- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వానకాలం.. ప్రజారోగ్యాలపై అప్రమత్తం..!
ప్రస్తుతం వానకాలం దృష్ట్యా ప్రజల ఆరోగ్యం పట్ల అప్రమత్తం కావాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. ముఖ్యంగా వానకాలంలో అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుతం వానకాలం దృష్ట్యా ప్రజల ఆరోగ్యం పట్ల అప్రమత్తం కావాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. ముఖ్యంగా వానకాలంలో అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈమేరకు శుక్రవారం పంచాయతీ రాజ్ శాఖ పలు సూచనలు జారీ చేసింది. దోమల వల్ల వచ్చే మలేరియా, డెంగ్యు, చికెన్ గున్యా, తాగునీటి ద్వారా సంక్రమించు వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు గ్రామ పంచాయతీలు చర్యలు చేపట్టాలని సూచించింది.
పారిశుద్ధ్య లోపం, కలుషిత నీరుతోనే..
పారిశుద్ధ్య లోపం, కలుషిత నీరు వల్ల వివిధ రకాల అంటు వ్యాధులైన అతిసార, కలరా, టఫాయిడ్, ఈగలు, దోమల ద్వారా మలేరియా, మెదడు వాపు, డెంగ్యు, చికెన్ గున్యా, స్వైన్ ఫ్ల్యూ మొదలగు వ్యాధులు ప్రబలే అవకాశము ఉందని పేర్కొన్నది. ఇందుకోసం గ్రామాలలో పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యము, రక్షిత, మంచినీటి సరఫరా చేయుట గ్రామ పంచాయతీల కనీస బాధ్యతగా చేపట్టాలని కోరింది. చికెన్ గున్యా, డెంగ్యు జబ్బులు దోమలు(ఏడిస్ ఈజిప్ట్ రకము) కుట్టుట వల్ల వచ్చే జబ్బుల నివారించుటకు దోమల వృద్ధిని అరికట్టడమే సరైన మార్గమని, ఇందు కోసం తగు సూచనలు పాటించాలని కోరింది.
ముఖ్యంగా చేపట్టాల్సినవి..
గ్రామాల్లో మురికి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించి మురికి నీరు నిలువ ఉండకుండా, దోమలు వృద్ధి చెందకుండా చర్యలు తీసుకోవాలి. గృహ పరిసర ప్రాంతములు, రోడ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించి చెత్త చెదారాన్ని విలేజ్ డంపింగ్ యార్డుకు తరలించాలి. మురికి కాలువల్లో క్రమం తప్పకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లించాలి. మంచి నీటి పైపుల లికేజిని అరికట్టాలి. నీటిని బాగా కాచి చల్లార్చి తాగాల్సిందిగా ప్రజలందరికి దండోరా, అవగాహన ద్వారా తెలియజేయాలి. హోటళ్ళు, మాంసం మార్కెట్లు, చిరుతిళ్ల బండ్లు, దుకాణాలలో నిల్వ ఉంచే వస్తువులపై నిఘా పెట్టాలి. వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటే అలాంటి అమ్మకాలను నిషేదించాలి.
పంచాయతీ సెక్రటరీ మాడ్యుల్ నమోదుతో..
జిల్లా పంచాయతి అధికారులు, డివిజనల్ పంచాయతి అధికారులు, సంబంధిత మండల పంచాయతీ అధికారులు ప్రతిరోజూ పారిశుద్ధ్య పనులను పంచాయతీ సెక్రటరీ ఫర్మామెన్స్ మాడ్యుల్ నమోదులో నమోదు చేసిన వివరాలను పర్యవేక్షించాలి. తాగునీటి వనరులు, ట్యాంకులను క్లోరినేషన్ చేయాలి. మెడికల్ డిపార్ట్ మెంట్ సహకారంతో వ్యాధుల నివారణ చర్యలు చేపట్టాలి. గ్రామాలన్నింటికీ ఆరోగ్య శాఖ సహకారంతో ఓఆర్ఎస్ ద్రావణ ప్యాకెట్లు అందేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్‌శాఖ అధికార యంత్రాంగాన్ని కోరింది.






