సైబరాబాద్ CP ఐడియా అదుర్స్.. విద్యార్థులకు భారీ ఉపశమనం..

by Gantepaka Srikanth |

సైబరాబాద్ CP ఐడియా అదుర్స్.. విద్యార్థులకు భారీ ఉపశమనం..

సైబరాబాద్ CP ఐడియా అదుర్స్.. విద్యార్థులకు భారీ ఉపశమనం..
X

దిశ, సిటీక్రైం: సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి ఐడియా ఇతర రాష్ట్రాలు, జిల్లాలు, నగరాల నుంచి వచ్చిన పౌరులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. ఉద్యోగాలు, విద్యాభ్యాసం నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి ఉంటున్న వారి భద్రత కీలకంగా మారింది. వారి భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ప్రణాళికలను రూపొందించారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్, బాలానగర్ డీసీపీ జోన్లలో 4 వేల హాస్టల్స్ ఉన్నాయి. వీటిలో దాదాపు 2 లక్షల మంది నివాసం ఉంటున్నారు. ఈ హాస్టల్స్ నిర్మాణ అనుమతుల అంశంలో చాలా లోపాలు ఉన్నాయి. అయితే వీటిపై పోలీసుశాఖ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి.

భవన నిర్మాణ తదితర అనుమతులకు సంబంధించిన అంశం పోలీసుశాఖ పరిధిలో ఉండదు. దీంతో సీపీ అవినాష్ మహంతి ఐటీ కారిడార్‌తో పాటు విద్యాభ్యాసం కోసం వచ్చిన వారి సెక్యూరిటీ గురించి ఆలోచించి ఎస్‌సీఎస్‌సీ వారితో కొన్ని టీంలను ఏర్పాటు చేశారు. ఈ టీంలతో హాస్టల్స్‌లో నెలకొన్న భద్రత అంశాలపై ఆడిట్ చేయిస్తున్నారు. ఈ ఆడిట్‌లో భద్రత పరంగా నివాసయోగ్యమైన వాటిని గుర్తిస్తున్నారు. అలా గుర్తించిన వాటికి సంబంధించిన వివరాలను సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వద్ద ఉంచారు. ఈ కౌన్సిల్‌ను సంప్రదిస్తే ఉద్యోగులు, విద్యార్థులు సురక్షితంగా ఏ హాస్టల్‌లో ఉండొచ్చనే విషయం స్పష్టంగా తెలిసిపోతుంది.

Next Story