- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మండలిలోకి అజారుద్దీన్, కోదండరాం.. నేడు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం
తెలంగాణ ఎమ్మెల్సీలుగా ఇవాళ మొహమ్మద్ అజారుద్దీన్, తెలంగాణ జన సమితి చీఫ్ కోదండరాం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం, మాజీ క్రికెటర్, మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిన్ననే గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఉదయం 11 గంటలకు శాసనమండలి (Legislative Council) కార్యాలయంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరిద్దరితో ప్రమాణం చేయించనున్నారు. ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.
అజారుద్దీన్‌కు భారీ ఊరట..
రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న మొహమ్మద్ అజారుద్దీన్‌కు ఈ ప్రమాణ స్వీకారం అత్యంత కీలకం కానుంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నుంచి 6 నెలల లోపు చట్టసభలో సభ్యుడిగా ఎన్నిక కావాలనే రాజ్యాంగ నిబంధన ఉంది. ఈ గడువు ఏప్రిల్ 30తో ముగియనుండగా, సరిగ్గా 3 రోజుల ముందే ఎమ్మెల్సీగా ప్రమాణం చేస్తుండటంతో ఆయన మంత్రి పదవికి ఉన్న సాంకేతిక ఇబ్బందులు తొలగిపోయాయి. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ చైర్మన్‌గా కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం తొలిసారిగా పెద్దల సభలో అడుగుపెట్టబోతున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో, సాగునీటి ప్రాజెక్టుల వంటి ప్రజా సమస్యలపై మండలిలో ఆయన గళం విప్పనున్నారు.
గవర్నర్ ఆమోదంతో లైన్ క్లియర్..
గత కొద్ది రోజులుగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై ఉత్కంఠ కొనసాగిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తాజాగా వారి ఫైల్‌పై సంతకం చేయడంతో మార్గం సుగమమైంది. దీంతో నిన్న సాయంత్రమే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అధికారిక గెజిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే.






