- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీకున్న ఇమేజ్ ముందు ఈ పదవులా గొప్పా?.. ఆలోచింపజేస్తున్న ఆర్.కృష్ణయ్యకు ఉద్యమకారుడు రాసిన లేఖ
ఉద్యమంలో మందకృష్ణ మాదిగ నడిచిన దారి మీరు నడుస్తున్న దారి చూసుకోవాలని ఆర్.కృష్ణయ్యకు ఓ ఉద్యమకారుడు లేఖ రాశాడు.

దిశ, డైనమిక్ బ్యూరో:బీసీల హక్కుల కోసం సుదీర్ఘ కాలంగా పోరాటం చేస్తున్న బీసీ జేఏసీ నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్యకు (R.Krishnaiah) ఓ బీసీ ఉద్యమకారుడు రాసిన లేఖ ఇప్పుడు వైరల్‍గా మారింది. బీసీ ఉద్యమానికి ఆర్.కృష్ణయ్య చేసిన సేవలను గుర్తు చేస్తూనే తాను నడుస్తున్న మార్గాన్ని మరోసారి ఆలోచించుకోవాలని పేర్కొన్న ఈ లేఖ సంచలనంగా మారింది. డా.చింతం ప్రవీణ్ కుమార్ (Chintam Praveen Kumar) పేరుతో విడుదలైన ఈ లేఖలో పేర్కొన్న కీలక అంశాలు బీసీ ఉద్యమం తీరుతెన్నులను, రాజకీయ పార్టీల కుట్రలను వివరించారు.
బీసీ బ్రాండ్ మీరే:
కృష్ణన్నా మేము చిన్నప్పటి నుండి మిమ్మల్ని చూస్తున్నాం. ఆర్.కృష్ణన్న అంటే బీసీ, బీసీ అంటే కృష్ణన్నే. బీసీ పదానికి మీకున్న పేగు బంధం అలాంటిది. మిగతావాళ్ళు ఎందరు బీసీ ఉద్యమాలు (BC movement) చేసిన బీసీ అంటే మీరే బ్రాండ్ అని లేఖలో పేర్కొన్నారు. 1980లో మీరు బీసీ హక్కుల కోసం పోరాడిన తీరు యావత్ దేశం చూసింది. 1976-77లో విద్యార్థుల సమస్యలపై మిలిటెంట్ పోరాటం ఆ తర్వాత మీరు రాడికల్ గా చేసిన అసెంబ్లీ ముట్టడి ఒక చరిత్ర. బీసీలను ఏకం చేసి 1986 లో మీ సారధ్యంలో ఏర్పడిన సమ సంగ్రామ పరిషత్ స్థాపన మరో చరిత్ర అని రాసుకొచ్చారు. ఎన్డీఆర్ హయంలో విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు 44 శాతం రిజర్వేషన్ ప్రతిపాదించిన సందర్భంలో నాడు అన్ని విద్యార్థి సంఘాలు రెండు ముక్కలయ్యాయి. కానీ అప్పుడు మీరు తీసుకున్న లీడ్ మిమ్మల్ని బీసీల బాంధవునిగా నిలబెట్టిందని పేర్కొన్నారు.
మీ అడుగులను మీరే ఒకసారి విశ్లేషించుకోండి:
బీసీ ఉద్యమాన్ని లీడ్ చేసిన మీరు ఒక సారి ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగ సమాజాన్ని నడిపించిన మందకృష్ణ మాదిగను గమనించాలని లేఖలో పేర్కొన్నారు. వర్గీకరణ విషయంలో మంద కృష్ణన్న మాదిగ (Mandakrishna Madiga) అంతిమ ఫలితాన్ని ఆ మాదిగ సమూహానికి చూపించి చరిత్రలో నిలిచిపోయారని ఆయన ఏది చేసిన ఏ పార్టీతో స్నేహంగా ఉన్నా అది వర్గీకరణ కోసమే అనేంత మాదిగ సమాజం కీర్తించిందని పేర్కొన్నారు. ఒక సందర్భంలో బీజేపీపై యుద్ధం ప్రకటించిన ఎమ్మార్పీఎస్.. తిరిగి అలాంటి బీజేపీతోనే చెలిమి చేయాల్సి వచ్చింది. ఏది చేసినా అది తమ జాతి ప్రయోజనాల కోసమే అని మాదిగ సమూహం మొత్తం నమ్మి మంద కృష్ణ వెంట నడిచిందని రాశారు. ఈ క్రమంలో మందకృష్ణ మాదిగకు చాలా పార్టీలు పదవుల ఆశ చూపాయి. కానీ పార్టీ పదవులు తాను చెప్పినవారికి వచ్చేలా చేసుకున్నాడే కానీ తానే తీసుకోలేదు. ఈ విషయంలో మీరు వేసిన అడుగులు మీరే ఒకసారి విశ్లేషించుకావాలని లేఖ ద్వారా కృష్ణయ్యను కోరారు.
ఈ ఇమేజ్ ముందు ఈ పదవులా గొప్పా?:
ఎమ్మెల్యే ఎంపీ పదవులు మీకున్న బీసీ ఇమేజీకి చాలా చిన్నవని, మీరు చెబితే మీరు సూచించిన వ్యక్తులకు అన్ని పార్టీలు పిలిచి మరీ టికెట్స్ ఇవ్వవా అని లేఖలో రాశారు. అయినా ఆ పార్టీలు మీకే ఎందుకు పిలిచి పిలిచి ఇస్తున్నారు అన్నా! మిమ్మల్ని చూపెట్టి బీసీ ఉద్యమాన్ని నీరు కార్చడానికి కాదా? ఈ లాజిక్ మీకు తెలియంది కాదు కదా అని ప్రశ్నించారు. గడిచిన కాలం గడిచిపోయింది. ఏండ్ల తరబడి మీలాంటి మాలాంటి వారి తండ్లాట ఇప్పుడు బీసీ ఉద్యమం ఒక చైతన్య దశకు వచ్చిందన్నారు. మీరు చూడని రాజకీయాలు లేవు..మీకు తెలియని వ్యూహాలు లేవన్నారు. మీకు కర్తవ్య బోధ చేసేంత పెద్దలు ఎవరూ ఇక్కడ లేరని మరోసారి నవ సమ సంగ్రామ పరిషత్ చరిత్రను లిఖించండి అన్నా అంటూ రాశారు.
పదవులు విసిరికొట్టండి:
ఉన్నది ఒకే ఒక్క జీవితం అందులో చరిత్రను రాసుకునే అవకాశం అందరికీ రాదు. లేవండి అన్నా..పార్టీలను పదవులను విసిరి అవతల కొట్టాలని రాశారు. రెండు కోట్ల బీసీ ప్రజలే మీ బలం. మీరు ఒక్కసారి కన్నెర్ర జేసి కదలండి.. మీ ఇళ్లే బీసీ చౌరస్తా అవుతుంది. గాంధీ భవన్, సంఘ్ భవన్, గులాబీ భవన్‍లు మీ ఇంటి ముందు వాలిపోతాయ్ అని పేర్కొన్నారు. కొంతమందికి బీసీ ఉద్యమం అంటే ఉబుసుపోని ఊసుపోని ముచ్చట అని, ఇంకొందరికి రిటైర్ మెంట్ బెనిఫిట్ తర్వాత దొరికిన కాలక్షేప కార్యక్రమం. కానీ కృష్ణన్నా మీకు అలా కాదు. మీ యవ్వనం మీ జీవితం మీ సిద్ధాంతం అనుక్షణం బీసీయే అని రాసుకొచ్చారు. పార్టీలు కేవలం మీకు అంటిన మరకలని అవి మీరు అనుకుంటే క్షణాల్లో పోతాయని రాశారు. సాధించే అవకాశాలు అందరికీ రావని కానీ మీకు ఇప్పటికీ ఆ అవకాశం ఉందని అందువల్ల పార్టీ పదవి గడ్డిపోచ అని ఒక్క నిమిషం మీరు అనుకుంటే మీరే బీపీ మండల్-2 అవుతారని ఆలోచించండి అన్నా అంటూ లేఖ రాశారు.






