బీసీల డిమాండ్ vs కోర్టు ఆర్డర్.. ‘స్థానికం’పై ఉత్కంఠ

by Naga Rani Yarlagadda |

స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. పాలకవర్గాల పదవీకాలం ముగిసి 20 నెలలు..

బీసీల డిమాండ్ vs కోర్టు ఆర్డర్.. ‘స్థానికం’పై ఉత్కంఠ
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. పాలకవర్గాల పదవీకాలం ముగిసి 20 నెలలు అవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం రాజకీయపార్టీల నేతలు, అధికారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల పీటముడితో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమవుతూ వస్తున్నాయి. ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రయత్నం చేసినా రాజకీయ నిర్ణయాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆమోదించడం లేదు. దీంతో బీసీల రిజర్వేషన్ల అమలు ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దీంతో 50శాతం రిజర్వేషన్లను ప్రభుత్వ పరంగా అమలుచేసి, కాంగ్రెస్​పార్టీ పరంగా 42శాతం సీట్లు బీసీలకు ఇవ్వాలని నిర్ఱయానికి వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే హైకోర్టు 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయొద్దని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లినా హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. దీంతో ప్రభుత్వానికి 50శాతం రిజర్వేషన్లు అమలు చేయడం మినహా మరే మార్గం లేకుండా అయింది. ఎన్నికల నిర్వహణపై ఏం చేయబోతున్నారనే దానిపై హైకోర్టులో ఈనెల 24న కేసు విచారణ జరగనుంది. అప్పటి కల్లా రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని కచ్చితంగా చెప్పాల్సి ఉంది. దీంతో కేబినెట్​ఏం నిర్ణయించబోతున్నదనేది ఆసక్తికరంగా మారింది.

జూబ్లీహిల్స్ జోష్ లోనే ఎన్నికలు

జూబ్లీహిల్స్​ఉప ఎన్నికలో గెలిచిన జోష్​లో ఉన్న కాంగ్రెస్​పార్టీ ఇప్పుడే ఎన్నికల నిర్వహించాలని ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే సర్పంచ్​ఎన్నికలు ముందు నిర్వహించి మరికొంత సమయం తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. పాత విధానంలో రిజర్వేషన్లు ఖరారు చేసిన ఎన్నికలు నిర్వహిస్తామని, కోర్టును నెల రోజుల సమయం కోరే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు డిసెంబర్​1 నుంచి 9 వరకు కాంగ్రెస్​ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాలు జరగనున్నాయి. డిసెంబర్​8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్​గ్లోబల్​సమ్మిట్, విజన్​డాక్యుమెంట్​ను ఆవిష్కరించనున్నారు. దీనిని సీఎం రేవంత్​రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. స్థలాన్ని కూడా కేబినెట్​లో ప్రకటించే అవకాశం ఉంది.

డిసెంబర్​9 తర్వాతే ‘స్థానికం’

గ్లోబల్​సమ్మిట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. అంతర్జాతీయ ప్రముఖులు రానున్న నేపథ్యంలో అందుకు తగినట్లు ఏర్పాట్లు చేయనున్నారు. మంత్రులకు బాధ్యతలు అప్పగించనున్నారు. ఒక వేళ స్థానిక సంస్థల ఎన్నికల కోడ్​అమల్లోకి వస్తే విజయోత్సవాలకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని, దీంతో డిసెంబర్​9 తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్​ఇచ్చేలా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. కేబినెట్​లో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు గిగ్​వర్కర్ల బిల్లు, రెండేళ్ల పాలన కార్యక్రమాలు, గ్లోబల్​సమ్మిట్, వేదిక, కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించే అవకాశం ఉంది. వీటన్నంటికీ కేబినెట్​లో చర్చించి ఆమోదించనున్నారని సమాచారం. వీటితో పాటు కవి అందెశ్రీకి స్మృతివనం నిర్మించడం, ఆయన కుమారుడికి డిగ్రీ లెక్చరర్​గా ఉద్యోగం కల్పించడం వంటి విషయాలను కేబినెట్​ఆమోదించే అవకాశం ఉందని తెలిసింది. నీటిపారుదల శాఖకు, జీఏడీ, ఆర్థిక శాఖకు సంబంధించిన పలు అంశాలు చర్చకు రానున్నాయని సమాచారం..

Next Story