూ సమస్యలు ఉండేవని తెలిపారు. చట్టంలో ఎలాంటి నిబంధనలూ లేకపోవడం వల్ల ఎక్కడి సమస్యలు అక్కడే ఉండేవని తెలిపారు.

ధరణిలో చిన్నచిన్న పొరపాట్లను కూడా సవరించే అవకాశం లేకపోయిందని అన్నారు. ఎంతోమంది రైతులు న్యాయస్థానాల చుట్టూ తిరిగి అలిసిపోయారని అన్నారు. భూభారతి చట్టం ద్వారా తహసీల్దార్ స్థాయి నుండి సీసీఎల్ఐ వరకు పరిష్కారం లభించేలా నిబంధనలు పొందుపరిచామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 6000 మంది సర్వేయర్లకు మూడు నెలల పాటు శిక్షణ ఇస్తున్నామని అన్నారు. మండలానికి ఆరు నుండి 8 మంది సర్వేయర్లు పనిచేయనున్నారని తెలిపారు. జూన్ 2 నుండి ప్రతి రెవిన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి చొప్పున 10956 గ్రామాల్లో రెవిన్యూ అధికారులు విధులు నిర్వహించనున్నారని తెలిపారు. జూన్ 2 నుండి తహసీల్దార్ స్థాయి అధికారులు ప్రతి గ్రామానికి వస్తారని, భూ సమస్యల దరఖాస్తులు వారికి అందించాలని తెలిపారు. ఒక్క రూపాయి ఫీజు కూడా ఎవరికీ చెల్లించాల్సిన పనిలేదని, శాశ్వతంగా సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. దరఖాస్తు కూడా ఉచితంగా ఇస్తారని తెలిపారు. నలుగురు వ్యక్తులు నాలుగు గోడల మధ్య తయారుచేసిన ధరణి చట్టం వల్ల అనేక సమస్యలు వచ్చాయని అన్నారు. 18 రాష్ట్రాల్లో ఆరు నెలల పాటు పర్యటించి మంచి అంశాలను క్రోడీకరించి భూభారతి చట్టం రూపొందించామని, నియమ నిబంధనలు పొందుపరిచామని అన్నారు. ధరణి చట్టం దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తోందని వివరించారు. ఈ చట్టంలో అప్పీలుకు అవకాశం ఉన్నందున అధికారి న్యాయం చేయలేదని భావిస్తే పై స్థాయి అధికారులకు, సీసీఎల్ఐ కి అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి సమస్యకు ఈ చట్టంలో అవకాశం ఉందని, కోర్టుల చుట్టూ తిరగాల్సిన పనిలేదని తెలిపారు.

ప్రతి పేదవాడికి గూడు ఉండాలన్న ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టామని, మొదటి విడతలో నాలుగున్నర లక్షల ఇండ్లు మంజూరు చేశామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 80 వేల ఇండ్ల నిర్మాణం ప్రారంభమయ్యాయని తెలిపారు. 20 లక్షల ఇండ్లు కట్టాలనేది ప్రభుత్వ లక్ష్యం. అప్పుల భారం ఉన్నా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. రాజీవ్ యువ వికాసం, ఇందిరా గిరిజల వికాసం వంటి ఎన్నో పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నో దశాబ్దాలుగా పోడు, ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటున్న అర్హులైన వారందరికీ జూన్ 2న పట్టాలు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

బీసీ& రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.... సైదాపూర్ మండలంలో భూపరమైన సమస్యలు భూ భారతి ద్వారా పరిష్కారం చేస్తాం భూమి అంటే ఆత్మగౌరవం ఆభూమి సమస్యల్లో ఉంటే పంచాయతీల్లో ఉంటే ఇబ్బందులు ఉంటాయి. గ్రామాల్లో ప్రధాన సమస్య ధరణిలో మా పేరు తప్పుగా పడింది ఆ సమస్య పరిష్కారం చేయాలని మాకు వినతులు వస్తుండేవి. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ధరణి స్థానంలో భూ భారతి తీసుకొస్తామని హామీ ఇచ్చాం..ఇచ్చిన మాట ప్రకారం భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి తెచ్చాం.. మనకి ఆదార్ కార్డు ఉంది ఇప్పుడు భూ యజమానికి భూధార్ కార్డు వస్తుంది. భూనక్ష భూహక్కులు మీకు కల్పిస్తున్నాం. సైదాపూర్ రెవెన్యూ పరమైన సమస్యలు పరిష్కారం చేసుకొని రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు లేని మండలంగా గుర్తింపు తెచ్చుకుందాం.

నిన్న నాగర్ కర్నూల్ జిల్లాలో గిరిజనుల కోసం ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభించుకున్నాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నియోజకవర్గానికి ఒకే ఏడాది లో 3500 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం.. గత 10 సంవత్సరాల్లో కేవలం 230 డబుల్ బెడ్ రూం ఇల్లు మాత్రమే ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు లేదు.. ప్రతి గ్రామంలో పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నాం. చిగురుమామిడి, మానకొండూరు కాలువ పనులు ప్రారంభం అవుతాయి. నియోజకవర్గ సమస్యలు ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తున్నారు.

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ....

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో భూభారతి అవగాహన సదస్సులు నిర్వహించామని అన్నారు. సైదాపూర్ మండలంలో సుమారు 30 వేల ఎకరాల భూమి ఉండగా అందులో సుమారు 29వేల ఎకరాల సాగు భూమి ఉందని అన్నారు. అన్ని రకాల భూములు ఇక్కడ ఉన్నందున భూభారతి పైలట్ మండలం గా సైదాపూర్ ను ఎంపిక చేసామని తెలిపారు. అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించగా 410 దరఖాస్తులు ఇప్పటికే పరిష్కారం అయ్యాయని అన్నారు. ధరణిలో సవరణలకు వెసులుబాటు లేని కారణంగా అనేక సమస్యలు ఉండేవని తెలిపారు. జూన్ 2 నుండి నిర్వహించే రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమానంతరం భూభారతిలో పరిష్కరించిన దరఖాస్తులకు సంబంధించిన ఉత్తర్వులు అందజేశారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు.

కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ , ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, కరీంనగర్ సీపీ గౌస్ ఆలం, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ ,హుస్నాబాద్ ,సైదాపూర్, కోహెడ మార్కెట్ కమిటీ చైర్మన్లు తిరుపతి రెడ్డి ,దొంత సుధాకర్,నిర్మలా జయరాజ్ , ఆర్డీవో, ఎమ్మార్వో ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Next Story