‘బీసీ’ ఆర్డినెన్స్.. ఓవర్ టూ ఢిల్లీ! అటార్నీ జనరల్‌కు పంపిన గవర్నర్

by Kema Shiva Kumar |

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉన్నది.

‘బీసీ’ ఆర్డినెన్స్.. ఓవర్ టూ ఢిల్లీ! అటార్నీ జనరల్‌కు పంపిన గవర్నర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉన్నది. ఇందులో భాగంగా పంచాయతీరాజ్ చట్టం - 2018కు సవరణల కోసం ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని ఈనెల 11న జరిగిన మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నది. అందుకు సంబంధించిన ఫైల్‌ను ఈనెల 15న గవర్నర్ ఆమోదానికి పంపింది. ఇంతకాలం ఫైల్‌ను పరిశీలించిన ఆయన.. తాజాగా న్యాయసలహా కోసం దానిని ఢిల్లీలోని అటార్నీ జనరల్‌కు పంపినట్టు సమాచారం. అక్కడి నుంచి వచ్చే న్యాయ సలహా ప్రకారం ఆర్డినెన్స్‌పై నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ భావిస్తున్నట్టు తెలిసింది.

అటార్నీ జనరల్ నిర్ణయం‌పై ఉత్కంఠ

కులగణన ప్రకారం బీసీ కులాలకు స్థానిక సంస్థల్లో, విద్యా, ఉపాధి రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకు సంబంధించిన రెండు బిల్లులను బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ ఆమోదించింది. వాటిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో పెట్టాలని కేంద్రాన్ని కోరింది. దీంతో ఆ రెండు బిల్లులను గవర్నర్ జిష్ణదేవ్ వర్మ.. రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. కానీ ఇంతవరకు వాటిని రాష్ట్రపతి ఆమోదించలేదు, తిరస్కరించలేదు. మరోవైపు రాష్ట్రానికి చెందిన పంచాయతీ రాజ్ చట్టం– 2018ను సవరించి, లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం భావించింది. అందుకోసం ఆర్డినెన్స్‌ను రూపొందించి ఆమోదం కోసం గవర్నర్‌కు పంపింది. ఇప్పటికే అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న సమయంలో, ఆర్డినెన్స్‌‌ను ఆమోదించొచ్చా? లేదా? అనే అంశంపై అటార్నీ జనరల్ ఎలాంటి న్యాయ సలహా ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొన్నది.

తిరస్కరిస్తే బీజేపీకి ఇరకాటం?

పంచాయతీ రాజ్ చట్టం–2018ను సవరిస్తే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్రానికి లభిస్తుంది. కానీ, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉందొద్దు. అటార్నీ జనరల్ సుప్రీం కోర్టు తీర్పును దృష్టిలో పెట్టుకుని ఆర్డినెన్స్‌పై సంతకం చేయొద్దని గవర్నర్‌కు సూచిస్తే, రాజకీయంగా బీజేపీకి ఇబ్బందులు వస్తాయని చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తున్నది. ఎందుకంటే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేకనే బీజేపీ, అటార్నీ జనరల్ ద్వారా అడ్డుపడిందని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసే అవకాశం ఉంది. ఇదే ప్రధాన ఎజెండాగా లోకల్ బాడీ ఎన్నికలు జరగొచ్చని టాక్.

Next Story