- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో రెండేళ్లు ఓపిక పట్టండి.. మూసీ బాధితులకు కేటీఆర్ భరోసా
మూసీ దండి మార్చ్‌లో పాల్గొన్న కేటీఆర్, బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. ఇండ్లను కూలగొట్టడం భూములను అమ్మడం, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేయడం ఇదే రేవంత్ రెడ్డి పరిపాలన అని విమర్శించారు. మూసి పేరిట తాను చేస్తున్న స్కామ్ కోసం వేలాదిమంది ఇండ్లను రేవంత్ కూలకొడుతున్నారని మూసి బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ఈరోజు హైదరాబాద్‌లో మూసీ బాధితుల కోసం నిర్వహించిన ‘మూసీ దండి మార్చ్’ ( Musi Dandi March) పాదయాత్రలో కేటీఆర్ పాల్గొన్నారు. మూడున్నర కిలోమీటర్ల పాటు అనేకమంది బాధితులను కలుస్తూ ముందుకు సాగారు.
రెండేళ్లు ఓపిక పట్టండి:
ఆ తర్వాత మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ దగ్గర జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఒక్క రెండు సంవత్సరాల పాటు మూసీ బాధితులు తమ భూములను, అపార్ట్‌మెంట్లను కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలని, ఈ పోరాటంలో భారత రాష్ట్ర సమితి వారికి అండగా ఉంటుందని, తిరిగి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసీ కోసం ఎవరి భూములు, ఇళ్లు పోకుండా చూస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. అపార్ట్‌మెంట్ వాసులు, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఎన్ని రకాలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా వేడుకున్నా చివరికి పసిపాపల పట్ల కనికరం చూపాలని కోరినా.. కర్కశంగా ఇళ్లను ఖాళీ చేయిస్తూ బెదిరింపులకు దిగుతూ విధ్వంసానికి పాల్పడుతున్నదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఇప్పటికే అద్భుతమైన ప్రగతి భవన్ సిద్ధంగా ఉన్నా దాన్ని కాదని చెప్పి 200 కోట్ల రూపాయలతో తనకంటూ ఒక నివాసం నిర్మించుకుంటున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ నాయకులను చెప్పుతో కొట్టాలా?
అధికారంలోకి రాగానే హైడ్రా పేరుతో వందల మంది ఇళ్లు కూలగొట్టిన రేవంత్ రెడ్డి.. అటు రామగుండం, మహబూబ్ నగర్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ ఇబ్బంది కలిగేలా వారి జీవితాలను చిన్నాభిన్నం చేసేలా ఇళ్లు కూలగొడుతున్నారన్నాన్నారు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం తన అనుచరులకు, అన్నదమ్ములకు, కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు ఇవ్వడం కోసం మూసీ పేరుతో భారీ స్కామ్ కు తెరలేపారని, ఇందుకోసం పేదల ఇళ్లను పణంగా పెడుతున్నారన్నారని ఆరోపించారు. గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేవలం 16 వేల కోట్ల రూపాయలతోనే మూసీ సుందరీకరణ కార్యక్రమాన్ని ఒక్క ఇల్లు కూడా పోకుండా డీపీఆర్ (DPR) ని కూడా సిద్ధం చేశామన్నారు. ఈరోజు మూసీ బఫర్ జోన్‍కి సంబంధించి రకరకాల మాటలు చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోజు అధికారంలో ఉన్నప్పుడు ఇదే అపార్ట్‌మెంట్లకు పర్మిషన్ ఇచ్చిందన్నారు. మరి అలాంటి అధికారులపై ఆనాడు అనుమతులు ఇచ్చిన కాంగ్రెస్ నాయకులను చెప్పుతో కొట్టాలా అని కేటీఆర్ ప్రశ్నించారు.
బెదిరింపులకు దిగడం మానండి:
మూసీలో ఇళ్లు ఉన్నాయని అబద్ధాలు చెప్తూ పేదల ఇళ్లను ధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తన సొంత మంత్రులు, తమ పార్టీ ప్రజా ప్రతినిధులకు ఉన్న ఫార్మ్‌హౌస్‌లు, విల్లాలను, ఇళ్లను ఎందుకు ముట్టుకోవడం లేదన్నారు. రాష్ట్రాన్ని ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ నడుపుతున్నాడని, అందుకే ఇన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయన్నారు. రేవంత్ రెడ్డి లాంటి భూ బకాసురుడి నుంచి, ఈ బ్రోకర్ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదని కేటీఆర్ పిలుపునిచ్చారు. మూసీ బాధితుల కోసం భారత రాష్ట్ర సమితి అన్ని రకాలుగా అండగా ఉంటుందని కేటీఆర్ తెలిపారు. వీరికి సంబంధించిన న్యాయ పోరాటంలోనూ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్టు కోసం వేలమంది ఇళ్లను కూల్చడం ఆపేయాలని, మరోవైపు తమ ఎమ్మెల్యేలను, నాయకులను పంపి బెదిరింపులకు దిగడం మానేయాలని కేటీఆర్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న బెదిరింపులకు, ఇండ్లకు బదులు డబ్బులు ఇస్తామని మోసం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు లొంగకుండా ఐక్యంగా ముందుకు సాగాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.






