- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్.. గ్యారంటీలు అమలు చేయకపోతే భారీ ఉద్యమం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆధ్వర్యంలో గ్యారంటీల అమలుపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారం కాపాడుకోవాలనే యావ తప్ప తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమం పట్టింపు లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. డూప్లికేట్ గాంధీ కుటుంబానికి రూ.వెయ్యి కోట్లు పంపాలనే శ్రద్ధా తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని, మహిళలకు ప్రతి నెలా రూ.2500లు ఇస్తామని చెప్పి రెండున్నరేళ్లు అయ్యిందని ఆ డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని ఫైర్ అయ్యారు. సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ రాష్ట్ర మంత్రివర్గంలో గాంధీ కుటుంబానికి పంపాల్సిన రూ.వెయ్యి కోట్ల నిధుల సేకరణ పైనే చర్చ జరుపుతున్నారే తప్ప, అవ్వాతాతలకు ప్రతి నెలా రూ.4 వేల ఆసరా పెన్షన్ ఇవ్వడంపై కేబినెట్ లో ఎన్నడైనా చర్చ జరిపారా అంటూ మండిపడ్డారు. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు, నిరుద్యోగులకు ప్రతినెలా నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన ఎన్నికల హామీ అమలుపై ఎన్నడైనా మంత్రివర్గంలో ప్రస్తావించారా అని నిలదీశారు. జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసిన రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెన్ ఫిట్స్ ను చెల్లించకపోవడంతో 61 మంది చనిపోయినా ప్రభుత్వంలో చలనం లేదని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు 5 డీఏలు, పెండింగ్ బకాయిలు అందక ఇబ్బంది పడుతున్నా ఎందుకు పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఇవ్వకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు, వేలాది యాజమాన్యాలు అల్లాడుతున్న సంగతి మర్చిపోయారని, ఆరోగ్యశ్రీ బకాయిలు లేవకపోవడంతో కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందక అరిగోస పడుతున్న పేదల ఆరోగ్యం కూడా నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలను ఏ రోజు నుంచి అమలు చేస్తారో వాటికి ఎంత ఖర్చవుతుందో కేబినెట్ లో చర్చించి అమలు తేదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆధ్వర్యంలో గ్యారంటీల అమలుపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
భాగ్యలక్ష్మీ ఆలయానికి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు :
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మంగళవారం పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఉదయం 10 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని అల్పాహార విందు చేస్తారు. అనంతరం ఆయా కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో కలిసి ఉదయం 11 గంటలకు పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుంటారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో కలిసి బండి సంజయ్, రామచందర్ రావు భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుండి మధ్యాహ్నం 12 గంటలకు లాల్ దర్వాజ మహంకాళి టెంపుల్ కు చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు లాల్ దర్వాజలోని రాజన్న బౌలి రెడ్డి జన సంఘం ఫంక్షన్ హాలులో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, బీజేపీ స్థానిక నాయకులతో కలిసి భోజనం చేస్తారు.






