Harish Rao: మీ శాఖపై మీకు కనీస అవగాహన కూడా లేదా? భట్టి, శ్రీధర్ బాబుకు హరీశ్ రావు కౌంటర్

by Prasad Jukanti |   (  Updated:2025-11-29 13:31:54  IST  )

Harish Rao: మీ శాఖపై మీకు కనీస అవగాహన కూడా లేదా? భట్టి, శ్రీధర్ బాబుకు హరీశ్ రావు కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: విద్యుత్ అంశంపై ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) నిర్వహించిన పీపీటీపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) కౌంటర్ ఇచ్చారు. విద్యుత్‌పై అసెంబ్లీ సాక్షిగా మీరు విడుదల చేసిన స్టేట్ పవర్ సెక్టార్ శ్వేతపత్రం, ఇటీవల విడుదల చేసిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025, ఇవాళ పీపీటీలో చెప్పిన విద్యుత్ గణాంకాలు ఒక దానికి మరొకటి పొంతన లేకుండా ఉన్నాయనే కనీస అవగాహన భట్టి విక్రమార్కకు ఉందా అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎంగా, విద్యుత్ మంత్రిగా రెండేళ్లు పూర్తయినప్పటికీ మీ శాఖలోని విషయాలపై మీకు ఏమాత్రం అవగాహన లేకున్నప్పటికీ ఇతరులను అన్ ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని కామెంట్ చేయడం మీకు తగునా? అని నిలదీశారు. ఈ మేరకు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసిన హరీశ్ రావు.. మీ అధికారులు ఒక్కో సారి, ఒక్కో లెక్కలతో మీ చేతుల మీదుగానే ఆవిష్కరింప చేస్తున్నారంటే మీ శాఖపై మీకు కనీస అవగాహన కూడా లేదన్నది స్పష్టం అవుతోందన్నారు.

కమిషన్ల మీద శ్రద్ధ పాలసీలపై లేదు:

ప్రభుత్వానికి కమీషన్లపై ఉన్న శ్రద్ధ, పాలసీలపై ఉండి ఉంటే.. ఈ పొరపాట్లు జరగవని, మీరు ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా లెక్కలు చెబుతున్నారన్న విషయం కూడా మీకు తెలియదని దుయ్యబట్టారు. మీరు విడుదల చేసిన శ్వేత పత్రం పేజీ నెం.7లో 01-12-2023 నాటికి సోలార్ కెపాసిటీ 6123 మెగావాట్లు అని చెప్పారు.

మొత్తం కాంట్రాక్టెడ్ కెపాసిటీ 19,475 అని చెప్పారు. 11-01-2025 నాడు మీరు విడుదల చేసిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ పేజీ నెం.8లో కరెంట్ ఇన్టాల్డ్ కెపాసిటీ 5,415 మెగావాట్లు అని, అప్ కమిగ్ 2,474 అని మొత్తం7,889 మెగావాట్లు చెప్పారు. 2023లో 6123 మెగావాట్లు ఉంటే, 2025 నాటికి 5,415 మెగావాట్లు ఎట్ల అయ్యింది? పెరుగుతుందా? తగ్గుతుందా? అని ప్రశ్నించారు. ఈరోజు మీరు ప్రదర్శించిన పీపీటీలో ఏం లెక్క చెప్పారో మీకు తెలుసా? గతంలో ప్రకటించిన పాలసీ, శ్వేతపత్రంతో పోల్చి చూసుకున్నారా? అని నిలదీశారు.

రూ.50 వేల కోట్ల స్కామ్ కోసమే ఈ హడావుడి:

ఇక మీ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ పేజీ నెం.8లో తెలంగాణ కరెంట్ కాంట్రాక్టెడ్ కెపాసిటీ 26,212 మెగావాట్లు అని చెప్పారని అదే పాలసీ పేజీ నెంబర్ 10లో 2029-30 నాటికి 49,104 మెగావాట్లు అని 2034-35కు 66,694 మెగావాట్లు అని చెప్పారు. అంటే మీరు పెట్టుకున్న లక్ష్యంలో 2029-30 నాటికి 1729 (15,893-14,164) మెగావాట్ల థర్మల్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. మొన్న మీరిచ్చిన కేబినెట్ నోట్ ప్రకారం, 2,400 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నారు. మీరే ఇచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని ఎందుకు తుంగలో తొక్కారు? అని నిలదీశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం, 1600 మెగావాట్ల ఎన్టీపీసీ పవర్ అందుబాటులో ఉండగా, ఎన్టీపీసీతో ఒప్పందం చేసుకోకుండా ఎందుకు హడావుడిగా 2400 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్స్ నిర్మాణానికి వెళ్తున్నారు? ఎందుకంటే ఇది 50 వేల కోట్ల బడా స్కాం కాబట్టే ఈ హడావుడి అని ఆరోపించారు.

ఏది తప్పు?:

2025 ఎనర్జీ పాలసీ కాపీ 10వ పేజీలో 2034-35 వరకు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి 16,966 మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని మరి ఈరోజు మాత్రం 5000-6000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ లోటు ఉండబోతున్నదని ఎట్లా అన్నారు? అని ప్రశ్నించారు. నేటికి 14,164 మెగావాట్ల థర్మల్ విద్యుత్ అందుబాటులో ఉందని మీ పాలసీలోనే చెప్పారు, 2034-35కు 16,966 మెగావాట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే మీ లెక్క ప్రకారం లోటు 2802 మెగావాట్ల లోటు ఉండాలి. కానీ ఈరోజు మాత్రం 5000-6000 మెగావాట్ల లోటు ఉన్నది అంటున్నారు. ఇదంతా ఎట్లా సాధ్యం భట్టి గారూ..? మీ పాలసీ తప్పా? ఈరోజు ప్రదర్శించిన పీపీటీ తప్పా?

మీరే సంతకం పెట్టిన గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 పేజీ నెంబర్ 3 ప్రకారం, 2030 నాటికి 20వేల మెగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ తీసుకొస్తున్నాం అన్నారు. రాబోయే ఐదేళ్లలో మీరు సాధించవలసింది సుమారు 13,000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ ఉండగా, ఎందుకు థర్మల్ ప్లాంట్లంటూ ముందుకు వెళ్తున్నారు? ఆగమేఘాల మీద క్యాబినెట్ ఎందుకు నిర్ణయం తీసుకున్నది? అని ప్రశ్నించారు. మొత్తం 2400 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణం కోసం చేసే 50వేల కోట్ల ఖర్చులో 30-40శాతం కమీషన్ పొందడానికే కాదా? అని నిలదీశారు.

అధికారులు రాసిచ్చింది గుడ్డిగా చదివినట్లున్నారు:

ఇక మంత్రి శ్రీధర్ బాబు అధికారులు ఏదో రాసిన దాన్ని గుడ్డిగా చదివినట్లున్నారని మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం పేజీ నెం.11లో ఏముందో ఒక్క సారి చూసుకోండన్నారు.యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు కోల్ ట్రాన్స్ పోర్టుకు ఏడాదికి రూ.803 కోట్లు కావాలని శ్వేతపత్రంలో పెట్టింది మీరే కదా? క్యాబినెట్ మంత్రిగా ఉండి నేడు 1600 కోట్లు ఖర్చు అవుతుందని ఎట్ల మాట్లాడుతారని నిలదీశారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటును తప్పు పట్టిన నాటి కాంగ్రెస్ నాయకులకు, క్యాబినెట్‍లో చర్చించి మక్తల్ వద్ద థర్మల్ ప్లాంటు ఏర్పాటు చేస్తామన్న ప్రకటన చేసింది మీరు కాదా? నాడు యాదాద్రి తప్పు అయితే, నేడు మక్తల్ ఒప్పు అవుతుందా? మక్తల్‍లో పెట్టబోయేది థర్మలా, సోలారా, విండా అనేది చర్చిస్తున్నామని ఇవాళ భట్టి విక్రమార్క చెప్పడం హాస్యాస్పదం అన్నారు. మక్తల్ వద్ద 800 మెగావాట్ల థర్మల్ ప్లాంటు ఏర్పాటు చేస్తామని స్వయంగా మంత్రులే చెప్పింది అబద్దమా? నేడు భట్టి విక్రమార్క చెబుతున్నది అబద్దమా? ఏది అబద్దం ఏది నిజమో స్పష్టం చేయాలన్నారు.

ఈ పద్ధతి మార్చుకోండి:

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు ఒక్క మెగావాట్‍కు 8.64 కోట్లు ఖర్చు అయ్యిందని, ఎన్టీపీసీ రామగుండంలో 7.63 కోట్లు ఖర్చు అయ్యిందని శ్వేతపత్రం పేజీ నెంబర్ 11లో చెప్పారని ఎన్టీపీసీ ఫేజ్ 2, 2023 డిసెంబర్ 1 నాటికి 3×800 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఇంకా మొదలు పెట్టలేదని శ్వేతపత్రంలో నాడు మీరే ప్రకటించారన్న విషయం మీకు తెలుసా? అది క్లియర్‍గా ప్రకటించి బీఆర్ఎస్ మీద ఎందుకు నెపం నెడుతున్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేశాక 800 మెగావాట్లకు మీరు అగ్రిమెంట్ చేసుకొని, మిగతా 1600 మెగావాట్లు అక్కర్లేదని చెప్పింది నిజమా? అబద్దమా? అని ప్రశ్నించారు. మీరు ఏర్పాటు చేసే రామగుండం పవర్ ప్లాంట్ పర్ మెగావాట్ 14కోట్లు ఖర్చు అవుతుందని క్యాబినెట్ ప్రెస్ బ్రీఫింగ్‍లోనే చెప్పారు. కానీ ఎన్టీపీసీ 12.3 కోట్లు. పర్ మెగావాట్ కు దాదాపు 2 కోట్లు ఎందుకు వచ్చింది అనే విషయం చెప్పకుండా ఇంకా డీపీఆర్ కాలేదని బుకాయిస్తున్నారని విమర్శించారు. మహిళా సంఘాలకు వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు అప్పగిస్తాన్న ప్రకటనలు ఎక్కడి దాకా వచ్చిందని మొన్న నేను ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా దాటవేసి, ప్రతిపక్షాల మీద బురద చల్లడానికి ఉపయోగించుకున్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ ప్రజలను తప్పుదోవ పట్టించడాన్ని, ప్రతిపక్ష నాయకులపై దురుసుగా మాట్లాడే పద్ధతి మార్చుకోవాలని హరీశ్ రావు ఈ సందర్భంగా హితవు పలికారు.

Next Story