ఉగ్ర పోరులో ఎన్ఎస్జీ సేవలు అభినందనీయం: బండి సంజయ్

by Ajay Maddhiboyina |

వచ్చే మార్చి నాటికి నక్సల్స్-రహిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు వంద శాతం పూర్తి నిబద్ధతతో కేంద్రంలో మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్​కుమార్​పేర్కొన్నారు.

ఉగ్ర పోరులో ఎన్ఎస్జీ సేవలు అభినందనీయం: బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే మార్చి నాటికి నక్సల్స్-రహిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు వంద శాతం పూర్తి నిబద్ధతతో కేంద్రంలో మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్​కుమార్​ పేర్కొన్నారు. 2010తో పోలిస్తే వామపక్ష తీవ్రవాద హింస 83 శాతం తగ్గిందని మోడీ ప్రభుత్వ రణ నీతి , సుస్థిర పాలన విధానాల ఫలితంగానే ఈ మార్పు వచ్చిందన్నారు. ఇది కేవలం ఒక సంకల్పమే కాదని, ఒక ఉద్యమంగా కొనసాగుతోందన్నారు. భారత్‌ను నక్సలిజం, టెర్రరిజం నుండి విముక్తి చేసి శాంతియుత, సుసంపన్న, అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. బుధవారం హర్యానాలోని మానేసర్ లోని నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ క్యాంపస్ లో శౌర్యస్థల్ వద్ద విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎన్ఎస్జీ వీరులకు నివాళులు అర్పించి నివాస సముదాయాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ పేరు వినగానే మన కళ్ల ముందు బ్లాక్ క్యాట్ కమాండోలు వీరత్వమే కనిపిస్తోందన్నారు. అంకితభావం, అసాధారణ నైపుణ్యాలకు ప్రతీక నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అని ఎన్ఎస్జీ చూపిన ధైర్య సాహసాలు దేశమంతా ఎన్నోసార్లు గర్వపడేలా చేసిందన్నారు. ఉగ్రవాదంపై ఖచ్చితమైన దాడులు, హైజాక్ వ్యతిరేక ఆపరేషన్ల ద్వారా పౌరుల రక్షణ, బాంబ్ నిర్వీర్య కార్యకలాపాలు, జాతీయ విపత్తుల సమయాల్లో చేపట్టే సహాయక చర్యల సమయంలో ఎన్ఎస్జీ అసాధారణ ప్రతిభను చాటుతోందని ప్రశంసించారు. మన శక్తి కేవలం ఆయుధాల్లోనో, టెక్నాలజీలోనే లేదని, మన జవాన్ల ధైర్యసాహసాలు, క్రమశిక్షణ, దేశభక్తిలో ఉంటుంది. ఎన్ఎస్జీ కమాండోల శిక్షణ, వారి మానసిక, శారీరక ధృఢత్వం, త్యాగపూరిత సేవాభావం మనందరికీ ప్రేరణ ఉంటుందన్నారు. ముంబై 26/11 దాడి నుండి ఇటీవలి ఉగ్రవాద చర్యల వరకు ప్రతి సందర్భంలోనూ భారత్ ఉగ్రవాదానికి గట్టి సమాధానమిస్తూ తన ప్రతిభను చాటుతున్న ఎన్ఎస్జీ కి హ్యాట్సాఫ్ చెప్పారు.

భారత్​సరిహద్దు ఉగ్రవాదానికి బాధితురాలే:

భారతదేశం అనేక దశాబ్దాలుగా సరిహద్దు ఉగ్రవాదానికి బాధితురాలే. ఉగ్రదాడులతో ఎందరో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు దాడి చేయాలనే ఆలోచన వస్తేనే వణుకుపుట్టేలా చేస్తున్నామన్నారు. ఉగ్రవాద నిర్మూలనలో రాజీ లేదని దేశ భద్రత, గౌరవం కేంద్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత అన్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా మన ఉక్కు సంకల్పం ముందు అవి నిలబడలేవని మనవైపు కన్నెత్తి చూసే వాళ్లు, ఇకపై మళ్లీ చూసే పరిస్థితిలో ఉండరనే సంకేతాలను ‘‘ఆపరేషన్ సింధూర్’’ ద్వారా శత్రుదేశాలకు సమర్ధవంతంగా పంపించగలిగామని తెలిపారు. దేశ ప్రజల భద్రత కోసం అవసరమైన ప్రతీ అడుగును తీసుకుంటుందన్న స్పష్టమైన సందేశం ఇచ్చాం. శస్త్ర దళాల శ్రేష్ఠత, అంకితభావానికి ఆపరేషన్ సింధూర్ నిదర్శనమన్నారు.

మోడీ నాయకత్వంలో భారత్​ఆశాజన పురోగతి:

ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ ఆశాజనక పురోగతిని సాధించిందని, మనం అభివృద్ధి చెందుతున్న దేశం అనే దృక్పథం నుండి బయట పడి వికసిత దేశంపైపు అడుగులు వేస్తోందని తెలిపారు. వికసిత భారత్ 2047 కేవలం ఒక రాజకీయ నినాదం కాదు. ఇది 143 కోట్ల భారతీయుల కలల సంగమం, వారి ఆకాంక్ష. వికసిత భారత్ కేవలం ఆర్థికంగా మాత్రమే శక్తివంతంగా ఉండడమే కాకుండా అక్కడ ఉగ్రవాదం, మత్తుపదార్థాల అక్రమ రవాణా, గందరగోళానికి చోటు ఉండదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్జీ డైరెక్టర్ జనరల్ బి.శ్రీనివాసన్, ఐజీలు దీపక్ కుమార్ కేడియా, మేజర్ జనరల్ ప్రవీణ్ చాబ్రా, మేజర్ జనరల్ వికాస్ చౌదరి, ప్రిన్సీ రాణి తదితరులు పాల్గొన్నారు.

Next Story