రిజర్వేషన్లు లేకున్నా బీసీల దూకుడు.. 52.75% గెలుపుతో బీసీ కమిషన్ హర్షం

by Ramesh Naini |

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థుల అత్యధిక సంఖ్యలో గెలుపుపై బీసీ కమిషన్ హర్షం వ్యక్తం చేసింది.

రిజర్వేషన్లు లేకున్నా బీసీల దూకుడు.. 52.75% గెలుపుతో బీసీ కమిషన్ హర్షం
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థుల అత్యధిక సంఖ్యలో గెలుపుపై బీసీ కమిషన్ హర్షం వ్యక్తం చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో బీసీలు అత్యధికంగా గెలుపొందడం పట్ల తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి రంగు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అన్న ప్రకారం 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయకపోయినా, జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులు 52.75% గెలవడం బీసీలలో చైతన్యానికి నిదర్శనం.. అని వారు తెలిపారు.

రాష్ట్రం మొత్తంగా బీసీ అభ్యర్థులు 39.51% గెలిచినా గిరిజన జిల్లాలను మినహాయిస్తే ఇది 45.25%గా తేలుతుందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు వ్యతిరేకించే వారికి ఇకనైనా కనువిప్పు కలగాలన్నారు. 18 జిల్లాలల్లో 45%నికి పైగా, 10 జిల్లాలలో 50%నికి పైగా బీసీ సర్పంచులే కావడం ఆనందదాయకం అన్నారు. ఇకనైనా కోర్టుల సాకులు చూపి ZPTC, MPTCలో బీసీల రిజర్వేషన్లు 42% కంటే తగ్గకుండా చూడాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఈ ఎన్నికల ఫలితాలను కేంద్రం దృష్టికి తెచ్చి, ఒత్తిడిని పెంచి, రాజ్యాంగ 9వ షెడ్యూల్డ్‌లో ఈ అంశం పొందుపరిచే విధంగా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రిష్ణమూర్తి కేసులో 50% దాటవద్దని ఇచ్చిన 5 సభ్యుల ధర్మాసనం తీర్పును సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి, 7 గురు సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటుచేసి పునఃపరిశీలన చేయాలని రివిజన్ పిటిషన్ వేయాలని వెల్లడించారు.

Next Story