కుమ్మెర మల్లన్న జాతరలో చిన్నారి మృతి ఘటనపై స్పందించిన బీసీ కమిషన్

by Ramesh Naini |   (  Updated:2026-02-23 11:24:39  IST  )

జాతరలో చోటుచేసుకున్న రెండు నెలల పసికందు మృతి, బీసీ వర్గాలకు ఆలయ ప్రవేశం నిరాకరించారన్న ఆరోపణల ఘటనపై తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ తీవ్రంగా స్పందించింది.

కుమ్మెర మల్లన్న జాతరలో చిన్నారి మృతి ఘటనపై స్పందించిన బీసీ కమిషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: నాగర్‌ కర్నూల్‌ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో చోటుచేసుకున్న రెండు నెలల పసికందు మృతి, బీసీ వర్గాలకు ఆలయ ప్రవేశం నిరాకరించారన్న ఆరోపణల ఘటనపై తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ తీవ్రంగా స్పందించింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా స్పందించిన కమిషన్.. ఈ అమానవీయ ఘటనపై తక్షణమే పూర్తిస్థాయి విచారణ జరిపి, మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు సోమవారం నాగర్‌ కర్నూల్ జిల్లా కలెక్టర్‌తో పాటు, దేవాదాయ శాఖ (ఎండోమెంట్) కమిషనర్‌ కు బీసీ కమిషన్ నోటీసులు జారీ చేసింది.

అసలేం జరిగిందంటే..?

ఈ నెల 19న (గురువారం) నాగర్‌ కర్నూల్‌ మండలంలోని కుమ్మెర గ్రామంలో మల్లన్న జాతర జరిగింది. ఈ జాతరకు వచ్చిన నిరుపేద రజక కుటుంబానికి చెందిన చిల్కేశ్వరం గణేశ్‌, మౌనిక దంపతులను కులం ఆధారంగా అగ్రకులాలకు చెందిన కొందరు జాతర నిర్వాహకులు ఆలయ ప్రవేశానికి నిరాకరించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

కుల వివక్ష చూపి, తమపై దాడి చేశారు: బాధితులు

ఈ క్రమంలోనే నిర్వాహకులకు, భక్తులకు మధ్య జరిగిన తోపులాటలో గణేష్ తన భార్యను పక్కకు తీసుకెళ్తుండగా, వారి చేతిలోని రెండు నెలల పసికందు కింద పడిపోయింది. కింద పడిన చిన్నారిని జాతర నిర్వాహకులు కాలితో తన్నారని, అందువల్లే తమ బిడ్డకు తీవ్ర గాయాలయ్యాయని బాధిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనితో కుమ్మెర గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుల వివక్ష చూపి, తమపై దాడి చేయడంతో పాటు, నిర్వాహకులు కాలితో తన్నడం వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దోషులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై బీసీ కమిషన్ రంగంలోకి దిగడంతో విచారణ వేగవంతం అయ్యే అవకాశం ఉంది.

Next Story