TG: పార్టీల మధ్య మారిన సమీకరణాలు..ఇక బీ టీమ్స్ రాజకీయాలను నమ్మేదెవరు?

by Prasad Jukanti |

మేయర్, చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అనూహ్య పొత్తులు; బీ టీమ్ రాజకీయాలపై చర్చకు దారి తీస్తోంది.

TG: పార్టీల మధ్య మారిన సమీకరణాలు..ఇక బీ టీమ్స్ రాజకీయాలను నమ్మేదెవరు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది. మున్సిపల్ ఎన్నికలను నాలుగు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అంతిమంగా మేయర్, చైర్మన్ పోస్టులు దక్కించుకున్నది ఎవరో తేలిపోయింది. పీఠాల దక్కించుకునేందుకు పార్టీల మధ్య ఒకరిని మించి మరొకరు రచించిన ప్రణాళికలు స్టేట్ పాలిటిక్స్ ను రసవత్తరంగా మార్చాయి. ఊహించని సంచలనాలు, సమీకరణాల మధ్య పార్టీల మధ్య కుదిరిన పొత్తులు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. ఇంత కాలం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్న పార్టీలే ఇప్పుడు అధికారం కోసం ఒక్కటై అందరి నోళ్లపై వేలు వేసుకునేలా చేశాయి. తమ మధ్య ఉన్న వైరం నమ్మించేందుకు పోటీ పడీ మరి తిట్టుకున్న పార్టీలే ఇప్పుడు చెట్టాపట్టాలేసుకుని మేయర్, చైర్మన్ పీఠాలెక్కేశాయి. దీంతో ఇంతకాలం పార్టీల మధ్య సాగిన తిట్ల దండకాలు ఏమైపోయాయి? ఇప్పుడు కుదిరిన స్నేహాలు ఎంత కాలం నిలుస్తాయి? అసలీ పరిణామాలతో స్టేట్‍లో ఫ్యూచర్ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తి రేపుతోంది.

బీ టీమ్స్ మధ్య న్యూ బాండింగ్:

తెలంగాణలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ (Congress),బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP), ఎంఐఎం (AIMIM) ఎప్పటి నుంచో పరస్పరం బీ టీమ్ (B-Team Politics) ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ నాలుగు పార్టీలు మరో రెండు పార్టీల మధ్య సంబంధం అంటగడుతూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. కానీ మున్సిపల్ ఎన్నికల్లో చాలా చోట్ల హంగ్ పరిస్థితులు ఉండటంతో ఈ ప్రధాన ప్రత్యర్థుల మధ్య ఈక్వేషన్స్ మార్చివేశాయి. ఇవాళ జరిగిన మేయర్, చైర్మన్‍ల ఎన్నికల వేళ పార్టీల మధ్య మద్దతు రాజకీయాలు సంచలనంగా మారాయి. ఒకరికంటే మరొకరికి పొసగవు అనుకుంటున్న పార్టీలు ఏకమయ్యాయి. కామారెడ్డిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటవ్వగా అమరచింతలో బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) ఒక్కటయ్యాయి. ఇక అలియాబాద్‍లో బీజేపీ, కాంగ్రెస్ ఏకం కాగా ఎల్లంపేటలో బీఆర్ఎస్‍‍కు బీజేపీ మద్దతు ఇచ్చింది. ఎంఐఎం సహకారంతో నిజామాబాద్ హస్తం పార్టీ తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఇన్నాళ్లు ఒకరిపై మరొకరు దూషించుకున్న పార్టీలు ఇప్పుడు పదవుల కోసం కలిసిపోవడం క్షేత్రస్థాయిలో చర్చనీయాశంగా మారింది.

ఇక నమ్మించడమే బిగ్ టాస్క్:

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల మధ్య పరస్పర సహకారం సాధారణమే అయిన గత కొంత కాలంగా తెలంగాణలో గతానికి భిన్నమైన రాజకీయం సాగుతోంది. ప్రత్యర్థులను టార్గెట్ చేసే విషయంలో వ్యూహాలు మరింత రాటుదేలుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనే వాదన క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున వినిపించింది. దీంతో బీఆర్ఎస్, బీజేపీలు నష్టపోయాయిందనే చర్చ జరిగింది. అయితే ఈ ఈ వాదనలో నిజం లేదని నిరూపించడానికి ఆ తర్వాత బీజేపీ కవితను అరెస్టు చేసి బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో సఫలం అయిందనే ప్రచారం జరిగింది. ఇలా నిత్యం ఒకరిపై మరొకరు టార్గెట్ చేస్తూ సాగుతున్న రాజకీయంలో మున్సిపల్ ఎన్నికల వేళ కుదిరిన పొత్తులు, మద్దతు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఎఫెక్ట్ తో తెలంగాణలో భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయనేది ఉత్కంఠగా మారింది. ఈ పొత్తులు ఆయా మున్సిపాలిటీల వరకే ఆగుతాయా లేక ఆ పరిధి దాటుకుని రాష్ట్ర స్థాయి వరకు పాకుతాయా అనేది వేచి చూడాలి. ఈ పరిణామాలు అన్ని గమనించిన ప్రజలు ఇకపై ఒకరిపై మరొకరు చేసుకున్న విమర్శలను ఏ మేరకు నమ్ముతారు అనేది కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.

Next Story