మొదలైన ఎంగిలి పూల బతుకమ్మ సందడి.. నేటి నుంచి సంబరాలు.. జాగృతి అధ్యక్షురాలు కవిత విషెస్

by Ramesh Naini |

మహాలయ అమావాస్య సందర్భంగా ఈ రోజు సాయంత్రం ‘ఎంగిలి పూల బతుకమ్మ’తో వేడుకలు ప్రారంభం అవుతాయి.

మొదలైన ఎంగిలి పూల బతుకమ్మ సందడి.. నేటి నుంచి సంబరాలు.. జాగృతి అధ్యక్షురాలు కవిత విషెస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో (Bathukamma festival) బతుకమ్మ సంబరాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. మహాలయ అమావాస్య సందర్భంగా ఈ రోజు సాయంత్రం ‘ఎంగిలి పూల బతుకమ్మ’తో వేడుకలు ప్రారంభం అవుతాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇవాళ బతుకమ్మ సంబరాల ప్రారంభ వేడుకలు వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి వద్ద ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈ వేడుకల్లో రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క, తదితరులు పాల్గొననున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు బతుకమ్మ పండుగ సంబరాలు జరుగుతాయి. గిన్నిస్ బుక్ రికార్డులో చేరే విధంగా సంబరాలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోంది.

ఇక ఇవాళ ఎంగిలి పూల బతుకమ్మ సందడి మొదలైంది. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించేందుకు మహిళలు సిద్దమయ్యారు. సాయంత్రం సాంప్రదాయ పాటలతో ఊరూరా బతుకమ్మకు స్వాగతం పలుకుతూ వేడుకలు జరిపేందుకు సిద్దమయ్యారు. ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా ప్రముఖులు, రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత (Telangana Jagruti President Kavitha) ఎక్స్ వేదికగా విషెస్ తెలియజేశారు. ‘తెలంగాణ ఆత్మగౌరవ పతాక.. సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక మన బతుకమ్మ పండుగ. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఇంటిల్లిపాదీ సంబరంగా జరుపుకునే ప్రకృతి పండుగ ఇది. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో తొలి రోజు జరుపుకునే ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు’ అని వెల్లడించారు.

Next Story