లోక్‌భవన్‌లో ఘనంగా ‘ఎట్‌ హోం’.. గవర్నర్‌ తేనీటి విందుకు ప్రముఖులు

by Ramesh Naini |

గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో సోమవారం సాయంత్రం ‘ఎట్‌ హోం’ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.

లోక్‌భవన్‌లో ఘనంగా ‘ఎట్‌ హోం’.. గవర్నర్‌ తేనీటి విందుకు ప్రముఖులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో సోమవారం సాయంత్రం ‘ఎట్‌ హోం’ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఏర్పాటు చేసిన ఈ తేనీటి విందు రాజకీయ, న్యాయ, అధికార వర్గాల కలయికకు వేదికైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్‌, శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

గవర్నర్స్ అవార్డ్స్ ప్రదానం..

వివిధ రాజకీయ పార్టీల నుంచి ఎంపీ ఈటల రాజేందర్, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలకు చెందిన కీలక నేతలు ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సైతం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ‘గవర్నర్స్ అవార్డ్స్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌’ను ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతలను ఆయన అభినందిస్తూ, వారి సేవలను కొనియాడారు. తేనీటి విందు అనంతరం గవర్నర్ అతిథులందరినీ పలకరిస్తూ, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. లోక్‌భవన్ ప్రాంగణమంతా ప్రముఖుల రాకతో సందడిగా మారింది.

Next Story