‘కీలక ఆధారాలతో వస్తా’.. సిట్ అధికారులకు బండి భగీరథ్ లేఖ

by Gantepaka Srikanth |   (  Updated:2026-05-13 12:25:50  IST  )

పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ బుధవారం సిట్ (SIT) విచారణకు గైర్హాజరయ్యారు.

‘కీలక ఆధారాలతో వస్తా’.. సిట్ అధికారులకు బండి భగీరథ్ లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ బుధవారం సిట్ (SIT) విచారణకు గైర్హాజరయ్యారు. వాస్తవానికి బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణాధికారి ముందు హాజరుకావాలని సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, నిర్ణీత సమయానికి ఆయన విచారణకు హాజరు కాలేదు. అయితే.. విచారణకు గైర్హాజరైన నేపథ్యంలో బండి భగీరథ్ సిట్ అధికారులకు ఒక లేఖ రాశారు. వ్యక్తిగత కారణాల వల్ల ఇవాళ హాజరు కాలేకపోతున్నానని, ఎల్లుండి (శుక్రవారం) విచారణకు వస్తానని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ కేసులో తన వద్ద ఉన్న కీలక ఆధారాలతో అధికారుల ముందుకు వస్తానని, విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని ఆయన స్పష్టం చేశారు.

ముందస్తు బెయిల్ పిటిషన్..

ఈ కేసులో అరెస్టు కాకుండా ఉండేందుకు భగీరథ్ ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం (మే 14న) వెకేషన్ బెంచ్ విచారణ జరిపే అవకాశం ఉంది. బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రెండోసారి నమోదు చేసిన అనంతరం, పోలీసులు ఈ కేసులో కఠినమైన పోక్సో సెక్షన్లను (సెక్షన్ 5(i) read with 6) అదనంగా చేర్చారు. కేంద్ర మంత్రి కుమారుడు కావడంతో ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులను ఆదేశించారు. ఎల్లుండి భగీరథ్ విచారణకు హాజరయ్యే సమయంలో ఎలాంటి ఆధారాలను సమర్పిస్తారనే అంశంపై ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది.




సిట్ విచారణకు బండి సంజయ్ కొడుకు డుమ్మా!

Next Story