ఉద్యోగుల ఉసురు పోసుకోకు.. డీఏ, పీఆర్సీపై రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ

by Prasad Jukanti |

ఉద్యోగుల డీఏలు, పీఆర్సీ, రిటైర్డ్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించకపోతే జరగబోయే కార్యచరణను బండి సంజయ్ సీఎంకు లేఖ రూపంలో హెచ్చరించారు.

ఉద్యోగుల ఉసురు పోసుకోకు.. డీఏ, పీఆర్సీపై రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ డీఏలు, పీఆర్సీ బకాయిలు, రిటైర్మెంట్ ప్రయోజనాలను తక్షణమే చెల్లించాలని మంగళవారం కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (Revanth Reddy) బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో 3 లక్షలకు పైగా రెగ్యులర్, 4 లక్షలకు పైగా రిటైర్డ్ ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్‌లో (Pending DA) ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులు దాచుకున్న గ్రాట్యుటీ, ఈపీఎఫ్, లీవ్ ఎన్‍క్యాష్‍మెంట్ బకాయిలను కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదని, 2023 జులై నుండి అమలు చేయాల్సిన పీఆర్సీని రెండున్నరేళ్లు అవుతున్నా ఆ ఊసే ఎత్తకపోవడం శోచనీయం అన్నారు. కనీసం పీఆర్సీ రిపోర్ట్ ను కూడా తెప్పించకపోవడం చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులంటే ఎంతటి నిర్లక్ష్య వైఖరి ఉందో అర్ధం చేసుకోవచ్చని దుయ్యబట్టారు.

మీ నిర్లక్ష్యానికి 61 మంది మృతి:

రిటైర్డ్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వమే మానసిక వేదనకు గురిచేస్తుండటం క్షమించరానిదన్నారు. ముక్కు మొఖం తెలియని వృద్ధులు కష్టాల్లో ఉంటేనే చేతనైనంత సాయం చేయాలని భావించే గొప్ప మానవతా హృదయమున్న తెలంగాణ సమాజం మనది. అలాంటింది జీవితాంతం ప్రభుత్వానికి ఊడిగిం చేసిన ఉద్యోగులు రిటైర్డ్ అయితే వారి బెన్‍ఫిట్స్ అన్నీ చెల్లించి సగౌరవంగా సన్మానించి పంపాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ వారి ఉసురు పోసుకుంటోందని విమర్శించారు. మానవత్వం ఉన్న పాలకులెవరూ ఇంతటి నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించరని, మీ నిర్లక్ష్యం వల్ల బెన్‍ఫిట్స్ అందక గత ఏడాది నుండి ఇప్పటి వరకు 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర మానసిక వేదనకు లోనై మరణించారని ఆరోపించారు.

మున్సిపల్ ఎన్నికల తర్వాత కార్యాచరణ ఇదే:

రిటైర్డ్ ఉద్యోగులతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయలకు చెల్లించాల్సిన బకాయిలన్నీ కలిపితే రూ.12 వేల కోట్లకుపైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏటా రూ.2.5 కోట్లకు పైగా వార్షిక బడ్జెట్ కలిగిన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు రూ.12వేల కోట్ల బకాయిలు చెల్లించడం భారంగా భావించడం అంటే అంతకంటే దురదృష్టకరమైన విషయం మరొకటి లేదన్నారు. ఇకనైనా వారిపట్ల మీకున్న నిర్లక్ష్య ధోరణిని విడనాడి రిటైర్డ్ ఉద్యోగుల బెన్‍ఫిట్స్ బకాయిలను అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని యుద్ధ ప్రాతిపదికన చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే మున్సిపల్ ఎన్నికల్లో అనంతరం రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసేందుకూ వెనుకాడబోమని, అవసరమైతే హైదరాబాద్ నడిబొడ్డున ఆయా ఉద్యోగుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు దీక్ష చేసేందుకు తగిన కార్యాచరణ రూపొందించుకునేందుకు వెనుకంజ వేసే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

Next Story