రూ.225 కోట్లతో ‘బాసర’ మాస్టర్ ప్లాన్ రెడీ.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

by Kema Shiva Kumar |

బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లతో మాస్టర్ ప్లాన్‌ సిద్ధమైంది. ఈ నెల 6న సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

రూ.225 కోట్లతో ‘బాసర’ మాస్టర్ ప్లాన్ రెడీ.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవాలయ పునర్నిర్మాణానికి తెలంగాణ సర్కార్ (Telangana Government) కీలక అడుగు వేసింది. ఈ మేరకు ఆలయ అభివృద్ధికి సంబంధించి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దేవాదాయ శాఖ అధికారులతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో సంబంధిత శాఖ మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా బాసర ఆలయ సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను సీఎంకు అధికారులు ఇవాళ వివరించారు. ఈ ప్లాన్‌ను పరిశీలించిన రేవంత్ రెడ్డి, భక్తుల సౌకర్యార్థం, ఆలయ పవిత్రతను కాపాడేలా పలు కీలక మార్పులు సూచించారు.

రూ.225 కోట్లతో భారీ అభివృద్ధి పనులు

మొత్తం రూ.225 కోట్ల వ్యయంతో బాసర క్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. ఈ నెల 6న సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బాసరకు వెళ్లి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, సంప్రదాయబద్ధంగా, ఆగమ శాస్త్రం ప్రకారమే ఆలయ పునర్నిర్మాణం జరగాలని సీఎం స్పష్టం చేశారు. భవిష్యత్తు అవసరాలను, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ పరిసరాల్లో విశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆలయ పవిత్రతను, పర్యావరణాన్ని కాపాడడంలో భాగంగా ఆలయ పరిసరాల్లో కేవలం ఎలక్ట్రిక్ (EV) వాహనాలను మాత్రమే అనుమతించాలని సూచించారు.

భక్తులకు ప్రపంచ స్థాయి వసతులు

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తరహాలోనే బాసర ఆలయ పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా కఠినమైన నిబంధనలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆలయ పవిత్రతకు భంగం కలిగించే ఏ చర్యలనైనా అడ్డుకునేలా నిబంధనలను కఠినతరం చేయాలని పేర్కొన్నారు. అక్షరాభ్యాసం కోసం వచ్చే వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు, వసతి గృహాలు, గోదావరి స్నాన ఘట్టాలను ఆధునీకరించనున్నారు. బాసర క్షేత్రం అద్భుతంగా ఉండేలా ప్రతి అడుగులోనూ నాణ్యత పాటించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

Next Story