నాడు టీఆర్ఎస్.. నేడు టీపీజే! గత పార్టీల చరిత్రను కవిత తిరగరాస్తుందా?

by Kema Shiva Kumar |

తెలంగాణ రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ 'తెలంగాణ ప్రజా జాగృతి' (TPJ) ఏర్పాటుకు సిద్ధమయ్యారు.

నాడు టీఆర్ఎస్.. నేడు టీపీజే! గత పార్టీల చరిత్రను కవిత తిరగరాస్తుందా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకోనున్నది. తెలంగాణ ప్రజా జాగృతి (టీపీజే) పేరుతో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీని ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్​ కోసం దరఖాస్తు సైతం చేసుకున్నారు. త్వరలో ఎన్నికల సంఘం గుర్తింపు వస్తుందని అంచనా వేస్తున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ శివారులో కవిత తన పార్టీ జెండా, ఎజెండాను ప్రకటించనున్నారు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏప్రిల్ 27న ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పేరుతో, అదే ఏప్రిల్ నెలలో 27కు దగ్గర ఉండేలా 25న కవిత పార్టీని ప్రకటించనున్నారు. దీంతో కవిత పలు అంశాల్లో తన తండ్రి బాటలోనే పయనిస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడక ముందు, ఆ తరువాత అనేక పార్టీలు రాష్ట్రంలో పుట్టుకొచ్చాయి. అందులో కొన్ని కాలగర్భంలో కలిశాయి. కొన్ని మాత్రం నామమాత్రంగానే ఉన్నాయి. మాజీ మంత్రి దేవేందర్​గౌడ్ నవ తెలంగాణ, సినీ నటి విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ, మాజీ మంత్రి స్వర్గీయ పి.ఇంద్రారెడ్డి జై తెలంగాణ, తెలంగాణ ప్రజా సమితి పేరుతో భూపతి కృష్ణమూర్తి, తెలంగాణ సాధన సమితి పేరుతో ఆలే నరేంద్ర, ప్రజారాజ్యం పార్టీ పేరుతో చిరంజీవి, లోక్ సత్తా పార్టీని జయ ప్రకాశ్ నారాయణ, మన పార్టీ పేరుతో కాసాని జ్ఞానేశ్వర్, తెలంగాణ జన సమితిని ప్రొఫెసర్ కోదండరామ్, తెలంగాణ విమోచన సమితి పేరుతో కపిలవాయి దీలిప్​కుమార్, గాదె ఇన్నయ్య, వి.ప్రకాశ్‌లు ప్రారంభించారు. ఇలా అనేక పార్టీలు రాష్ట్రంలో స్థాపించినా అవి నిలవలేకపోయాయి. నామమాత్రంగా మారాయి. ఆ పార్టీలు స్థాపించిన సమయంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు వాటిని ఆదరించలేదు. దీంతో ఆ పార్టీలు చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయాయి. తాజాగా కవిత పార్టీని కూడా ప్రజలు ఎంత వరకు ఆదరిస్తారనేది గమనార్హం.

మూడు పార్టీలకు పోటీ ఇచ్చేనా..?

కవిత స్థాపిస్తున్న పార్టీ ప్రాంతీయ పార్టీగా ఉండనుంది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రంలో బలంగా ఉన్నాయి. ఈ మూడు పార్టీలను కాదని టీపీజేను ప్రజలు ఎంత వరకు ఆదరిస్తారని ప్రశ్నార్థకం. ఎన్నకల సమయంలో ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకోక తప్పదా, తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో తన ప్రభావాన్ని టీపీజే చూపిస్తుందా? అనే సందేహాలను, అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ కూతురుగానే గుర్తింపు పొందిన కవిత, ఆయన వల్లే ఆమెను ఇన్నాళ్లు బీఆర్ఎస్ నాయకులు అభిమానిస్తూ, ఆదరిస్తూ వచ్చారు. కేసీఆర్‌కు దూరం అయ్యాక ఆమెను ఏ కోణంలో చూస్తారు? కుటుంబ కలహాల కారణంగా పుట్టుకొచ్చిన పార్టీగా చూస్తారా? లేక ప్రజా సమస్యల పరిష్కారానికి వచ్చిన పార్టీగా చూస్తారా? అనేది వేచి చూడాల్సిందే. మున్సిపల్ ఎన్నికల్లో సొంతంగా కాకపోయినా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పేరుతో పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించినా ఫలితాలు సాధించలేకపోయారు. ఆమె సాధారణ ఎన్నికల్లోనే పోటీ చేస్తారా? లేక వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ, హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తారా? వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేదిపై చర్చ జరుగుతోంది.

Next Story