పేదల భూముల్లో రాజకీయం.. పోతిరెడ్డిపల్లిలో అసైన్డ్ భూముల లూటీ.!

by Bhanu |

జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పరిధిలోని పోతిరెడ్డిపల్లిలో యథేచ్ఛగా అసైన్డ్ భూముల అమ్మకాలు జరిగాయి.

పేదల భూముల్లో రాజకీయం.. పోతిరెడ్డిపల్లిలో అసైన్డ్ భూముల లూటీ.!
X

దిశ, సంగారెడ్డి: జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పరిధిలోని పోతిరెడ్డిపల్లిలో యథేచ్ఛగా అసైన్డ్ భూముల అమ్మకాలు జరిగాయి. పోతిరెడ్డిపల్లిలోని నేషనల్ హైవేకు సమీపంలో ఉన్న అసైన్డ్ భూములు సర్వే నంబర్ 153, 154, 155, 161లో సుమారు 250 ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంపిణీ చేశారు. ఇంకేముంది అసైన్డ్ భూములపై రాజకీయ రాబందుల కన్ను పడింది. రైతుల ఆర్థిక అవసరాలను కనిపెట్టిన రాజకీయ నాయకులు రైతులను మభ్య పెట్టి తక్కువ ధర చెల్లించి ఎక్కువ ధరకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మేశారు. ఒకటి కాదు రెండు కాదు వందల ఎకరాల్లో భూములను రైతుల నుంచి సేకరించి రియల్ వ్యాపారులకు అమ్మేశారు.


పోతిరెడ్డి పల్లి నుంచి కోత్లాపూర్ గ్రామ శివారు వరకు విస్తరించి ఉన్న భూములకు ఎకరం భూ ధర రూ.కోట్లల్లో పలుకుతున్నది. అదేవిధంగా నేషనల్ హైవేకు ఆనుకుని ఉండడంతో పెద్ద పెద్ద రాజకీయ నాయకుల కన్నుపడింది. అనుకున్నదే ఆలస్యం అమాయక రైతుల ఆర్థిక అవసరాలు రాజకీయ నాయకులకు కలిసి వచ్చాయి. నేషనల్ హైవేకు ఆనుకుని భూములు ఉండడంతో ఒక్కో రైతుకు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షలు చెల్లించి బాండ్ పేపర్ పై అగ్రిమెంట్ చేయించుకున్నారు. కోట్ల విలువ చేసే భూములను కేవలం ఎకరానికి రూ.30 లక్షల చెల్లించి అగ్రిమెంట్ చేయించుకున్నారు.

పేదల జీవనోపాధి కోసం ఇచ్చిన భూముల అన్యాక్రాంతం..

గత కొన్ని సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వాలు పేదలకు వారి జీవనోపాధి కోసం అసైన్డ్ భూములను పంపిణీ చేసింది. ఆ భూములను రైతులు సాగుచేసుకుని జీవనం కొనసాగించాలి. వాటిని అమ్మడం కానీ, కొనడం కాని నిషేధం. కొందరు రాజకీయ దళారులు అసైన్డ్ భూములపై కన్నేశారు. ఎంతో కొంత ఇస్తాం మాకు భూములు విక్రయించండంటూ పేదల రైతుల నుంచి బలవంతంగా గుంజుకుంటున్నారు. ఇదంతా జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పోతిరెడ్డిపల్లిలో సర్వే నంబర్ 153, 154 155, 161లో విక్రయాలు జరిగాయి. సర్వేనంబర్ 161లో అసైన్డ్ ల్యాండ్ కొనుగోలు చేసిన రియల్ వ్యాపారులు రాజకీయ నాయకుల అండదండలతో వెంచర్ లు చేసి ప్లాట్లను అమ్మివేశారు. అసైన్డ్ భూమిని కొనడం, అమ్మడం నేరం. కానీ ఇక్కడ బడా రాజకీయ నాయకుల సహకారంతో అసైన్డ్ ల్యాండ్ లో నిర్మించిన ఇండ్లకు రెవెన్యూ అధికారుల సహాకారంతో ఎన్ఓసీలు ఇప్పించడం గమనార్హం.

అదే సర్వే నంబర్ లో పేదలు కొందరు రైతుల నుంచి ప్లాట్లు కొనుగోలు చేసి ఇండ్లు నిర్మించుకుంటే వారికిఇంతవరకూ ఎన్ఓసీ ఇచ్చిన దాఖలాలు లేవు. అదే బడా రాజకీయ నాయకుల సహాకారంతో కొందరు అధికారులు పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుని ఎన్ఓసీలు ఇవ్వడం గమనార్హం. అదే కాకుండా పోతిరెడ్డిపల్లిలో ఉన్న మాసానికుంటను సైతం యదేచ్చగా బట్టారు. మాసానికుంట పరివాహక ప్రాంతాన్ని మొత్తం ఆక్రమించి అక్రమార్కులు ఇండ్లు నిర్మించుకున్న రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.

ప్రభుత్వ స్థలాల విక్రయాలకు ప్రోత్సహిస్తున్న నేతలు

అసైన్డ్ భూములు విక్రయించకూడదు..కొనకూడదనే ప్రభుత్వ నిబంధనలు ఉన్నా బడా రాజకీయ నాయకుల అండదండలతో పెద్ద ఎత్తున విక్రయాలు చేశారు. చిన్న రైతుల నుంచి కొనుగోలు చేసిన రియల్ వ్యాపారులు ఉన్నతస్థాయి అధికారులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల సహకారంతో క్రయ, విక్రయాలు జరుపడం శోచనీయం. అసైన్డ్ భూములను యదేచ్చగా రిజిస్ట్రేషన్లు చేసి డాక్యూమెంట్లు సైతం తయారు చేశారు. గతంలో అసైన్డ్ ల్యాండ్ గా రికార్డుల్లో ఉంటే ప్రస్తుతం వాటిని పట్టాభూములుగా మార్చి ప్లాట్లుగా విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పోతిరెడ్డిపల్లి వాసులు పేర్కొంటున్నారు. పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అసైన్డ్ భూములను విక్రయిస్తున్నారు..అందులో ప్లాట్లు చేసి విక్రయిండమే కాకుండా ఇండ్ల నిర్మాణాలు చేస్తున్నారు. ధర్యాప్తు చేసి ప్రభుత్వ భూములను కాపాడాలని కలెక్టర్ కు వినతిపత్రాలు అందజేశారు. కానీ వాటిపై ఇప్పటి వరకు కూడా కలెక్టర్ గానీ, ఆర్డీఓ గానీ, తహసీల్దార్ గాని చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విలువైన ప్రభుత్వ అసైన్డ్ భూములను కాపాడాలని కోరుతున్నారు.

Next Story