- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bandi Sanjay: ఎంఐఎంకు మేయర్ పదవి ఆఫర్ చేసిన కాంగ్రెస్
కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఈ సమాచారం రావడంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్‌కు రాకుండా చొప్పదండికే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఘోర ఓటమి తథ్యమని తెలిసిన కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు మేయర్ పదవి ఇచ్చేందుకు లోపాయికారీ ఒప్పదం చేసుకుందన్నారు. కరీంనగర్ కార్పొరేషన్‌కు కేంద్రం నుండి నిధులు తెచ్చి నేను అభివృద్ధి చేస్తే.. మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆ నిధులు తామే తెచ్చానని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. ‘‘గంగులా నేనడుగుతున్నా... నువ్వెవరో మోడీకి తెలుసా? నీ ముఖం ఎన్నడైనా చూసిండా? బీఆర్ఎస్ అడిగితే నిధులిస్తారా? బీజేపీ అడిగితే నిధులిస్తారా? అసలు అవన్నీ కేంద్ర నిధులా కాదా?’’అని అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం కరీంనగర్ పట్టణంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
నీ మొఖం మోడీకి తెలుసా?
మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఇయాళే నిద్ర లేచారు. కేంద్ర నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేయించి నేను బుక్ లెట్ ఇంటింటికీ పంపిస్తుంటే.. వాళ్లకు భయమేసి ఇప్పుడు కరపత్రం కొట్టించి మేమే కేంద్రం నుండి నిధులు తెచ్చారని చెప్పడం సిగ్గు చేటు. నేనడుగుతున్నా.. గంగులా.. నీ మొఖం మోడీకి తెలుసా? నిన్ను గుర్తుపడతారా? బీజేపీ కాకుండా బీఆర్ఎస్ అడిగితే నిధులు ఇస్తారా?.. మోడీ నన్ను పిలిచి శభాష్ అని అభినందించి కరీంనగర్‌కు అడిగిన నిధులు ఇస్తున్నారు. అందుకే ఇప్పుడు కూడా కరీంనగర్ కార్పొరేషన్ కు రూ.50 కోట్ల నిధులు వచ్చి రడీగా ఉన్నయ్.
కార్పొరేటర్లను నేనే జైల్లో వేయించా
నేను నిధులు తెస్తే.. గంగుల కమలాకర్ మనుషులు కబ్జాలు చేయడం తప్ప చేసిందేమి లేదు. పేదోళ్లు జాగాలు కబ్జా చేయించిన 9 మంది కార్పొరేటర్లను నేనే జైల్లో వేయించా. 10వ వార్డులో ఉన్న వ్యక్తి కూడా కబ్జా చేస్తే జైలుకు పంపాలని అనుకుంటే మానవత్వంతో వదిలేయాలని డి.శంకరన్న కోరితే వదిలేసిన. అట్లాంటి కబ్జాకోర్లను గెలవనీయొద్దు అని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిపోయిండు
కరీంనగర్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ పూర్తిగా చేతులెత్తేసింది. ఈ విషయం తెలియడంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్‌కు రాకుండా చొప్పదండిలో మీటింగ్ పెట్టి అటు నుండి అటు పారిపోయిండు. ఇగ ఇక్కడున్న కాంగ్రెస్ నేతల గురించి చెప్పాల్సిన పనే లేదు. అట్లాంటి పార్టీకి ఎందుకు ఓటేయాలి? 6 గ్యారంటీలను అమలు చేశారా? పేదలకు ఇండ్లు ఇచ్చారా? మహిళలకు రూ.2,500లు, తులం బంగారం, స్కూటీ ఇచ్చారా? అవ్వాతాతలకు రూ.6 వేలు ఇచ్చారా? పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే ఎన్నికలైన వెంటనే ఇంటి పన్ను, నల్లాపన్ను సహా అన్ని రకాల పన్నులు పెంచి ప్రజల నడ్డి విరగ్గ్గొడతారు. ఆఖరికి రోడ్డుపై నడవాలంటే కూడా పన్నులు బాదుతారు జాగ్రత్త అని బండి సంజయ్ హెచ్చరించారు.






