దారుణం.. కన్నతల్లిని భార్యతో కలిసి చంపిన కొడుకు?

by Sathputhe Rajesh |   (  Updated:2023-03-21 05:47:55  IST  )

కన్నతల్లిని భార్యతో కలిసి చంపిన కొడుకుపై గ్రామస్తులందరూ కలిసి చితకబాదారు.

దారుణం.. కన్నతల్లిని భార్యతో కలిసి చంపిన కొడుకు?
X

దిశ, కొత్తకోట: కన్నతల్లిని భార్యతో కలిసి కొడుకు చంపాడని ఆరోపిస్తూ గ్రామస్తులందరూ భార్యాభర్తలను చితకబాదారు. వాళ్లపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం, అమడ బాకుల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు శంకరమ్మ (60)‌తో కొడుకు జేసీబీ రాములు, కోడలు శివమ్మ తరచుగా గొడవ పడేవారు. ఇటీవల కోడలు కొట్టడం వల్లే కాలు విరిగి నడవలేని పరిస్థితిలో మంచానికే శంకరమ్మ పరిమితమైందని గ్రామస్తులు తెలిపారు.

మంగళవారం ఉదయం శంకరమ్మ ఇంటి ప్రాంగణంలో ఉన్న సంపులో పడి మృతి చెందిందని తెలియడంతో గ్రామస్తులు ఒకసారిగా మృతురాలి కొడుకు, కోడలు నివాసం ఉంటున్న ఇంటిపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. వారిని చితకబాదారు. విషయం తెలిసిన కొత్తకోట ఎస్సై రాజశేఖర్ రెడ్డి హుటాహుటిన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని మృతురాలు కుమారుడు రాములు, కోడలు శివమ్మను కొత్తకోట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై నాగ శేఖర్ రెడ్డి తెలిపారు.

Next Story