ఇంజినీరింగ్ ప్రవేశాలపై విద్యార్థులకు, పేరెంట్స్‌కు అవగాహన కార్యక్రమం

by Yella Dhawani Reddy |

టీజీఈఏపీసెట్-2025 రాసిన విద్యార్థులకు ఇంజనీరింగ్ అడ్మిషన్లు, కాలేజీల ఎంపిక, ఏయే కోర్సుల్లో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయనే అంశాలపై ఈ నెల 21న జేఎన్టీయూహెచ్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఇంజినీరింగ్ ప్రవేశాలపై విద్యార్థులకు, పేరెంట్స్‌కు అవగాహన కార్యక్రమం
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీజీఈఏపీసెట్-2025 రాసిన విద్యార్థులకు ఇంజనీరింగ్ అడ్మిషన్లు, కాలేజీల ఎంపిక, ఏయే కోర్సుల్లో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయనే అంశాలపై ఈ నెల 21న జేఎన్టీయూహెచ్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం తెలంగాణ ఉన్నత విద్యా మండలి (టీజీసీహెచ్ఈ), జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూహెచ్) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. టీజీ ఈఎపీసెట్-2025 విద్యార్థులకు, వారి తల్లిదండ్రుల కోసం ఇంజినీరింగ్ ప్రవేశాలపై 21న ఉదయం 10 గంటలకు కూకట్‌పల్లిలోని జేఎన్టీయూహెచ్ జవహర్‌లాల్ నెహ్రూ ఆడిటోరియంలో అవగాహన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ.వి.బాలకిష్టారెడ్డి, జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొ.టి.కిషన్‌కుమార్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో ప్రవేశాలు, బ్రాంచ్, కాలేజ్ ఎంపిక, కోర్ బ్రాంచ్‌ల ప్రాముఖ్యత, ఇంజినీరింగ్‌లోని వివిధ బ్రాంచ్‌ల ఉద్యోగ అవకాశాలు వంటి వివిధ అంశాలపై ప్రసంగించనున్నారు. అంతేకాకుండా విద్యార్థులకు ఎక్కువ కోర్ సబ్జెక్టుల ప్రాధాన్యతలను వివరించనున్నారు. అకాడమిక్ నిపుణులు, ఇండస్ట్రీ నిపుణులు పలు ఉద్యోగ ఉపాధి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్‌లు ప్రొ.ఇ.పురుషోత్తం, ప్రొ.ఎస్.కె.మహమూద్, కార్యదర్శి ప్రొ.శ్రీరామ్ వెంకటేష్, జేఎన్టీయూహెచ్ రెక్టార్ ప్రొ.కె.విజయ కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొ.కె.వెంకటేశ్వర రావు, ప్రిన్సిపాల్ ప్రొ.జి.వి.నరసింహారెడ్డి, టీజీ ఈఏపీసెట్-2025 క్యాంప్ ఆఫీసర్ బి.శ్రీనివాస్, వివిధ విభాగాల అధిపతులు, పారిశ్రామిక నిపుణులు పాల్గొంటారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి https://lu.ma/TGEAPCET-2025-Awareness-Program-on-Engineering గూగుల్ ఫారం ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

Next Story