అసెంబ్లీ నుంచి ఈటల సస్పెన్షన్‌.. బండి సంజయ్ రియాక్షన్ ఇదే (వీడియో)

by Disha Web Desk 2 |
అసెంబ్లీ నుంచి ఈటల సస్పెన్షన్‌.. బండి సంజయ్ రియాక్షన్ ఇదే (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను సస్పెండ్ చేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ను మరమనిషి అంటే సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ ఈటల సస్పెన్షన్ అంశాన్ని చట్టపరంగా ఎదుర్కొంటామన్నారు. ఈ విషయంలో సీఎంకు తప్పకుండా గుణపాఠం చెబుతామన్నారు. స్పీకర్‌ను ఉద్దేశించి ఈటల అసెంబ్లీ బయట మర మనిషి అంటేనే కోపగించుకున్న అదే కేసీఆర్ నిండు సభలోపల మోడీని ఫాసిస్ట్ ప్రధాని అనలేదా? అని నిలదీశారు. మోడీ పట్ల సంస్కార హీనంగా మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడానికే ప్రభుత్వం అసెంబ్లీని ఏర్పాటు చేసిందని దుయ్యబట్టారు. ప్రతిపక్షాల సలహాలు, సూచనలు తీసుకునేందుకు సీఎం గజగజ లాడిపోతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడనీయకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూడటం సరికాదన్నారు. ఈటలను సస్పెండ్ చేసుడుకాదు రాబోయే రోజుల్లో కేసీఆర్‌ను ప్రజలు రాష్ట్రం నుండి సస్పెండ్ చేస్తారని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్‌కు పెన్షన్లు, ఉద్యోగులకు జీతాలు గుర్తుకు వస్తాయని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక అయిపోగానే మళ్లీ యధావిధిగా పెండింగ్ పెడతాడని విమర్శించారు. ముందు ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందజేయాలని అన్నారు.

Next Story