నమ్మించి మోసం చేస్తే.. రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది : బీసీ జేఏసీ

by Naga Rani Yarlagadda |

ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 42 శాతం బీసీల రిజర్వేషన్లు అమలు చేశాకనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు.

నమ్మించి మోసం చేస్తే.. రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది : బీసీ జేఏసీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 42 శాతం బీసీల రిజర్వేషన్లు అమలు చేశాకనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం బషీర్ బాగ్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వరకూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ నేతలు మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే అఖిలపక్షంతో కలిసి ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో చర్చించాలని డిమాండ్ చేశారు. బీసీలను నమ్మించి మోసం చేస్తే.. రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని వార్నింగ్ ఇచ్చారు.

డిసెంబర్ 1వ తేదీ నుంచి జరిగే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ సర్కార్ బీసీ రిజర్వేషన్లపై రాజకీయ కార్యాచరణ ప్రకటించాలన్నారు. రేపు జరిగే కేబినెట్ సమావేశంలో అఖిలపక్షంతో కలిసి ఢిల్లీకి వెళ్లే తేదీని ప్రకటించాలని కోరారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ బీసీ వాదంతో గెలిచిందన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. బీసీల రిజర్వేషన్ విషయంలో బీజేపీ వ్యతిరేకంగా ఉన్నందుకే ఓడిపోయిందని, రాష్ట్రంలో బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపాలని, లేని పక్షంలో డిసెంబర్ మొదటి వారంలోపార్లమెంట్ ను ముట్టడిస్తామని తెలిపారు. బీసీ జేఏసీ రన్ లో జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ హనుమంతరావు, మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Next Story