- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు.. వార్డుల విభజనకు కసరత్తు
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఈ ఎలక్షన్స్ ముగిసిన వెంటనే మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఈ ఎలక్షన్స్ ముగిసిన వెంటనే మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పురపాలక శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొత్తగా ఏర్పడిన జిన్నారం, ఇంద్రేశం మున్సిపాలిటీలతో పాటు ఇస్నాపూర్, గజ్వేల్ మున్సిపాలిటీల్లోనూ వార్డుల విభజనకు కసరత్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. అనుమతి రాగానే ప్రక్రియ పూర్తి చేయనున్నారు.
160 యూఎల్‌బీలు..
రాష్ట్రంలోని 160 పట్టణ స్థానిక సంస్థలున్నాయి. వీటిలో 16 మున్సిపల్ కార్పొరేషన్లు, 144 మున్సిపాలిటీలున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) పరిధిలో ఉన్న 27 పట్టణ స్థానిక సంస్థలతో పాటు జీహెచ్ఎంసీని మినహాయిస్తే 10 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏడాది పాటు సమయం ఉంది. ఇక మిగిలిన 123 పట్టణ స్థానిక సంస్థల్లో మాత్రమే ఎలక్షన్స్ నిర్వహించాల్సి ఉంది.
122 యూఎల్‌బీల్లోనే ఎన్నికలు..
పురపాలక శాఖ ఆధ్వర్యంలో 122 యూఎల్‌బీల్లోనే ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీరిలో ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. 116 మున్సిపాలిటీలున్నాయి. వీటన్నింటిలోనూ ఇప్పటికే వార్డుల ప్రక్రియను పూర్తి చేశారు. జూన్ మాసంలో 30 మున్సిపాలిటీలకు సంబంధించిన వార్డుల విభజన ప్రక్రియ పూర్తి చేసిన విషయం తెలిసిందే. కొత్తగా ఏర్పడిన జిన్నారం, ఇంద్రేశం మున్సిపాలిటీల్లో వార్డుల విభజన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇక ఇస్నాపూర్ మున్సిపాలిటీలో శివారు గ్రామాలను విలీనం చేయడంతో అక్కడా వార్డుల పునర్విభజన చేయాలని పురపాలక శాఖ నిర్ణయించింది. మల్లన్నసాగర్ బాధితుల కోసం ఏర్పాటు చేసిన కాలనీలు గజ్వేల్ మున్సిపాలిటీల్లోనే ఉన్నాయి. కానీ గత ప్రభుత్వం వీటిని గ్రామపంచాయతీ కేటగిరిలో పెట్టడంతో పాటు ఎన్నికలు సైతం నిర్వహించింది. పాలకవర్గం గడువు ముగియడంతో అసలు సమస్య ముందుకొచ్చింది. మున్సిపాలిటీ పరిధిలో ఉండి గ్రామపంచాయతీగా పరిగణించడం సరికాదని ప్రభుత్వం గుర్తించింది. అయితే ఇప్పటికే వార్డుల విభజన పూర్తి చేసిన గజ్వేల్‌లోనూ కొత్త కాలనీల నేపథ్యంలో వార్డులను పునర్విభజన చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఉన్న వార్డుల్లోనే ఆయా ప్రాంతాలను కలుపుతూ వార్డులను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.






