Beerla Ailaiah: ఇప్పుడు టీఆర్ఎస్ అని పెట్టుకున్నా ఉపయోగం లేదు..

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-13 14:43:24  IST  )

కేటీఆర్ ఎన్ని పాద‌యాత్రలు చేసినా చేసిన పాపాలు పోవని, ఆయ‌నకు కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు త‌ప్ప ఏమీ మిగ‌ల‌దని, పాద‌యాత్ర కాదు గంగ‌లో మునిగి గోదావ‌రిలో తేలినా ఉప‌యోగం లేదని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఎద్దేవా చేశారు.

Beerla Ailaiah: ఇప్పుడు టీఆర్ఎస్ అని పెట్టుకున్నా ఉపయోగం లేదు..
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేటీఆర్ ఎన్ని పాద‌యాత్రలు చేసినా చేసిన పాపాలు పోవని, ఆయ‌నకు కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు త‌ప్ప ఏమీ మిగ‌ల‌దని, పాద‌యాత్ర కాదు గంగ‌లో మునిగి గోదావ‌రిలో తేలినా ఉప‌యోగం లేదని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ ఎందుకు పాదయాత్ర చేస్తారు? ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు లాంటివి ఇచ్చి పేదలను ఆదుకుంటున్నందుకా? అని బీర్ల ఐలయ్య ప్రశ్నించారు. క‌ల్వకుంట్ల కుటుంబ న‌క్కజిత్తులు తెలంగాణ ప్రజ‌ల‌కు తెలుసని, అధికారం పోయిన తర్వాత జ్ఞానోదయం అయిన‌ట్లుగా కేటీఆర్ న‌టిస్తున్నారని, కొన్ని త‌ప్పులు చేశామ‌ని స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆయన మండిపడ్డారు. అన్ని త‌ప్పులే చేసి రాష్ట్రాన్ని త‌ప్పుదోవ ప‌ట్టించారని, మీరు చేసిన అప్పులు, త‌ప్పుల వ‌ల్ల రాష్ట్రం అప్పుల కుప్ప అయిందని బీర్ల ఐలయ్య విమర్శించారు.

మీరు చేసిన త‌ప్పుల‌కు మీరు, మీ అయ్య అమ‌ర‌వీరుల స్థూపం ద‌గ్గర ముక్కు నేల‌కు రాసినా తెలంగాణ ప్రజలు క్షమించ‌రని ఆయన ధ్వజమెత్తారు. పార్టీ పేరు మార్చినందుకు జ‌నం మిమ్మల్ని ఓడించలేదని, మీ అవినీతి, అహంకారం వ‌ల్ల ఓడిపోయారని, మ‌ళ్లీ టీఆర్ఎస్ అని పెట్టుకున్నా జ‌నం మిమ్మల్ని న‌మ్మరని బీర్ల ఐలయ్య అన్నారు. కవిత టీఆర్ఎస్ పేరుతో పార్టీ పెడుతుందని భయపడి మీ పార్టీ పేరు మార్చుకోవాలని చూస్తున్నారా? పార్టీ పేరు మారిస్తే మోసం పోవ‌డానికి తెలంగాణ ప్రజ‌లు అమాయ‌కులు కాదని, మీరు మేక‌వ‌న్నె పులులు అని తెలంగాణ ప్రజ‌ల‌కు బాగా తెలుసని బీర్ల ఐలయ్య విమర్శలు గుప్పించారు.

Next Story