ఆ దమ్ముంటేనే మాతో రండి.. బీసీ జేఏసీకి చిరంజీవులు సూటి ప్రశ్నలు

by Prasad Jukanti |   (  Updated:2025-10-13 13:17:35  IST  )

బీసీ జేఏసీపై బీసీ మేధావుల సంఘం అధ్యక్షుడు చిరంజీవులు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆ దమ్ముంటేనే మాతో రండి.. బీసీ జేఏసీకి చిరంజీవులు సూటి ప్రశ్నలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయం అంతా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల (BC reservations) అంశం చుట్టూ తిరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 9 పై హైకోర్టు స్టే విధించడంతో బీసీ కుల సంఘాలు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో నిన్న రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో బీసీ జేఏసీ (BC JAC) ఏర్పాటైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బీసీ జేఏసీపై బీసీ మేధావుల సంఘం చైర్మన్, మాజీ ఐఏఎస్ చిరంజీవులు (Chiranjeevulu) సూటి ప్రశ్నలు వేశారు. ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‍లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన చిరంజీవులు.. నిన్న ఏర్పాటైన బీసీ జేఏసీలో ఉన్నవారు రాజకీయ పార్టీల్లో ఉన్నారని, వారంతా ఈ బీసీ ఉద్యమం కోసం తమ రాజకీయ పార్టీలను విమర్శిస్తారా? అని ప్రశ్నించారు. తాను ఒక వ్యక్తి గురించి ఈ మాటలు మాట్లాడటం లేదన్నారు. బీసీ జేఏసీ మమ్మల్ని కూడా ఆహ్వానించారు. కానీ మాది మొదటి నుంచి 9 షెడ్యూల్ ఉద్యమం అయితే వారిది జీవో కోసం ఉద్యమం అన్నారు. జీవోల గురించి మేము ఎన్నడూ మాట్లాడలేదని దాన్ని మేము అడగలేదన్నారు. ఇప్పటికైనా వారు 9 షెడ్యూల్ గురించి అడుగుతున్నారు. ఇది మంచి పరిణామం అని చెప్పారు.

మీ పద్దతి మీది మా పద్దతి మాది:

మాకు రాజకీయాలతో సంబంధం లేదని మీ పద్దతుల్లో మీరు మా పద్ధతుల్లో మేము బీసీ పోరాటం చేద్ధామన్నారు. ఎవరైనా రాజకీయ నాయకులు మా ఉద్యమంలోకి రావాలంటే వారు మా నాయకత్వంలోనే పని చేయాలి తప్ప మీకు నాయకత్వం ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. మేము రాజకీయ పార్టీలను తప్పకుండా విమర్శిస్తామని మా విమర్శలను తట్టుకునే ధైర్యం ఉంటే మా ఉద్యమం వైపు రావాలని లేదంటే రావొద్దన్నారు. మేము మీకు పోటీ కాదని జేఏసీగా మీరు మీ పని చేసుకోండి మా సిద్ధాంతాల మేరకు మేము పని చేసుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. బీసీల సమస్యలు వచ్చినప్పుడు అందరం కలిసి పనిచేద్దామన్నారు. రాజకీయ నాయకులు అసెంబ్లీలో ఒక మాట బయట మరో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

త్వరలో మరో జేఏసీ:

అంతర్గతంగా తామంతా చర్చించుకున్నామని 42 శాతం రిజర్వేషన్ సాధన సమితి పేరుతో జాయింట్ యాక్షన్ కమిటీ తరహాలో మరో సంస్థను ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. మాతో కలిసి పని చేయాలనుకునే వారందరికీ ఇందులోకి ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ నెల 24వ తేదీన ఇందిరా పార్క్ వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించాలని భావిస్తున్నామన్నారు. ఆ తర్వాత జిల్లాల పర్యటన చేయబోతున్నామన్నారు.

Next Story