సీఎం రేవంత్​ రెడ్డి మీకు చేత కాకుంటే చెప్పండి

by velandi.Saikiran |

కాళేశ్వరం విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరించిందనే విషయం రేవంత్​రెడ్డి మరిచిపోయినట్లు ఉందని బండి సంజయ్​ ​మండిపడ్డారు.

సీఎం రేవంత్​ రెడ్డి మీకు చేత కాకుంటే చెప్పండి
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరించిందనే విషయం సీఎం రేవంత్​రెడ్డి మరిచిపోయినట్లు ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్​కుమార్​మండిపడ్డారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్​ఇవ్వడం లేదని ఉప్పెన సృష్టిస్తామని పేర్కొనడం తెలంగాణ సమస్యలు పక్కదారి పట్టించి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నమని ఆరోపించారు. ముఖ్యమంత్రికి అపాయిట్ మెంట్ తీసుకోవడం చేతగానే విషయం ఒప్పకుంటే తాను, కిషన్ రెడ్డి ముందుకొచ్చి అపాయిట్ మెంట్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. పక్క రాష్ట్రాలతో మంచి సంబంధాలు పెట్టుకుంటూ ముందుకుపోవాలే తప్ప కయ్యాలు పెట్టుకుంటూ రాజకీయ లబ్ది పొందాలనుకోవడం సరికాదన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ కుక్కలు చింపిన విస్తరిలా మారిందన్నారు. తెలంగాణ బాగుపడాలంటే కేంద్ర నిధులు అవసరమన్నారు. రాష్ట్రంలో ఈసారి బీజేపీకి అధికారమిస్తే పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ది చేసి చూపిస్తామన్నారు. రాష్ట్రంలో ట్రిపుల్ సీ సినిమా కన్పిస్తోందని, కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కలెక్షన్, కమీషన్ అని ఎద్దేవా చేశారు.

మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద నిర్వహించిన ఆవిర్భావ వేడుకలకు ముఖ్య​అతిథిగా హజరై ప్రసంగిస్తూ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామే తప్ప తెలంగాణ ఆశయాలు, లక్ష్యాలను మాత్రం చేరుకోలేకపోయామని ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు ఆర్దిక పరిస్థితి ఏ విధంగా దిగజారిందో కళ్ల ముందు కన్పిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలన ప్రజలు పెనం మీద ఉంటే కాంగ్రెస్ పాలనలో పొయ్యిలో పడట్లు ఉందని, కుక్కల చింపిన విస్తరిలా తెలంగాణ మారిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం టంబం బాగుపడింది. లక్షల కోట్ల రూపాయలు సాధించుకున్నారు. 1400 మందిని బలిని తీసుకుంటే తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలేదు. తెలంగాణ ఇస్తారా, తాము బిల్లు పెట్టి ఇవ్వాలా అని సుష్మాస్వరాజ్ నిలదీస్తే తప్ప కాంగ్రెస్ తెలంగాణను ఏర్పాటు చేయలేదన్నారు. తెలంగాణ ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించింది బీజేపీయే. తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సమయంలో కేసీఆర్ కనీసం సభకు కూడా రాలేదు. తెలంగాణపై జరిగిన చర్చలో కూడా పాల్గొనలేదు. రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం దోచుకుందని విమర్శించారు.

కాంగ్రెస్​కు అధికారం ఇస్తే దోచుకుంటుంది

బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ కు అధికారం అప్పగిస్తే దారుణ పాలన చేస్తోంది. ఈ జనరేషన్ ట్రిపుల్ ఆర్ సినిమా మాత్రమే చూసిందే. కానీ ఓటేసిన పాపానికి ట్రిపుల్ సీ సినిమా చూపిస్తోంది. కన్ఫ్యూజన్ ,కరప్షన్, కమీషన కాంగ్రెస్ దటీస్ ట్రిపుల్ సీ. 6 గ్యారంటీల అమలులో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ ను చూసి జనం అసహ్యించుకుంటున్నారు. కేంద్రం ఇస్తున్న నిధులను కూడా వాడుకోలేని దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానిది. అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతూ కేంద్ర నిధులను దుర్వినియోగం చేస్తోంది. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదు. కేంద్రానికి పంపిన నివేదికల ఆధారంగా కేంద్రం వడ్లను కొంటోంది. అయినా కేంద్రం వడ్లు కొనడం లేదని ఆరోపించడం దుర్మార్గమన్నారు. ఇచ్చిన హామీలను విస్మరించుకుండా చిట్టచివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలను అందిస్తున్న ఘనత మోడీ ప్రభుత్వానిదేనని, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కేంద్ర నిధులు అవసరం. ఇది జరగాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూర నర్సయ్యగౌడ్, సీనియర్ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, గౌతంరావు, అశోక్, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, రాములు తదితరులు హాజరయ్యారు.

Next Story