బీఆర్ఎస్‌కు బ్యాడ్ టైమ్.. గుదిబండలా మారిన వరుస విచారణలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-20 02:03:18  IST  )

వరుస విచారణలతో బీఆర్ఎస్ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

బీఆర్ఎస్‌కు బ్యాడ్ టైమ్.. గుదిబండలా మారిన వరుస విచారణలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: వరుస విచారణలతో బీఆర్ఎస్ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కీలకమైన ఫోన్​ ట్యాపింగ్ ​కేసు వేగవంతమవడంతో ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నారు. స్థానిక సంస్థల వేళ పార్టీ కేడర్​కు భరోసా ఇవ్వాల్సిన సమయంలో నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. ఎన్నికలపై దృష్టి పెట్టాలా? లేక? విచారణలు ఎదుర్కొవాలా? తెలియక దిక్కుతోచనిస్థితిలో పడ్డారు. పార్టీ అధినేత కేసీఆర్, మాజీమంత్రి హరీశ్​రావు కాళేశ్వరం కమిషన్ విచారణ​ముందు హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు విషయంలో పార్టీ వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్ విచారణను ఎదుర్కొన్నారు. ఆయనను వచ్చేవారం మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆయన ఫోన్​సరెండర్​చేయాలని నోటీసులు ఇచ్చారు.

కాళేశ్వరం కమిషన్ ​ముందు కేసీఆర్, హరీశ్​రావులు చెప్పిన వాదనలకు భిన్నంగా మంత్రివర్గ మినిట్స్​ ఉన్నాయని సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించారు. వారు అబద్ధాలు ఆడుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో కాళేశ్వరం కమిషన్​నివేదిక ఏ విధంగా ఉంటుందోనని కిందిస్థాయి లీడర్లు, కేడర్ మదనపడుతున్నారు. ఇచ్చిన హామీల అమలు, ప్రజాసమస్యలపై ప్రభుత్వా్న్ని ఇరకాటంలో పెట్టడంలో విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. బీసీల రిజర్వేషన్ల పెంపు, జనగణనతో పాటు కులగణన చేసే విధంగా కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన సమయంలో విచారణలు, వివరణలు, బలప్రదర్శనలతో కాలం వెల్లదీస్తున్నారనే అపవాదు ఉంది. ప్రభుత్వపై ఉన్న ప్రజావ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా తామే గెలుస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

క్లిష్ట సమయంలో..

గత మే నెలలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, ఆ తర్వాత గ్రామ, మండల, జిల్లా కమిటీల ఎన్నిక పూర్తిచేయాలని అనుకున్నారు. పార్టీ రజతోత్సవాలకు కమిటీలు చేసి ఘనంగా నిర్వహించాలని భావించారు. కనీసం నెలకు ఒక కార్యక్రమమైనా నిర్వహించాలని ప్రణాళిక వేశారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత కేసీఆర్​స్వయంగా ప్రకటించారు. కానీ ఇవేవీ ఆచరణలోకి రాలేదు. పైగా పార్టీ సభ్యత్వ నమోదు ఇప్పట్లో కనిపించడం లేదు. వరుస విచారణలతో గులాబీ నేతలు బిజీగా ఉండటం, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండటంతో సభ్యత్వ నమోదు ఇప్పట్లో లేదని పార్టీ కీలక నాయకులు చెబుతున్నారు. ఇది గులాబీ దళానికి క్లిష్టసమయమేనని చెప్పాలి. అడ్డంకులను దాటుకుని ఎలా ముందుకెళ్తారో వేచచూడాలి.

Next Story