- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: పోలిస్ శాఖలో బెట్టింగ్‍ల కలకలం.. మొన్న కానిస్టేబుల్, నిన్న ఎస్ఐ, నేడు గన్ మెన్
పని తీరులో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న తెలంగాణ పోలీస్ శాఖలో సొంత సిబ్బంది తీరు కలకలం రేపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో : పని తీరులో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న తెలంగాణ పోలీస్ శాఖలో సొంత సిబ్బంది తీరు కలకలం రేపుతోంది. ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్స్‌ను అరికట్టాల్సిన పోలీసు సిబ్బంది ఆ వ్యసనాల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో పీకల్లోతు ఆర్థిక సమస్యల్లో చిక్కుకుపోయి ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా హైడ్రా కమిషనర్ గన్‍మెన్‍గా విధులు నిర్వహిస్తున్న కృష్టచైతన్య తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇవాళ హైదరాబాద్ నగర శివారు హయత్ నగర్‌లోని తన ఇంట్లో తుపాకీతో పేల్చుకోవడం కలకలం రేపుతోంది. అయితే కృష్ణచైతన్య ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవడం వెనుక ఆర్థిక సమస్యలే కారణం అని తెలుస్తోంది. బెట్టింగ్ యాప్‌ల వల్ల అతడు పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయాడన్న ఆరోపణలు వినిపిస్తు్న్నాయి.
సంగారెడ్డిలో కానిస్టేబుల్..
ఆన్‍లైన్ గేమ్స్‌కు అలవాటు పడి చేసిన బాకీలు తీర్చలేక ఇటీవలే సంగారెడ్డి జిల్లాలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. 2024 బ్యాచ్‌కు చెందిన సందీప్ కుమార్ సంగారెడ్డి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‍గా పని చేస్తున్నాడు. ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్స్‌కు అలవాటు పడి బంధువులు, స్నేహితుల వద్ద రూ. లక్షల్లో అప్పులు చేశాడు. బాకీ తీర్చమని వారి నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో భరించలేక నవంబర్ 3వ తేదీన సంగారెడ్డిలోని మహబూబ్‌సాగర్ చెరువు కట్టపై రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
బెట్టింగ్ వ్యసనంతో ఎస్ఐ!..
హైదరాబాద్ అంబర్‌పేట ఎస్ఐ భానుప్రకాశ్ తీరు డిపార్ట్‌మెంట్‌లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్స్‌కు అలవాటు పడిన ఎస్ఐ భారీగా అప్పులు చేసుకున్నారని, వాటిని తీర్చేందుకు ఏకంగా రికవరీలో వచ్చిన బంగారంతో పాటు సర్వీస్ రివాల్వర్‌ను తాకట్టు పెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. భానుప్రకాశ్‌కు డిపార్ట్‌మెంట్ ఇచ్చిన గన్ ప్రస్తుతం అదృశ్యం కాగా మిస్సింగ్ కేసులో ఉన్నతాధికారులు సెర్చింగ్ చేస్తున్నారు. సరదాగా బెట్టింగ్స్ మొదలు పెట్టిన ఆయన క్రమక్రమంగా లక్షల వరకు చేరి రూ. 80 లక్షల వరకు పోగొట్టుకున్నట్లు చర్చ సాగుతోంది.






