రాయలసీమ ఎత్తిపోతల పూర్తయితే ఖమ్మం, నల్గొండ ఎడారులే : భట్టి విక్రమార్క

by Muthe.Rajitha |

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (RLIP) పూర్తయితే తెలంగాణ జిల్లాలు ఎడారులుగా మారతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) పేర్కొన్నారు.

రాయలసీమ ఎత్తిపోతల పూర్తయితే ఖమ్మం, నల్గొండ ఎడారులే : భట్టి విక్రమార్క
X

దిశ, వెబ్ డెస్క్ : రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (RLIP) పూర్తయితే తెలంగాణ జిల్లాలు ఎడారులుగా మారతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) పేర్కొన్నారు. నేడు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని వంగవీడులో రూ.630.30 కోట్లతో చేపట్టిన జవహర్ ఎత్తిపోతల పథకానికి నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకాటి శ్రీహరితో కలిసి భట్టి విక్రమార్క శంకుస్థాపన చేసారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో భట్టి మాట్లాడుతూ... శ్రీశైలం రిజర్వాయర్ నుండి రోజుకు 3 టీఎంసీల నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించే లక్ష్యంతో ఏపీ చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయితే, కృష్ణా నది జలాల వాటాలో తెలంగాణకు గణనీయమైన నష్టం వాటిల్లే అవకాశం ఉందని అన్నారు.

ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో నీటిపారుదల, తాగునీటి సమస్యలు తీవ్రమవుతాయని ఆందోళన వ్యక్తం చేసారు.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ 1 టీఎంసీ నీటిని వినియోగిస్తుంటే, ఏపీ 11 టీఎంసీల నీటిని వాడుకుంటోందని, ఇలా కొనసాగితే రిజర్వాయర్ ఖాళీ అవుతుందని హెచ్చరించారు. ఈ ప్రాజెక్టు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. 2020లో ఏపీ ప్రభ్యత్వం జీవో 203 జారీ చేసినప్పుడు ఎలాంటి వ్యతిరేకత తెలపకుండా బీఆర్ఎస్ రాయలసీమ ప్రాజెక్టుకు సహకరించిందని భట్టి ఆరోపించారు.

మధిర ప్రాంత ప్రజలు తాగునీటికి, వ్యవసాయానికి నీళ్లులేక ఎన్నో ఇబ్బందులు పడ్డారని,అవన్నీ జవహర్ లిఫ్ట్ తో తీరతాయని అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా జలాల్లో తాము తెలంగాణకు 71 శాతం వాటా కోసం పోరాడుతున్నామని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 34 శాతం వాటాకే ఒప్పుకుని తెలంగాణకు అన్యాయం చేసిందని విమర్శించారు.

Next Story