Runa Mafi: బ్యాంకర్ల నిర్లక్ష్యం.. తీవ్రంగా నష్టపోతున్న లబ్ధిదారులు

by Gantepaka Srikanth |

చేనేత రుణ మాఫీలో బ్యాంకర్ల నిర్వాకం కారణంగా లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. బ్యాంకర్ల నిర్లక్ష్యంతో నేతన్నలకు రుణమాఫీ వర్తించకుండాపోయే పరిస్థితి ఏర్పడింది.

Runa Mafi: బ్యాంకర్ల నిర్లక్ష్యం.. తీవ్రంగా నష్టపోతున్న లబ్ధిదారులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: చేనేత రుణ మాఫీలో బ్యాంకర్ల నిర్వాకం కారణంగా లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. బ్యాంకర్ల నిర్లక్ష్యంతో నేతన్నలకు రుణమాఫీ వర్తించకుండాపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ నిర్ణయంతో చేనేత రుణమాఫీ ద్వారా 5,691 మంది లబ్ధి పొందనున్నారు. ఇందుకోసం రూ.33 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీని కోసం అర్హులైన చేనేత కార్మికుల వివరాలను అందించాలని చేనేత జౌళి శాఖ బ్యాంకర్లను ఆదేశించింది. చేనేత కార్మికుల అకౌంట్లను పరిశీలించి వారి వివరాలను అందించడానికి పూనుకున్న బ్యాంకర్ల నుంచి లబ్ధిదారులకు అనేక చిక్కులు ఎదురవుతున్నాయి. తమ బ్యాంకులో చేనేత కార్మికులు రుణాలు తీసుకున్నారు, వారి పేర్లు, రుణ మొత్తం ఉంది కానీ, రుణం తీసుకున్న మొత్తానికి సంబంధించిన డాక్యుమెంట్లు లేవని గుర్తించారు. ఈ సమస్య పలు జిల్లాల్లోని బ్యాంకుల్లో ఉందని గుర్తించారు.

డాక్యుమెంట్స్ వెతకండి..

బ్యాంకర్లు పత్రాలు లేవని చెప్పడంతో లబ్ధిదారులు లబోదిబోమంటూ ప్రభుత్వ అధికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. డాక్యుమెంట్లు లేకుంటే రుణ మాఫీ జరగదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. రుణం తీసుకున్న పత్రాలు లేకుండా లోన్ ఎలా ఇచ్చారంటూ అధికారులు బ్యాంకర్లను ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి బ్యాంకరు చేనేత రుణమాఫీకి సంబంధించి డాక్యుమెంట్స్‌ను వెతకాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. చేనేత కార్మికులు ఒక్కరు కూడా నష్టపోవడానికి వీల్లేదని, బ్యాంకర్లు నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం రుణమాఫీ చేయకుంటే బ్యాంకర్లు రుణాల వసూళ్లలో భాగంగా డాక్యుమెంట్స్ లేకుంటే ఇదే విధంగా వ్యవహరించే వారా? అని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.

Next Story