ఆధునిక, సమగ్ర, భవిష్యత్ కు సిద్దమయ్యే తెలంగాణను నిర్మిద్దాం: భట్టి

by Ajay Maddhiboyina |

రాష్ట్ర ప్రభుత్వం 2047 తెలంగాణ రైజింగ్ ఉత్సవాలను పెద్ద ఎత్తున డిసెంబర్ ​8, 9 తేదీల్లో నిర్వహించబోతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అన్ని రకాల పాలసీలను ప్రకటిస్తామని ఈ కార్యక్రమంలో బ్యాంకర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఆధునిక, సమగ్ర, భవిష్యత్ కు సిద్దమయ్యే తెలంగాణను నిర్మిద్దాం: భట్టి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం 2047 తెలంగాణ రైజింగ్ ఉత్సవాలను పెద్ద ఎత్తున డిసెంబర్ ​8, 9 తేదీల్లో నిర్వహించబోతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అన్ని రకాల పాలసీలను ప్రకటిస్తామని ఈ కార్యక్రమంలో బ్యాంకర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం బేగంపేటలో నిర్వహించిన బ్యాంకర్స్ 47వ త్రైమాషిక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా 13 శాతం జీడీపీ పెరుగుదల టార్గెట్ గా 2047 రోడ్ మ్యాప్ ను విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం 10 శాతం చొప్పున పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన విద్యుత్తు సరఫరా లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, రీజినల్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డును కలుపుతూ అనేక ఇండస్ట్రియల్ కారిడార్ల నిర్మాణం, మూసి పునర్జీవనం వంటి అంశాలను వివరించి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడిదారులను పెద్ద ఎత్తున ఆకర్షించబోతున్నామన్నారు.

హైదరాబాద్ మహానగరం తో పాటు తెలంగాణ రాష్ట్రం వ్యూహాత్మకంగా, వాతావరణం, భాష, భూమి, తక్కువ ధరలకే నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, బలమైన విద్యుత్ సరఫరా వ్యవస్థ వంటి అంశాలను వివరించి పెట్టుబడిదారులను ఆకర్షించినట్టు పేర్కొన్నారు. బ్యాంకర్లు కార్పొరేట్ సంస్థలతోపాటు స్వయం సహాయక సంఘాలు, సూక్ష్మ మధ్యతరహా, చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఆరోగ్యం అంశాలపై ప్రధానంగా దృష్టి సారించిందని బ్యాంకర్లు సి ఎస్ ఆర్ నిధులను చీఫ్ సెక్రటరీ మొదలు కలెక్టర్ వరకు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నీ సంప్రదించి ఈ రంగాల్లో సిఎస్ఆర్ నిధులను ఖర్చు చేయాలని సూచించారు. విద్యను ప్రోత్సహించేందుకు మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు, డిజిటలైజ్ ఎడ్యుకేషన్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. తెలంగాణ ఇప్పుడు కీలకమైన అభివృద్ధి దశలో ప్రవేశిస్తోంది, బ్యాంకింగ్ రంగం ముందు వరుసలో ఉండాలని బ్యాంకులు ఈ ఏడాది తొలి అర్ధభాగంలో 49.45 శాతం ప్రాధాన్య రంగ రుణాలను సాధించాయి. క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తి 130.18 శాతంగా ఉండటం తెలంగాణ ఆర్థిక ప్రయాణంపై ఉన్న విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తుందన్నారు.

రైతులకు బ్యాంకర్లు పంట రుణాలు మరింత పెంచాలి :

వ్యవసాయ మౌలిక వసతుల నిధి కింద మంచి పురోగతి సాధించాం, కానీ ఇది ప్రారంభం మాత్రమే. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిజంగా మార్పు చేయాలంటే పంట కోత తర్వాతి మౌలిక సదుపాయాలు, ప్రాసెసింగ్ యూనిట్లు, సూక్ష్మ పంట నీరు, మరియు అనుబంధ రంగాల్లో బ్యాంకు రుణాలను మరింతగా పెంచాలి అని బ్యాంకర్లకు సూచించారు. ప్రభుత్వం ఇప్పటికే పలు కీలక చర్యలు తీసుకుని రూ. 2 లక్షల వరకు పంట రుణ మాఫీ, రైతు భరోసా, సాగునీటి ప్రాజెక్టులు, 24×7 ఉచిత విద్యుత్. వీటికి మీ భాగస్వామ్యం కలిస్తే, మరింత ప్రతిఘటనశీలమైన, వాతావరణ మార్పులకు సిద్ధమైన వ్యవసాయ రంగాన్ని నిర్మించగలమని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్ ఆదాయాలను భద్రపర్చే ఫామ్ ఆయిల్ తో పాటు ఇతర విభిన్న పంటలకు బ్యాంకులు ఎక్కువ మద్దతు ఇవ్వాలని కోరారు. మహిళా సంఘాల సభ్యులు కేవలం లబ్ధిదారులు మాత్రమే కాదు వారు ఇప్పుడు వ్యాపారవేత్తలుగా, సంస్థల నాయకులుగా ఎదుగుతున్నారు. కొన్ని జిల్లాల్లో ఇంకా ఎస్​హెచ్​జీ రుణాలు తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడం లేదు, మహిళలు తమ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించేందుకు ఎక్కువ పరిమితులు, వేగవంతమైన రీపీట్ ఫైనాన్స్ అందించాలి అన్నారు. ఎంఎస్‌ఎంఈలు తెలంగాణలో ఉపాధి, ఆవిష్కరణలకు వెన్నెముకగా నిలుస్తున్నాయి. ఇప్పటివరకు ఎంఎస్‌ఎంఈల కోసం ఏసీపీ లక్ష్యాలలో 50.23 శాతం సాధించినప్పటికీ, వర్కింగ్ క్యాపిటల్ కొరతలు, రుణాల ప్రక్రియలో ఆలస్యం అనేక సంస్థలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. సీజిటిఎంఎస్ఈ, డిజిటల్ అసెస్‌మెంట్ పద్ధతులను మరింతగా వినియోగించి, క్లస్టర్ ఆధారిత రుణ వ్యూహాలను అనుసరించాలని పేర్కొన్నారు. భరోసాతో కూడిన, బలమైన ఎంఎస్‌ఎంఈ వ్యవస్థ వచ్చే దశాబ్దం తెలంగాణ రైజింగ్‌కు పునాది అని, 13 వేల కిలోమీటర్ల అంతర్గత రహదారుల నిర్మాణం జరుగుతోంది. దీనిని బ్యాంకులు ప్రాధాన్య రంగ రుణ అవకాశంగా చూడాలన్నారు.

తెలంగాణ అభివృద్దికి బ్యాంకులు కీలక పాత్ర పోషించాలి :

ప్రస్తుతం మౌలిక వసతుల ఫైనాన్సింగ్‌లో పాల్గొనడం రాష్ట్ర అవసరాలకు సరిపడడం లేదు. తెలంగాణ అభివృద్ధిలో తన నేతృత్వాన్ని కొనసాగించాలంటే బ్యాంకులు ఇక్కడ మరింత బలమైన పాత్ర వహించాలని సూచించారు. ప్రధానంగా పీఎంజెడీవై శాతం, బీమా కవరేజ్, ఇంకా కొందరు గ్రామ పంచాయతీల్లో బీసీల లభ్యత వంటి అంశాలను వివరిస్తూ ఈ లోటులను వేగంగా భర్తీ చేయాలన్నారు. డిజిటల్‌గా శక్తివంతమైన, ఆర్థికంగా భద్రత కలిగిన పౌర సమాజం సమగ్రంగా, భవిష్యత్‌కు సిద్ధమైన తెలంగాణ కోసం కీలకం అని వ్యాఖ్యానించారు. డిజిటల్ పేమెంట్ వ్యవస్థల్లో ఆన్‌బోర్డింగ్‌ను వేగవంతం చేసి, చివరి మైలు డెలివరీని బలోపేతం చేయాలన్నారు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు రాష్ట్రం సిద్ధమవుతోందని, మన దృష్టి, రాబోయే దశాబ్దానికిగాను రోడ్‌మ్యాప్‌ను ప్రపంచానికి పరిచయం చేయబోతున్నామన్నారు. గ్రామీణ పరివర్తనం, బలమైన ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లు, అధిక విలువ కలిగిన తయారీ, డిజిటల్ పరిపాలన, గ్రీన్ గ్రోత్ ఇవి తదుపరి దశకు దారితీసే రంగాలు అని వివరించారు. దీనికోసం బ్యాంకులు లావాదేవీ విధానం నుంచి రూపాంతరక భాగస్వామ్యం వైపు మారాలి. తెలంగాణ స్థిరత్వం, ఆశయం, అవకాశాలను అందిస్తోందన్నారు.

Next Story