ధర్మరక్షణ, దేశ భద్రత మోదీతోనే సాధ్యం : అరవింద్

by Disha Web Desk 23 |
ధర్మరక్షణ, దేశ భద్రత మోదీతోనే సాధ్యం :  అరవింద్
X

దిశ,నిజామాబాద్ సిటీ : దేశంలో ధర్మం సుభిక్షంగా ఉండాలన్న, అదేవిధంగా దేశంలోని పౌరులకు సంపూర్ణమైన భద్రత కావాలన్నా అది కేవలం మోడీ పాలన తోనే సాధ్యమని ఎంపీ అరవింద్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన యువ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. బిజెపి అధికారంలోకి వస్తే తక్షణమే దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే తొలిసారి ఓటు హక్కు వచ్చిన యువత తాము ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసేముందు ఒక్కసారి జైశ్రీరామ్ అంటూ అయోధ్య శ్రీరాముని గుర్తుచేసుకుంటూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ దేశంలో మత కలహాలు అల్లర్లు టెర్రరిస్టుల దాడులు ఇలాంటివే దేశంలో జరిగేవని కానీ ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక దేశంలో ఎక్కడ కూడా కలర్లు జరిగిన దాఖలాలు లేవని గతంలో కాంగ్రెస్ పాలనలో భారతదేశంలో ఉగ్రవాదుల దాడులు ఇతర విపత్తులు ఎలాంటివైనా జరిగితే అగ్రరాజ్యమైన అమెరికా వైపు చూస్తూ సాయం చేయండి అంటూ కాంగ్రెస్ నాయకులు ఇతర దేశ ప్రధానులను రాజులను ప్రాధేయ పడ్డారని, కానీ ప్రధానమంత్రిగా మోడీ అధికారం చేపట్టాక మన దేశం వైపే అమెరికా లాంటి అగ్రదేశాలు సాయం చేయండి అంటూ మనల్ని అడగవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆయన యువతకు గుర్తు చేశారు.

మరోసారి దేశంలో ప్రధానమంత్రిగా మోదీ దేశంలో అధికారంలోకి వస్తే యువత అభివృద్ధి కోసం స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారని వివరించారు. దేశంలో కాంగ్రెస్ పాలనలో మూడు వందల స్టార్టప్లు ఉంటే.. బీజేపీ పాలనలో వీటి సంఖ్య లక్షకు పైగా ఉందన్నారు. దేశం గ్లోబల్ ర్యాంకింగ్ లో మూడో స్థానంలో నిలిచిందని తెలిపారు. యువత స్టార్టప్ లు స్థాపించి తాము ఎదగడం తో పాటు మరికొంత మందికి ఉపాధి కల్పించాలని సూచించారు. అనంతరం యువత ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ఎంపీ అరవింద్ తో సెల్ఫీ దిగడానికి యువతులు పోటీపడ్డారు. ఈ సమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే దంపాల్ సూర్యనారాయణ గుప్తా, ఐపీఎఫ్ ప్రతినిధి జితేందర్ వైద్య, బిజెపి సీనియర్ నాయకులు పల్లె గంగారెడ్డి, బీజేవైఎం నాయకులు రాజశేఖర్ రెడ్డి, రణదీష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story