కేవైసీ కంపల్సరా..? కేంద్రం నిర్ణయంతో ‘రేషన్’ లబ్ధిదారుల్లో ఆందోళన!

by Disha Web Desk 2 |
కేవైసీ కంపల్సరా..? కేంద్రం నిర్ణయంతో ‘రేషన్’ లబ్ధిదారుల్లో ఆందోళన!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆహార భద్రత కార్డులు కలిగిన లబ్ధిదారులంతా ఈ-కేవైసీ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో జనాలు రేషన్ దుకాణాలకు క్యూ కడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఇప్పటికే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ అన్ని జిల్లాల అధికారులు, తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. కేవలం రేషన్ డీలర్ల వద్దే అప్‌డేట్ చేసుకోవాలని చెప్పారు. దీంతో లబ్ధిదారులు రేషన్ షాపుల వద్ద తమ కుటుంబ సభ్యులతో గంటల తరబడి బారులు తీరుతున్నారు. ఈ కేవైసీ పూర్తి కాకుంటే కార్డు రద్దు అవుతుందని.. ఈ నెల చివరితో దీనికి గడువు ముగుస్తుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో నానా తంటాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

డీలర్లలోనూ కొరవడిన స్పష్టత

పారదర్శకత, బోగస్ లబ్ధిదారుల ఏరివేత పేరుతో జరుగుతున్న కేవైసీ ప్రక్రియపై తమకు సైతం స్పష్టమైన మార్గదర్శకాలు లేవని డీలర్లు చెబుతున్నారు. అధికారుల ఆదేశాలతో కేవైసీ ప్రక్రియను మొదలు పెట్టిన డీలర్లు.. ఈ ప్రక్రియకు చివరి గడువు ఎప్పుడు అనేది తెలియకుండా ఉంది. దీంతోపాటు ఆధార్ కార్డు వేలిముద్రలు సరిపోకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? విద్యా, ఉపాధి నిమిత్తం దూరప్రాంతాలకు వెళ్లిన వారి పరిస్థితి ఏంటి? అనే దానిపైనా ఇటు అధికారులు, అటు రేషన్ డీలర్లు కానీ ఎవరూ సమాధానాలు ఇవ్వడం లేదు. మరోవైపు.. కేవైసీ ప్రక్రియ ఉచితమే అని ప్రభుత్వం చెబుతున్నా లబ్ధిదారులకు మాత్రం ఇది ఆర్థిక భారంగా మారింది. వృద్ధులను రేషన్ షాపులకు తరలించడం సమస్యగా మారింది. దీనికితోడు ఆధార్‌ కార్డులు పాతవి కావడంతో కొందరి వేలిముద్రలు సరిపోవడం లేదు. చాలా మంది స్టూడెంట్స్ ప్రభుత్వ హాస్టల్స్‌లో ఉంటున్నారు. వారంతా తిరిగి గ్రామాలకు రావాల్సి ఉంది. దీంతో అంతిమంగా ఏదో రూపంలో చేతి చమురు వదులుకోవాల్సి వస్తోంది.

తెలంగాణ లేఖకు కేంద్రం నో రెస్పాన్స్

కేవైసీ నిబంధనతో తెలంగాణ ప్రజలు నష్టపోతారని మంత్రి గంగుల కమలాకర్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో గల్ఫ్, ఇతర దేశాలతోపాటు దేశంలోని బొంబయి, భీవండి తదితర ప్రాంతాలకు ఉపాధి నిమిత్తం వెళ్లారని.. అందువల్ల కేవైసీపై పునఃసమీక్ష చేయాలని కోరారు. గంగుల రాసిన లేఖపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు సమాధానం ఇవ్వలేదు. దీంతో ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వ్యవహారం కొత్త తలనొప్పిగా మారింది.


Next Story